సాక్షి మీద కేసు పెట్టిన టీటీడీ
సాక్షి యాజమాన్యం మీద తిరుపతి తిరుమల దేవస్థాన యంత్రాంగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
సాక్షి యాజమాన్యంపై తిరుమలలో మంగళవారం కేసు నమోదైంది. తిరుపతి తిరుమల ఫిర్యాదు మేరకు సాక్షి యాజమాన్యంపై తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా సాక్షి పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించిందని, దీనిలో వాస్తవాలేమీ లేవని పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది.
శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఈ నెల 5న టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్ష మీద సాక్షి పత్రికలో అసత్య కథనాన్ని ప్రచురించిందని ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సాక్షి యాజమాన్యంపై బీఎస్‌ఎస్ సెక్షన్లు 353(2), 356, 196(1)(ఏ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ నెల 6వ తేదీ సాక్షి పత్రిక 13వ పేజీలో ‘నేను చూసుకుంటా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంలో అన్నీ అసత్యాలే ఉన్నాయని డిప్యూటీ ఈవో లోకనాథం ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిలో మన స్టాండ్ ఏంటో మీకు తెలుసు కదా, సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పటయ్యే సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకేమాట చెప్పాలి, ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి అని చంద్రబాబు సమీక్షకు హాజరైన అధికారులకు చెప్పినట్లుగా కథనం ప్రచురించారని ఆయన పేర్కొన్నారు. సాక్షి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే అసత్యాన్ని ప్రచురించిందని, సాక్షి దినపత్రిక యాజమాన్యం, నైతికంగా దానికి సంబంధించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఈవో ఫిర్యాదులో కోరారు.
Next Story