US PRESIDENT | ఇండియా నుంచి అంబానీకే ట్రంప్ ప్రమాణ స్వీకారం పిలుపు
ముఖేశ్ అంబానీ, నీతూ అంబానీ, చైనా అధ్యక్షుడు జీ పెంగ్, ఇటలీ ప్రధాని,.. ఇలా ఎందరెందరో జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారంలో కలవబోతున్నారు. ఆ విశేషాలేంటంటే..
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ.. అసాధారణ భద్రత.. ఎముకలు కొరికే చలి.. మరో 24 గంటల్లో జనవరి 20 సోమవారం డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం.. వేడుకల సందడి మొదలైంది. ట్రంప్ మద్దతుదారులు, మేక్ ఎగైన్ అమెరికా-మాగా- మద్దతుదారులు నగరానికి క్యూ కట్టారు. గడ్డకట్టే చలి వీరి ఉత్సాహాన్ని తగ్గించలేక పోతోంది.
78 ఏళ్ల ట్రంప్, జనవరి 20, సోమవారం, అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాటల్లో చెప్పలేనంత చలి ఉండడంతో వందల, వేల మంది సమక్షంలో జరిగే సంప్రదాయ వెస్ట్ ఫ్రంట్ ప్రాంతం వద్ద కాకుండా, యుఎస్ క్యాపిటల్ రొటండలో లోపలే నిర్వహించబోతున్నారు.
గడ్డకట్టే చలితో వేదిక మార్పు...
"వాషింగ్టన్ డిసి వాతావరణ సూచన ప్రకారం, ఉష్ణోగ్రతలు బాగా తగ్గి తీవ్రమైన చలికి చేరుకోవచ్చు. ఆర్కిటిక్ చలి దేశమంతటా వ్యాపిస్తోంది" అని ప్రకటించింది. దీంతో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ లోపలికి మార్చినట్టు ప్రకటించారు. వాషింగ్టన్ డిసిలో సోమవారం ఉష్ణోగ్రత సుమారు -11°C (మైనస్ 11 డిగ్రీల సెల్షియస్) వద్ద ఉండే అవకాశం ఉంది.
"నేను ఎవరికీ హాని తలపెట్టాలనుకోవడం లేదు. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో, వేలాది మంది 20వ తేదీన కొన్ని గంటల పాటు బయట ఉండడం క్షేమం కాదనే భావిస్తున్నా. వేలాది భద్రతా సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది, పోలీస్ కే-9 కుక్కలు, గుర్రాలు, లక్షల మంది మద్దతుదారుల రక్షణే నాకు ప్రాధాన్యం. అయినా మీరు రావాలనుకుంటే చలి నుంచి రక్షణ కల్పించే సరైన దుస్తులు వేసుకుని రండి" అని ట్రంప్ తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ తేదీన ఇంత చలి ఎన్నడూ లేదు. 1985 జనవరి 20న -14°C కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఆనాటి అధ్యక్ష ప్రమాణ స్వీకారం వేడుక క్యాపిటల్ భవనం లోపల నిర్వహించింది.
ట్రంప్ చేసిన ఈ ప్రకటన అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఆయన మద్దతుదారులు దేశం నలుమూలల నుండి నగరానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. వేడుకల కోసం నగరంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. నాలుగేళ్ల గ్యాప్ తరువాత ట్రంప్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
ట్రంప్ వ్యతిరేక మహిళల ర్యాలీకి ఏర్పాట్లు..
ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్న మహిళలు కూడా 8 ఏళ్ల తర్వాత ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నిరసన తెలిపేందుకు శనివారమే నగరానికి చేరుకున్నారు. దేశ రాజధానిలో మహా ర్యాలీ నిర్వహించాలని వారు తలపెట్టారు. 2016లో ట్రంప్ గెలుపుపై ఆగ్రహంతో మహిళలు 2017లో వాషింగ్టన్‌లో భారీ ర్యాలీలు నిర్వహించారు. సుమారు 5 లక్షల మందితో జరిగిన ఆ ర్యాలీతో వాషింగ్టన్ దద్దరిల్లింది.
ఈ ఏడాది, మొదటి ర్యాలీతో పోలిస్తే కేవలం పదో వంతు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పరాజయం తర్వాత, అనేకమంది ప్రగతిశీల ఓటర్లు మానసికంగా బాగా కుంగిపోయారని సమాచారం. ఈ సారి ర్యాలీ పరిమిత స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు.
ప్రమాణ స్వీకారం నాడు ఏమి జరుగుతుందంటే...
అమెరికా రాజ్యాంగం ప్రకారం జనవరి 20న నూతన అధ్యక్షుని పదవీ కాలం ప్రారంభం అవుతుంది. ఒకవేళ ఆ రోజు ఆదివారం అయితే ఆ మర్నాటి నుంచి పదవీ కాలం మొదలవుతుంది.
-సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నూతన అధ్యక్షునితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్ అధ్యక్షుడు ట్రంప్ తో ప్రమాణ స్వీకారం చేయించడం ఇది రెండో సారి. గతంలో కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు.
-ప్రమాణ స్వీకారం తర్వాత అధ్యక్షుడు తొలి ప్రసంగం చేస్తారు. ఉపాధ్యక్షుడు (వైస్ ప్రెసిడెంట్) జేడీ వాన్స్ కూడా అదే వేదిక నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారు.
2.20 లక్షల మందికి ప్రవేశ టికెట్లు
-ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వివిధ శాఖల అధికారులు 2లక్షల 20వేల మందికి ఆహ్వాన పత్రాలు పంపారు.
-అధికారిక ఆహ్వాన పత్రం ఉన్నా లోపలికి ప్రవేశించలేని వారి కోసం పెద్ద పెద్ద వీడియో స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
-అమెరికన్ ప్రముఖ సింగర్ క్యారీ అండర్ వుడ్ "అమెరికా ది బ్యూటిఫుల్" పాట పాడతారు.
-అమెరికన్ కంట్రీ సింగర్ (దేశీయ సంగీతం) లీ గ్రీన్ వుడ్ అమెరికన్ నేటివిటీ సాంగ్ ఆలాపిస్తారు.
విదేశీ, స్వదేశీ అతిధులు ఎవరెవరంటే...
-బిలియనీర్లందరూ హాజరవుతున్నారు. వారిలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జూకర్ బెర్గ్, చైనా టిక్ టాక్ జెయింట్ షౌ చీ ఉన్నారు.
-తాజాగా మాజీ కానున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, బతికున్న మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా హాజరవుతున్నారు.
-ట్రంప్ ప్రత్యేకంగా ఆహ్వానించిన వారిలో ఇటలీ, హంగరీ ప్రధానమంత్రులు జార్జియా మెలోనీ, విక్టర్ ఒర్బాన్, అర్జెంటైనా అధ్యక్షుు జేవియర్ మిలై, చైనా అధ్యక్షుడు జీ పింగ్ ఉన్నారు. వీరి రాక ఇంకా ఖరారు కాలేదు.
ఇండియా నుంచి అంబానీలకే ఆహ్వానం..
ట్రంప్ నుంచి ఆహ్వానం అందుకున్న భారతీయ ప్రముఖుల్లో ఏకైక పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ. ఆయన్ని తన శ్రీమతి నీతూ అంబానీతో కలిసి రావాల్సిందిగా ట్రంప్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. వారిద్దరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు సమాచారం. ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వారికి ఆహ్వానాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించేది ఇంకా ఖరారు కాలేదు.
ప్రమాణం చేసిన తర్వాత ట్రంప్ ఏం చేస్తారంటే...
దేశాధ్యక్షునిగా ప్రమాణం చేసిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది. డజన్ కి పైగా కార్యాక్రమాలలో పాల్గొనాలి. సోమవారం రాత్రి అట్టహాసంగా ఏర్పాటు చేసిన కనీసం మూడు గ్రాండ్ గలా విందుల్లో ఆయన పాల్గొనాలి. ట్రంప్ ప్రాధాన్యాన్ని బట్టి ఈ షెడ్యూల్ ఉంటుంది.
Next Story