
వీర జవాన్ మురళీ నాయక్‌కు ఘన నివాళులు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఇండియా–పాకిస్తాన్ యుద్ధంలో జరిగిన పోరాటంలో నేలకొరిగిన వీర జవాన్ మురళీ నాయక్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, సవిత, అనిత, సత్యప్రసాద్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి వీర జవాన్ మురళీ నాయక్ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతిలను ఓదార్చే ప్రయత్నం చేశారు. కుమారుడు మురళీ నాయక్‌ను గుర్తు చేసుకొని తల్లిదండ్రులు బోరున విలపించారు. పవన్ కల్యాణ్, నారా లేకేష్ గుండెలకు హత్తుకుని కన్నీరు మున్నీరయ్యారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు విలపిస్తున్న సందర్భం పవన్ కల్యాణ్, లోకేష్‌లకు దుఃఖాన్ని తెప్పించింది. వారు కూడా కంటతడి పెట్టారు. మురళీ నాయక్ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తరపున మురళీ నాయక్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీర జవాన్ మురళీ నాయక్ కుటంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీ నాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం నుంచి మురళీ నాయక్ కుటుంబానికి ఐదెకరాల పొలంతో పాటు 300 గజాల ఇంటి స్థలం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.