Divi Seema/వారి ఆత్మ శాంతికి నేటికీ కొవ్వొత్తులతో నివాళి
x

Divi Seema/వారి ఆత్మ శాంతికి నేటికీ కొవ్వొత్తులతో నివాళి

ఇది 47 ఏళ్ల నాటి సంఘటన. దివిసీమ ఉప్పెన. కొన్నివేల మంది ప్రాణాలు మట్టిలో కలిసిన రోజు. ఇంత ఘోరం వందేళ్ల క్రితం మచిలీపట్నంలోనూ జరిగింది.


ఆంధ్రప్రదేశ్ లో ధాన్యాగారంగా పేరొందిన దివిసీమ ఉప్పెన ధాటికి 1977 నవంబరు 19న నేలమట్టమైంది. ఈ ఉప్పెనలో 14,204 మంది చనిపోయినట్లు అప్పట్లో ప్రభుత్వం లెక్కలు తేల్చింది. ఆ లెక్కలు సరైనవి కావనే ఆరోపణలపై నాడు ఐదుగ్గురు అధికారులు కూడా అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిజానికి ఎంత మంది చనిపోయారో లెక్క తేల్చడం కూడా కష్టమే. ఎందుకంటే ఇళ్లు పూర్తిగా కొట్టుపోయాయి. ఇళ్లలో ఉన్న వారు కూడా నీటిలో కొట్టుకు పోయారు. కుటుంబాలకు కుటుంబాలు కొట్టుకుపోవడంతో తమ వారు పోయారని చెప్పేందుకు కూడా మనుషులు లేకుండా పోయారు. అందువల్ల లెక్కలు నిజమని చెప్పలేము. సుమారు 40 వేల మంది వరకు సముద్రానికి బలయ్యారని అప్పటి వారు చెబుతుంటారు. చెట్లు కూడా వేళ్లతో సహా సముద్రం లాక్కుపోయింది. ఇసుక గ్రామాల్లో దిబ్బలు వేసింది. ఇసుక దిబ్బల కింద వందల మంది సమాధయ్యారు. శవాలను వారం రోజుల పాటు వెలికి తీసి ఎక్కడికక్కడ పూడ్చి వేశారు. స్వచ్చంద సేవా సంస్థలు, అప్పట్లో ఆర్ఎస్ఎస్ వారు అక్కడి వారికి అన్నం వండిపెట్టారు.

దివిసీమ అని ఎందుకు అంటారు..

అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద కృష్ణానది రెండు పాయలుగా చీలుతుంది. ఒకపాయ నాగాయలంక మండలం గుల్లలమోదువద్ద, మరోపాయ కోడూరు మండలం హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తాయి. ఈ రెండు పాయల మద్య ఏర్పడిన గడ్డను ఒక దీవిగా పిలుస్తారు. కృష్ణా జలాలు రెండు వైపుల తూర్పు వైపున సముద్దం ఉండటం వల్ల మధ్యలో దీవి ఏర్పడింది. మధ్యలో ఏర్పడిన గడ్డపై సుమారు 50 గ్రామాల వరకు ఉన్నాయి. ఈ గడ్డను దీవిగానూ, దీవిపై ఉన్న గ్రామాలను పల్లెలుగానూ పిలుస్తారు. పల్లెలకు మరో పేరు కూడా ఉంది. సీమ అని కూడా అంటారు. ఈ విధంగా దివిసీమగా పేరు వచ్చింది.

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలు దివిసీమలో ఉన్నాయి. దివిసీమ అంటే ఎంతో మందికి అన్నం పెట్టిన తల్లి. అటువంటి దివిసీమను ఉప్పెన కాటేసిన రోజు అన్నం కోసం అక్కడి వారు పడిన బాధ చెప్పేందుకు అలవి కాదు. సుమారు 300 కోట్ల సంపద ఆవిరైన రోజు నేడు. తిరిగి అక్కడి వారు నిలదొక్కుకునేందుకు ఏళ్లు పట్టాయి. ఉప్పెన వచ్చిన సమయంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ కూడా వచ్చి ఉప్పెన ధాటికి ఇసుక దిమ్మెలు వేసిన గ్రామాలను పరిశీలించారు. ప్రభుత్వ పరంగా నాడు వారిని ఆదుకోవడంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, మానవతా వాదులు ముందుకు వచ్చారు. ప్రాణాలు దక్కించుకున్న వారికి కొద్ది రోజులు అక్కడే సహపంక్తి భోజనాలు కూడా పెట్టారు. పండుకునేందుకు కొందరు దాతలు దుప్పట్లు కొని ఇచ్చారు. దివిసీమ ఉప్పెన వల్ల జరిగిన ఘోరం ఎప్పటికీ ఆ కుటుంబాల్లో భయాన్ని పుట్టిస్తూనే ఉంటుంది.

ఉప్పెనను గుర్తుచేసుకుంటూనే ఉన్న పార్టీలు, పోలీసులు

దివిసీమను ముంచెత్తిన ఉప్పెనకు దుర్మరణం పాలైన వారి ఆత్మశాంతికి నేటికీ రాజకీయ పార్టీలు, పలు సంఘాల వారు మృతుల గుర్తుగా నిర్మించిన స్థూపాల వద్ద ప్రతి సంవత్సరం కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేస్తారు. ఈ రోజు కూడా తెలుగుదేశం, జనసే, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల వారు పులిగడ్డలో నిర్మించిన స్థూపం వద్ద నివాళులర్పించారు. సొర్లగొందిలో పోలీసులు ఏర్పాటు చేసిన స్థూపం వద్ద పోలీసులతో పాటు పలువురు నివాళులర్పిస్తారు. ఓ యువతి బురద నీటిలో కొట్టుపోతుంటే పోలీసులు కాపాడారు. అందుకు గుర్తుగా అదే విధమైన శిల్పాన్ని ఏర్పాటు చేశారు. సొర్లగొంది గ్రామానికి నాటు పోలీసులు దత్తత తీసుకుని గ్రామస్తులు కోలుకునే వరకు సపర్యలు చేశారు. అందుకే అక్కడ పోలీసు సేవలకు గుర్తుగా పలు బొమ్మలు ఏర్పాటు చేశారు.

నేలమట్టమైన గ్రామాలు

దివిసీమలోని పాలకాయతిప్ప, హంసలదీవి, ఇరాలి, ఊటగుండం, గొల్లపాలెం, బసవవానిపాలెం, ఉల్లిపాలెం, ఏటిమొగ, సొర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట్ల, ఏలిచెట్లదిబ్బలు నాడు ఇసుక దిబ్బలుగా మారాయి. ఈ గ్రామాల్లో కొన్నింటి పేర్లు కూడా ఇప్పుడు మారిపోయాయి. ఆ గ్రామాల స్థానంలో పక్కా భవనాలు ప్రభుత్వాలు నిర్మించాయి. దివిసీమ ఉప్పెన సమయంలో ఇందిరాగాంధీ ప్రతిపక్షంలో ఉన్నారు. మొరార్జీదేశాయ్ నాడు ప్రధాన మంత్రిగా ఉన్నారు. అన్ని వైపుల నుంచి ఆపన్నహస్తం అదించడంతో ఇన్నేళ్లలో తిరిగి దివిసీమ కోలుకో కలిగింది. నేడు ఆ స్థూపాలు, నాటి గుర్తులు చూపించి పూర్వీకులు చెబుతుంటే వినేవారి వళ్లు జలదరిస్తుందని స్థానికులు చెబుతుంటారు. నేడు పార్టీలు నాటి మృతులకు నివాళులర్పించడం తప్ప బంధువులు నివాళులర్పించడం మరిచిపోయారు.

Read More
Next Story