
విశాఖ తీరాన గిరిజన జాతర
విశాఖలో డిసెంబర్ 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే 'పెసా మహోత్సవ్' వేడుకలను పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు.
గిరిజన ప్రాంతాల్లో స్వయం పాలనను బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించిన ‘పెసా’ చట్టం వార్షికోత్సవాన్నిపురస్కరించుకుని, విశాఖపట్నంలో డిసెంబర్ 23, 24 తేదీల్లో ‘పెసా మహోత్సవ్’ నిర్వహించనున్నారు. ఈ జాతీయ స్థాయి మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్.. ఇలా మొత్తం 10 రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారు. దాదాపు 2,000 మంది పంచాయతీ ప్రతినిధులు, గిరిజన నాయకులు, క్రీడాకారులు, సాంస్కృతిక కళాకారులు ఈ వేడుకల్లో తమ ప్రతిభను చాటనున్నారు. వేడుకల ప్రధాన కార్యక్రమం విశాఖ పోర్ట్ అథారిటీ క్యాంపస్‌లో జరగనుండగా, ఆర్కే బీచ్, ఇండోర్ స్టేడియం, కలావాణి ఆడిటోరియాల్లో వివిధ సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహిస్తారు.
కీలక నిర్ణయాలు - ప్రారంభోత్సవాలు:
ఈ మహోత్సవం సందర్భంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక సాంకేతిక పరికరాలను కేంద్రం ప్రారంభించనుంది.
పెసా పోర్టల్ (PESA Portal): చట్టం అమలు తీరును పర్యవేక్షించడానికి, సమాచార మార్పిడికి ఉపయోగపడుతుంది.
పెసా సూచికలు (PESA Indicators): ఏ రాష్ట్రంలో చట్టం ఎంతవరకు అమలవుతుందో అంచనా వేయడానికి ఈ సూచికలు తోడ్పడతాయి.
గిరిజన భాషల్లో శిక్షణ: గిరిజన భాషల్లోనే చట్టంపై అవగాహన కల్పించేలా శిక్షణా మాడ్యూల్స్‌ను విడుదల చేస్తారు.
పెసా చట్టం నేపథ్యం:
డిసెంబర్ 24, 1996న భారత ప్రభుత్వం ఈ పెసా చట్టాన్ని తీసుకొచ్చింది. గిరిజన గ్రామ సభలకు తమ భూమి, నీరు, అడవిపై పూర్తి హక్కులను కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం. ఈ 29 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ 'ఉత్సవ్ లోక్ సంస్కృతి కా' (జానపద సంస్కృతుల పండగ) అనే నినాదంతో ఈ వేడుకలు జరగనున్నాయి.
గ్రామ సభలకు ఉండే ప్రత్యేక అధికారాలు
పెసా చట్టం (Panchayats Extension to Scheduled Areas Act) గిరిజన ప్రాంతాల్లోని గ్రామ సభలకు ‘స్వయం పాలన’ దిశగా అత్యున్నత అధికారాలను కల్పించింది. ప్రధానంగా ‘జల్, జంగిల్, జమీన్’ (నీరు, అడవి, భూమి) పై గిరిజనులకే పూర్తి హక్కులు ఉండేలా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.
భూసేకరణపై నియంత్రణ:
గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించాల్సి వస్తే, తప్పనిసరిగా గ్రామ సభ అనుమతి తీసుకోవాలి. అలాగే గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకునే అధికారం వీరికి ఉంటుంది.
సహజ వనరుల యాజమాన్యం: అడవిలో లభించే చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై (Minor Forest Produce) యాజమాన్య హక్కులు గ్రామ సభలకే ఉంటాయి. ఇసుక, రాళ్లు వంటి చిన్న తరహా ఖనిజాల తవ్వకాలకు కూడా గ్రామ సభ అనుమతి తప్పనిసరి.
అభివృద్ధి పథకాల ఆమోదం: గ్రామంలో అమలు చేసే సామాజిక, ఆర్థిక అభివృద్ధి పథకాలను, వాటి లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం గ్రామ సభకే ఉంటుంది.
మత్తు పదార్థాల నియంత్రణ: గ్రామంలో మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల అమ్మకం, వినియోగాన్ని నియంత్రించే లేదా నిషేధించే అధికారం గ్రామ సభకు ఉంది.
సంప్రదాయాల పరిరక్షణ: గిరిజన ఆచారాలు, సంప్రదాయాలు, వారి సాంప్రదాయ వివాద పరిష్కార పద్ధతులను కాపాడుకునే అధికారం ఈ చట్టం కల్పిస్తుంది.
ప్రారంభోత్సవం:
డిసెంబర్ 23న (మంగళవారం) ఉదయం 10:00 గంటలకు విశాఖ పోర్ట్ అథారిటీ క్యాంపస్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ మహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.
ముఖ్య కార్యక్రమాలు:
డిసెంబర్ 23: పవన్ కల్యాణ్ 10 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులతో సమావేశమవుతారు. గిరిజన క్రీడాకారులు, కళాకారుల ప్రదర్శనలను తిలకిస్తారు.
డిసెంబర్ 24: పెసా చట్టం అమలై 29 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ రోజును ‘పెసా డే’గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సమక్షంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ‘పెసా పోర్టల్’ , ‘పెసా సూచికలను’ లాంచ్ చేయనుంది. ఈ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి, వాటిని డిజిటల్ పద్ధతిలో విశాఖ వేదికతో అనుసంధానం చేయనున్నారు. ఈ మహోత్సవం కేవలం వేడుకగా మాత్రమే కాకుండా, గిరిజన ప్రాంతాల్లో గ్రామ సభలను మరింత పటిష్టం చేసేందుకు ఒక మార్గదర్శిగా నిలువనుంది.

