వణికిపోతున్న ‘లేక్ వ్యూ’ రియాల్టర్లు
బిల్డర్ల వెనుక ఎంఎల్ఏలున్నా, బడా పారిశ్రామికవేత్తలున్నా సరే హైడ్రా పట్టించుకోకుండా బుల్డోజర్లు, పొక్లైయినర్లను తీసుకువెళ్ళి కూల్చేస్తున్నది హైడ్రా.
ఇంతలో ఎంత మార్పు వచ్చేసింది. ఆకాశంవైపుకు దూసుకుపోతోంది అనుకున్న రియల్ ఎస్టేట్ రంగంలో అతిపెద్ద కుదుపు. ‘హైడ్రా’ ఏర్పాటైన దగ్గర నుండి రియల్ రంగంలో కలకలం పెరిగిపోయింది. ఒకపుడు లేక్ వ్యూ అనే ఎరను వేసి రియాల్టర్లు కస్టమర్ల దగ్గర అధిక ధరలు వసూలుచేసి తమ విల్లాలు, ఫ్లాట్లను ప్రీమియర్ ధరకు అమ్ముకునేవారు. కొనుగోలుదారులు కూడా లేక్ వ్యూ ప్రాపర్టీలు కొనేందుకు ఎక్కువ మక్కువ చూపించేవారు. అలాంటిది ఇపుడు సీన్ రివర్సయిపోయింది. చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించేసి చాలామంది రియాల్టర్లు వెంచర్లు వేసి విల్లాలు, ఫ్లాట్లను అమ్ముకున్నారు. నగరం శివార్లలోని వేలాదిచెరువులు ఇపుడు వందలసంఖ్యకు తగ్గిపోయాయంటే రియాల్టర్లే ప్రధాన కారణం. రియాల్టర్లు మాత్రమేనా అంటే కాదనే చెప్పాలి. వీరికి రాజకీయ, అధికార దన్ను కూడా తోడవ్వటంతో సంవత్సరాలపాటు రియల్ వ్యాపారాలను ఇష్టారాజ్యంగా సాగించుకున్నారు.
అలాంటిది గడచిన రెండు నెలలుగా అంటే ఎప్పుడైతే హైడ్రా ఏర్పాటైందో అప్పటినుండి రియాల్టర్లకు ఇబ్బందుల్లో పడిపోయారు. ఏర్పాటు అవ్వటమే ఆలస్యం కమీషనర్ ఏవీ రంగనాధ్ ఆధ్వర్యంలో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టేసింది. చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించి నిర్మించిన వాటినికి అక్రమనిర్మాణాలుగా ప్రకటించి ఎక్కడికక్కడ కూల్చేస్తోంది. అపార్టమెంట్లలో ఉంటున్నవారికి నోటీసులు జారీచేసి ఖాళీచేసేందుకు కొంత సమయం ఇచ్చి తర్వాత కూల్చేస్తోంది. నిర్మాణాల్లో ఉన్నవాటికి అయితే నోటీసులు కూడా ఇవ్వకుండానే హైడ్రా కూల్చేస్తోంది. బిల్డర్ల వెనుక ఎంఎల్ఏలున్నా, బడా పారిశ్రామికవేత్తలున్నా సరే హైడ్రా పట్టించుకోకుండా బుల్డోజర్లు, పొక్లైయినర్లను తీసుకువెళ్ళి కూల్చేస్తున్నది హైడ్రా.
దాంతో బిల్డర్లు, రియాల్టర్లలో కలకలం పెరిగిపోతోంది. ఇపుడు విషయం ఏమిటంటే ఒకపుడు లేక్ వ్యూ అని చెప్పి తమ విల్లాలు, ఫ్లాట్లను అత్యధిక ధరలకు అమ్ముకున్న రియాల్టర్లకు ఇపుడు చుక్కలు కనబడుతున్నాయి. ఎందుకంటే లేక్ వ్యూ అని ఉన్న ప్రాపర్టీలను కొనటానికి ఎవరూ ఆసక్తిచూపటంలేదు. తాము ఇపుడు కొనుగోలుచేసినా హైడ్రా కూల్చేస్తుందనే భయం కొనుగోలుదారుల్లో బాగా పెరిగిపోయింది. తమ ప్రాపర్టీ బఫర్ జోన్ లేదా ఎఫ్టీఎల్ పరిధిలో లేదని బిల్డర్లు మొత్తుకుంటున్నా కొనుగోలుదారులు లేక్ వ్యూ ప్రాపర్టీలను కొనటానికి ఇష్టపడటంలేదు. అలాగే రియాల్టర్లు, బిల్డర్లతో మాట్లాడే సమయంలోనే బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో విల్లాలు, అపార్టుమెంట్లు ఉన్నాయా లేవా అనే విషయాలను నిర్ధారించుకుంటున్నారు. ఇదే విషయమై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతో పాటు ఎందుకైనా మంచిదని లాయర్లను కూడా కొనుగోలుదారులు సంప్రదిస్తున్నారు. దాంతో చెరువులు, కాల్వలు, కుంటలకు దగ్గరలో నిర్మించిన ప్రాపర్టీలను కొనటానికి ఎవరూ ఇష్టపడటంలేదు.
పరిస్ధితిని అర్ధంచేసుకున్న రియాల్టర్లు, బిల్డర్లు తమ అడ్వర్టైజ్మెంట్లలో నుండి లేక్ వ్యూ అనే పదాన్ని తీసేస్తున్నారు. నగరంలో ఎక్కడచూసినా పెద్దపెద్ద హోర్డింగులతో వివిధ కంపెనీల రియల్ వెంచర్లు కనబడుతునే ఉంటాయి. వాటన్నింటిలో ప్రముఖంగా లేక్ వ్యూ అని ఉంటుంది. మిగిలిన ప్రాపర్టీల ధరలకన్నా లేక్ వ్యూ ప్రాపర్టీల ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. లేక్ వ్యూ బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ధరలు ఎక్కువైనా సరే జనాలు ఒకపుడు కొనుగోలుచేసేవారు. ఇదంతా ఎప్పుడంటే రెండునెలలకు ముందుమాట. ఇపుడు లేక్ వ్యూ లేదు, చెరువులు, కుంటాలు, కాల్వలకు దగ్గరలోని ప్రాపర్టీలు కూడా అమ్ముడుపోవటం కష్టంగా తయారైంది. ఒకపుడు ఒప్పందాలు చేసుకున్నవారు కూడా ఇపుడా ఒప్పందాలను రద్దుచేసుకుంటున్నట్లు సమాచారం.
మియాపూర్ మక్తా, ఖాజాగూడ, నల్లగండ్ల చెరువు, దేవుని కుంట, నానక్ రూమ్ గూడ, ఉప్పల్, దుర్గంచెరువు తదితర ప్రాంతాల్లో రియాల్టర్లు, బిల్డర్లకు హైడ్రా రూపంలో చాలా పెద్ద దెబ్బపడింది. వందలాది ప్రాపర్టీలు అమ్ముడుపోవటంలేదు. ఇదే సమయంలో ఇచ్చిన అడ్వాన్సులను వెనక్కు తీసుకునే వాళ్ళసంఖ్య కూడా పెరిగిపోతోంది. దాంతో రియల్ రంగంపై హైడ్రా దెబ్బ ఏస్ధాయిలో పడిందో అర్ధమైపోతోంది. కొత్త ప్రాపర్టీలకే కాదు సెకండ్ సేల్స్ కు కూడా ఇదే పరిస్ధితి ఎదురవుతోంది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పేరుతో తమ ప్రాపర్టీలను హైడ్రా కూల్చేస్తుందనే భయంతో ఏదో ధరకు అమ్ముకుని బయటపడదామని అనుకుంటున్న ఓనర్లు ఇపుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
సంతోషించాల్సిన విషయం
ఇదే విషయమై రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ) సర్టిఫైడ్ ఏజెంట్ సైదులు ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు ఇప్పటికైనా ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటుచేసినందుకు సంతోషించాలన్నారు. నగరం చుట్టుపక్కల కొన్నివేల చెరువులు, కాల్వలను ఆక్రమించి కట్టేసిన నిర్మాణాలు కొన్ని వేలుంటాయన్నారు. రెరా అనుమతులు తీసుకున్న బిల్డర్లలో చాలామంది ప్రభుత్వ నిబంధనలను పాటిస్తారని చెప్పారు. ఇదే సమయంలో కొందరు బిల్డర్లు రెరా అనుమతులు తీసుకోకుండానే చేస్తున్న, చేసిన నిర్మాణాలు కూడా ఉన్నాయన్నారు. నగరంలోని పశ్చి, ఉత్తరం జోన్లలోని అమీన్ పూర్, గుండ్లపోచంపల్లి, పటాన్ చెరు, బాచుపల్లి ప్రాంతాల్లోని చాలా వెంచర్లు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయని చెప్పారు.
చెరువులు, కుంటలు, కాల్వలను పరిరక్షించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికైనా అనుకోవటం చాలా సంతోషించాల్సిన విషయమని సైదులన్నారు. ఇదే సమయంలో చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించకుండా, బఫర్ జోన్ లేదా ఎఫ్టీఎల్ పరిధికి దూరంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీలకు డిమాండు పెరుగుతున్నట్లు చెప్పారు. అన్నీ నిబంధనలు పాటించి, బఫర్ జోన్, ఎప్టీఎల్ పరిధిలోని ప్రాపర్టీల కొనుగోలుకే ఇఫుడు జనాలు ఆసక్తిచూపుతున్నట్లు సైదులు చెప్పారు. దీనికి హైడ్రాకు థ్యాంక్స్ చెప్పాలన్నారు.