పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న 17 ఏళ్ల కళాకారిణి
x

పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న 17 ఏళ్ల కళాకారిణి

చేతికి అందొచ్చిన కుమార్తె కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లి చినపాప ఆసుపత్రి వద్ద రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.


డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి ముసలమ్మతల్లి ఉత్సవాల్లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భక్తులను అలరించేందుకు వచ్చిన రాజమహేంద్రవరానికి చెందిన యువ కళాకారిణి పాలపర్తి భవ్యశ్రీ (17) ప్రమాదవశాత్తు భవనం మెట్లపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఘటన వివరాలు
రాజోలు మండలం శివకోటి ముసలమ్మతల్లి అమ్మవారి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా భక్తులను అలరించేందుకు రాజమహేంద్రవరం నుంచి పలువురు కళాకారులు శివకోటి చేరుకున్నారు. వేషధారణలు వేసుకోవడం కోసం వీరంతా ఆలయానికి ఎదురుగా ఉన్న మూడు అంతస్తుల కల్యాణ మండప భవనంలోకి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున భవ్యశ్రీ అనే కళాకారిణి మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే తోటి కళాకారులు ఆమెను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే భవ్యశ్రీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో భవ్యశ్రీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చేతికి అందొచ్చిన కుమార్తె కళ్లముందే విగతజీవిగా మారడంతో భవ్యశ్రీ తల్లి చినపాప ఆసుపత్రి వద్ద గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు తోటి కళాకారులను, భక్తులను, స్థానికులను కలచివేసింది.
ఉత్సవ కమిటీ నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఈ ప్రమాదానికి ఉత్సవ కమిటీ నిర్లక్ష్యమే కారణమని సహచర కళాకారులు, స్థానికులు మండిపడుతున్నారు. కళాకారుల కోసం అసంపూర్తిగా ఉన్న భవనంలో బస ఏర్పాటు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మెట్లకు రెయిలింగ్ కూడా లేకపోవడం వల్లే భవ్యశ్రీ జారిపడిందని, అదే రెయిలింగ్ ఉంటే ఈ ప్రమాదం తప్పేదని వారు వాపోతున్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు రాజోలు ఎస్సై రాజేష్‌కుమార్‌ కేసు నమోదు చేశారు. యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వేడుకల కోసం వచ్చి ఒక యువ కళాకారిణి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం శివకోటి గ్రామంలో విషాద ఛాయలు నింపింది.
Read More
Next Story