
విజయవాడ, హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ జామ్
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ భారీగా నిలవడంతో కొన్ని పాయింట్లు దాటడానికి రెండు మూడు గంటల సమయం పడుతోంది
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరస సెలవులు ముగియడంతో సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ చేరుకునేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీశాయి.
చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ వరకు వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా పెద్దకాపర్తి వద్ద నిర్మాణంలో ఉన్న కొత్త ఫ్లైఓవర్ పనుల కారణంగా ట్రాఫిక్ మరింతగా నిలిచిపోయింది. దీనిపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రయాణం బారి కష్టంగా మారిందని, పైగా రోడ్డు పనుల వలన గంటల తరబడి ఇరుక్కుపోవాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు.
జాతీయ రహదారిపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించే చర్యలు చేపట్టారు. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించేందుకు కృషి చేస్తున్నారు. అయినప్పటికీ రద్దీ ఎక్కువగా ఉండటంతో పరిస్థితి అదుపులోకి రావడానికి సమయం పట్టే అవకాశముంది.
ప్రతిసారీ వరస సెలవుల సమయంలోనే హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీ రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్‌లో పనిచేస్తున్నవారు తమ సొంతూర్లకు వెళ్లి తిరిగి వస్తుండటమే ఇందుకు కారణం. మరోవైపు రహదారి విస్తరణ పనులు, ఫ్లైఓవర్ నిర్మాణం కూడా రద్దీని మరింత పెంచుతున్నాయి.