’కుల పిచ్చితో ఓట్లేస్తే ఇలాగే ఉంటుంది‘ ఏపీ ఓటర్లకు జగ్గారెడ్డి చురకలు
x

’కుల పిచ్చితో ఓట్లేస్తే ఇలాగే ఉంటుంది‘ ఏపీ ఓటర్లకు జగ్గారెడ్డి చురకలు

ఎన్నికల ముందు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఊగిపోతూ మాట్లాడిన పవన్, ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి రాగానే ఆ విషయాన్ని మరిచిపోయారా? అని జగ్గారెడ్డి నిలదీశారు.


విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కుల పిచ్చితో ఓట్లేస్తే ఇలాగే ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చురకలు అంటించారు.

చరిత్రను గుర్తుచేస్తూ..
"విశాఖ ఉక్కు ఉద్యమం ఒక గొప్ప చరిత్ర. 1966లో అమృతరావు గారు చేసిన నిరాహారదీక్ష, ఇందిరాగాంధీ గారు పార్లమెంట్‌లో చేసిన ప్రకటన వల్లనే ఈ ప్లాంట్ సాధ్యమైంది. దీనిని పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఆంధ్రరాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మారిన స్టీల్‌ప్లాంట్‌ను ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారు" అని జగ్గారెడ్డి ఆరోపించారు.
పవన్ కల్యాణ్‌పై విమర్శల జడివాన
ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ స్టీల్‌ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున గొంతు విప్పారని, కానీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. "ఎన్నికల ముందు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఊగిపోతూ మాట్లాడిన పవన్, ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి రాగానే ఆ విషయాన్ని మరిచిపోయారా? పదవి ముఖ్యం తప్ప ప్రజల ఆస్తి ముఖ్యం కాదా?" అని ఆయన నిలదీశారు.
చంద్రబాబు, బీజేపీల తీరుపై మండిపాటు
రాష్ట్ర విభజన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశ సంపదను కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు కులాల ప్రాతిపదికన నాయకులను ఎన్నుకోవడం వల్లే ఇలాంటి దుస్థితి వస్తోందని, ఇప్పటికైనా ఏపీ ప్రజలు ఆలోచించాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేకపోయినా కార్యకర్తలు బలంగా ఉన్నారని, స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి ప్రాజెక్టులు, ఇతర విభజన సమస్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న కేసీఆర్, జగన్‌ల తీరుపై జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. "గతంలో కేసీఆర్ ఏపీకి వెళ్లి జగన్ ఇంట్లో చేపల కూర తిన్నారు.. జగన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ఇంట్లో కోడి కూర తిన్నారు. వారి భేటీలు కేవలం విందులకే పరిమితమయ్యాయి తప్ప, రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించింది లేదు" అని విమర్శించారు. అప్పట్లో మీడియా వారిని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత దిగజారి వ్యవహరించరని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాల మధ్య చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రులు, సంబంధిత శాఖల మంత్రులు నిర్ణయం తీసుకుంటారని, రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కూడా జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సుమారు రూ. 2 లక్షల కోట్ల విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని, ఈ విషయంలో మాజీ సీఎం జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
Read More
Next Story