రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆంధ్రా కేబినెట్ ఆమోదం
x

రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆంధ్రా కేబినెట్ ఆమోదం

ఈస్ట్ కోస్ట్ ముంబై గా విశాఖ అభివృద్ధి


ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం రాష్ట్ర ఆర్థిక పురోగతి, ఉద్యోగ సృష్టి, అభివృద్ధి కోసం సంబంధించిన కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. గత 15 నెలల్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం అనేక పాలసీలు రూపొందించి, 70 వేల ఉద్యోగ అవకాశాలు సృష్టించేలా చర్యలు తీసుకున్నామని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

వివిధ పాలసీలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇచ్చి, రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా సుమారు 70 వేల ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఎస్‌ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు) మీటింగ్‌లో చర్చించిన ప్రాజెక్టులకు కూడా ఆమోదం లభించింది. టాటా పవర్ రెన్యూవబుల్ లిమిటెడ్ ప్లాంట్, చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూలు జిల్లాలో రిలయన్స్ కన్సూమర్ ప్రాడక్ట్స్ రూ.758 కోట్లతో ఫ్యాక్టరీ నెలకొల్పనుంది, దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి వెల్లడించారు. తోటపల్లి బ్యారేజి నుంచి 24 ఎంసీఎం (మిలియన్ క్యూబిక్ మీటర్లు) నీటిని కేటాయించడంతో పాటు, ఆవిరి నష్టాల కోసం అదనపు నీటిని కేటాయించే నిర్ణయం తీసుకున్నారు. టూరిజం పాలసీని గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించిన మంత్రి, దీని కోసం ప్రత్యేక ల్యాండ్ పార్సిల్స్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఈ పాలసీ కీలకమని పేర్కొన్నారు.

గత 15 నెలల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పాలసీలు రూపొందించామని, ఇవి ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకున్నవని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఆర్థిక పురోగతి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అభివృద్ధిలో ఈ కేబినెట్ నిర్ణయాలు మైలురాయిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పర్యాటకం, ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు ఆదేశాలు:

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగ సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రజలకు చేరవేయాలని సూచించారు. విశాఖపట్నంను అంతర్జాతీయ స్థాయి నగరంగా, ఈస్ట్ కోస్ట్‌లో ముంబై తరహా హబ్‌గా తీర్చిదిద్దాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Read More
Next Story