రైళ్లను నడిపే లోకో పైలెట్ల మరుగు అవస్థలు తీరనున్నాయా? దశాబ్దాలుగా వీరు పడుతున్న మల, మూత్ర బాధలు ఇకపై తొలగిపోనున్నాయా? అవుననే అంటున్నాయి రైల్వే వర్గాలు.
రైలు బోగీల్లోనే తప్ప ఇంజన్లలో మరుగు దొడ్ల సదుపాయం లేదన్న సంగతి తెలిసిందే. రైల్వే వ్యవస్థ ప్రారంభమైన 1853 నుంచి రైలింజన్లలో టాయిలెట్లు లేకుండానే లోకో పైలట్లు బండి నడుపుతూ వస్తున్నారు. మొదట్లో బొగ్గు/స్టీమ్ ఇంజన్లుండేవి. అందువల్ల వాటిలో మరుగుదొడ్ల ఏర్పాటుకు వీలుండేది కాదు. ఆ తర్వాత డీజిల్ ఇంజన్లు, కొన్నేళ్ల తర్వాత ఎలక్ట్రిక్ ఇంజన్లు అందుబాటులోకి వచ్చినా టాయిలెట్ల సదుపాయానికి నోచుకోలేదు. రైల్వేలో ఎంతగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా ఇంజన్లలో టాయిలెట్లు ఏర్పాటుకు అడుగు ముందుకు పడలేదు. లోకో పైలట్లు వీటి గురించి అవస్థలు పడుతుండడం, టాయిలెట్ల అవసరాన్ని ఏళ్ల తరబడి చెబుతున్నా వివిధ కారణాలు చూపుతూ మరుగుదొడ్ల సదుపాయం మరుగున పడుతూనే ఉంది. అయినప్పటికీ లోకో పైలట్లు అవస్థలు పడుతూనే రైళ్లలో విధులు నిర్వహిస్తూ వస్తున్నారు.
రైలింజన్‌లో పురుష లోకో పైలెట్
బోగీల్లోనే టాయిలెట్లు..
రైలు బోగీల్లో ఇరువైపులా రెండేసి చొప్పున నాలుగు మరుగుదొడ్లు ఉంటాయి. ఇవి ఆ రైలులో ప్రయాణించే వారి అవసరాలు తీరుస్తుంటాయి. కానీ రైలింజన్లలో మాత్రం టాయిలెట్లు ఉండవు. దీంతో రైళ్లను నడిపే లోకో పైలట్లు (డ్రైవర్లు) తమ మలమూత్ర విసర్జన అవసరాలను అతి కష్టమ్మీద అదుపు చేసుకుంటున్నారు. దీనివల్ల వీరికి కీడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, క్రానిక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళా లోకో పైలట్లు డైపర్లు వాడుతుండడంతో వారికి ఆ ప్రదేశంలో ఎర్రని చారలు (రాషెస్) ఏర్పడుతున్నాయి. మరికొందరిలో పెల్విక్ ఇన్ఫెక్షన్ ఇబ్బందులు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం మూత్ర విసర్జన కోసం రైళ్లను మార్గమధ్యలో ఆపడానికి వీల్లేదు. అందువల్ల ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో స్టేషన్లలో రైలు ఆగినప్పుడు బోగీల్లోని మరుగుదొడ్లకు లేదా స్టేషన్లలో ఉన్న పరుగు పరుగున వెళ్లి మూత్ర విసర్జన చేసి తిరిగి రైలింజనులోకి ఎక్కుతారు. ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు ప్రతి 50–100 కి.మీలకు ఒక హాల్ట్ ఉంటుంది. అదే శతాబ్ది, రాజధాని వంటి రైళ్లయితే ఐదారు గంటల వరకు హాల్ట్ స్టేషన్ రాదు. ఈలోగా వీరికి టాయిలెట్ అవసరం వస్తే చెప్పనలవి కాని పాట్లు పడాల్సిందే. మరో ఆసక్తికర విషయమేమిటంటే? లోకో పైలట్లు విధులకు హాజరయ్యే ముందు మంచినీళ్లు తాగితే మార్గమధ్యలో మూత్ర విసర్జన అవసరమేర్పడుతుందన్న ఉద్దేశంతో మంచినీళ్లు తగినన్ని తాగవద్దని సూచిస్తారని చెబుతున్నారు. దీంతో వీరు విధిలేని పరిస్థితుల్లో నీళ్లు తాగడం తగ్గించేసుకుంటున్నారు. వేసవి కాలంలో అయితే వీరి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. రైలింజన్లలో కనీస అవసరాలు తీర్చే మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో లోకో పైలట్ల ఉద్యోగానికి పురుషులతో పాటు మహిళలు అంతగా ఆసక్తి చూపడం లేదు. లోకో పైలట్ కుటుంబంలో మరొకరిని ఆ ఉద్యోగానికి ప్రోత్సహించడం లేదు.
మరుగుదొడ్లకు మార్గం సుగమం..
రైలింజన్లలో మరుగుదొడ్ల ఏర్పాటు ఆవశ్యకతతో పాటు డిమాండ్ రోజురోజుకూ అధికమవుతోంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా లోకోమోటివ్స్ (రైలింజన్ల)లో టాయిలెట్లు సమకూర్చాలని ఇదివరకే రైల్వే మంత్రిత్వశాఖను ఆదేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న (దాదాపు పది వేలకు పైగా) లోకోమోటివ్స్‌లో టాయిలెట్ల ఏర్పాటుకు వీలు పడదు. అందువల్ల రైల్వే శాఖ కొత్తగా వస్తున్న వందేభారత్ రైలింజన్లలో టాయిలెట్ల సదుపాయాన్ని కల్పిస్తోంది. వీటితో పాటు కొత్తగా తయారయ్యే పాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు గూడ్స్ రైలింజన్లలోనూ టాయిలెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. కాగా రైలింజన్లలో టాయిలెట్ల లేమిపై ఇటీవల ‘లోకో పైలట్లకు టాయిలెట్లు అవసరం లేదా’ అనే శీర్షికతో ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (జెడ్‌ఆర్‌యూసీసీ) మెంబర్ కంచుమూర్తి ఈశ్వర్.. రైలింజన్లలో మరుగుదొడ్ల ఏర్పాటుపై తాజా సమాచారాన్ని తెలియజేయాలని ఆర్టీఐ ద్వారా రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు. దీనిపై తూర్పు కోస్తా రైల్వే సమాధానమిస్తూ.. ఇప్పటికే విశాఖపట్నంలో రెండు లోకోమోటివ్స్‌కు నీళ్ల సదుపాయం లేని మరుగుదొడ్ల ఏర్పాటు జరిగిందని, త్వరలో రైల్వే శాఖ కొనుగోలు చేయనున్న 605 (ప్రయాణికుల, గూడ్స్) రైలింజన్లలో టాయిలెట్లను సమకూరుస్తున్నట్టు తెలిపింది. ఇవి అందుబాటులోకి వస్తే చిరకాలంగా లోకోపైలట్ల మరుగుదొడ్ల సమస్యకు ఒకింత పరిష్కారం లభించినట్టవుతుంది.