మీ మెదడు ఎంత భద్రం! ఎప్పుడైనా డాక్టర్ కి చూపించుకున్నారా?
ఇవాళ (అక్టోబర్ 29) బ్రెయిన్ స్ట్రోక్ డే. శరీరంలో ఏ భాగం పని చేయాలన్న కదలిక మెదడు నుంచే ప్రారంభమవుతుంది. ఇటీవలి కాలంలో స్ట్రోక్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి.
కేస్ నెంబర్ -1. చలపతిరావు వయసు 62. బాదరబందీ ఏమీ లేదు. పైకి ప్రశాంతంగా ఉన్నట్టే కనిపిస్తాడు. కానీ ఒక రోజు నిద్రలో ఉన్నట్టుండి కుడి చేయి విపరీతంగా నొప్పి పుట్టడం మొదలైంది. ఒక దశలో తట్టుకోలేక పెద్దపెద్దగా అరిచారు. ఇంట్లో వాళ్లు ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి చేర్చారు. స్ట్రోక్ అన్నారు. కుడి చేతికి పక్షవాతం వచ్చిందన్నారు డాక్టర్లు.
కేస్ నెంబర్-2. పృద్వీ వయసు 33. సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కొత్తగా పెళ్లయింది. వర్క్ ఫ్రం హోం. ఓరోజు ఉన్నట్టుండి ఇంట్లోనే కుప్పకూలిపోయారు. కాళ్లూ చేతులు చచ్చుబడిపోయాయి. బెంగళూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. డాక్టర్లు బ్రెయిన్ స్ట్రోక్ అన్నారు. రక్తనాళాలు చిట్లి పోయాయని చెప్పారు.
సాధార పరిభాషలో మనకు తెలిసిన స్ట్రోక్స్ ఒకటే. అది గుండెపోటు. కానీ మానవశరీరంలో కేంద్రకమైన మెదడుకి కూడా స్ట్రోక్ వస్తుంది. దీని అనర్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
చాలా వాటికి ఉన్నట్టే ఇవాళ (అక్టోబర్ 29) బ్రెయిన్ స్ట్రోక్ డే. శరీరంలో ఏ భాగం పని చేయాలన్న కదలిక మెదడు నుంచే ప్రారంభమవుతుంది. ఇటీవలి కాలంలో స్ట్రోక్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఆహార అలవాట్లు, వారసత్వాలు, జన్యుసంబంధ చిక్కులు వంటివి అనేకం ఇందుకు కారణంగా ఉంటున్నాయి. స్ట్రోక్ వచ్చినపుడు జరిగే అనర్థాలు ఎన్నో. వాటిలో ఒకటి పక్షవాతం. ఇటీవల ఈ కేసులు చాలా ఎక్కువ అయ్యాయి. దీనికి వయోభేదం కూడా లేకుండా పోయింది. ఒకప్పుడు వయసు పైబడిన వారికి వచ్చే బ్రెయిన్‌స్ట్రోక్ ఇప్పుడు చిన్న వయసు వారిలో కూడా కనిపిస్తున్నాయి.
ఈ స్ట్రోక్స్ చిన్న వయసులో ఉన్నవారినీ వెంటాడుతున్నాయి. మెదడులోని రక్తనాళాల్లో చిట్లాయనో, రక్తం గడ్డకట్టిందనో ఇటీవల తరచూ వినపడుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఇవి కారణాలుగా డాక్టర్లు చెబుతున్నారు. అన్ని రోగాలతో పోల్చుకుంటే ఇటీవలి కాలంలో ఈ తరహా స్ట్రోక్స్ 85 శాతం పెరిగాయట. మెదడు రక్తనాళంలో ఏర్పడే గడ్డను కరిగించే మందులను నాలుగున్నర గంటల్లోపే ఇస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయంటున్నారు వైద్యులు.
ఆహార అలవాట్లతో ...
పక్షవాతానికి గురయ్యే వారిలో ఎక్కువ మందికి ఆహార అలవాట్లు సరిగా లేకపోవడమే అంటున్నారు డాక్టర్లు. జన్యుపరమైన కారణాలతో కొందరు చిన్న వయసులోనే బాధితులవుతున్నారు. మన దేశంలో 13శాతం మరణాలకు బ్రెయిన్‌స్ట్రోక్ కారణమవుతోంది. ఆహార అలవాట్లు సరిగా లేనివాళ్లలో 69% మందికి రక్తపోటు, 38% మందికి షుగర్ ఉంటోంది. ఒకసారి పక్షవాతం వచ్చి తిరిగి కోలుకున్న వారు కూడా దాదాపు 5 శాతం మంది మళ్లీ పక్షవాతానికి గురవుతున్నారు.
గత 20,25 ఏళ్లతో పోలిస్తే ఈ వ్యాధులు బాగా పెరిగాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చినందున వ్యాధి నిర్ధారించగానే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అయినా బ్రెయిన్ స్ట్రోక్స్ కేసులు పెరుగుతున్నాయి. అత్యవసర వైద్యాన్ని అందించాల్సిన కేసుల్లో బ్రెయిన్‌స్ట్రోక్ ఒకటి.
ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే...
ఉన్నట్టుండి చేతికో, కాలికో విపరీతంగా నొప్పి వస్తుంది. శరీరం పట్టు తప్పడం మొదలవుతుంది. మాటలు తడబడటం, మనిషి అల్లకల్లోలం కావడం, ఎదుటివాళ్లు మసకమసకగా కనిపిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. ముఖం పాలిపోవడం, కాళ్లు చేతులకు తిమ్మిర్లు, తలనొప్పి, కళ్లు తేలేయడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొందరిలో మూతి కూడా వంకరపోతుంది. ఈ లక్షణాలలో ఏవి కనపడినా వెంటనే వైద్యులను సంప్రదించటం అవసరం. పక్షవాతం లక్షణాలు ఆరంభమైన నాలుగున్నర గంటల్లోపు మందులను ఇవ్వగలిగితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
కారణాలు ఏమై ఉండవచ్చు..
ఉప్పు, తీపీ పదార్థాలపై అదుపు లేకపోవడం, పొగ తాగడం, అతిగా మద్యం సేవించడం, జర్దా, గుట్కా, ఖైనీ నమలటం వంటి వాటివల్ల రావచ్చు. సరైన వ్యాయామం లేకపోవడం కూడా కారణమే. మరో ప్రధాన కారణం- జన్యుసంబంధమైన లక్షణాలు. వారసత్వంగా సంక్రమించే వ్యాధుల్లో ఇదొకటని చెబుతున్నారు. కుటుంబంలో ఎవరికైనా మెదడు సంబంధిత జబ్బులు ఉంటే కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.
Next Story