పీవీ నరసింహారావు ఏకగ్రీవానికి నంద్యాలలో జరిగిన విధ్వంసం ఎంతో!
x

పీవీ నరసింహారావు ఏకగ్రీవానికి నంద్యాలలో జరిగిన విధ్వంసం ఎంతో!

పీవీ నరసింహారావు ఏకగ్రీవ ఎన్నిక కోసం నంద్యాలలో ఎంత విధ్వంసం జరిగిందో తెలుసా? పీవీకి కక్షలు, కార్పణ్యాలకు ఆజ్యం పోశారన్న పేరెందుకు వచ్చిందంటే..


దేశ సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. లెక్కకు మిక్కిలి నామినేషన్లు దాఖలవుతుండగానే తొలి ఫలితం బీజేపీకే దక్కిందంటూ ఆ పార్టీ నేతలు కదం తొక్కుతున్నారు. స్వతంత్ర భారత దేశ 77 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు 35 మంది మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని వ్యాపార కేంద్రమైన సూరత్ నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ ఏకగ్రీవం వెనుక ఎంతో బీభత్సం ఉందని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాపోతోంది.

అభ్యర్థులను బెదిరించారని, ప్రతిపాదకులను కిడ్నాప్ చేశారని, వ్యాపారస్తులకు పుట్టగతులు లేకుండా చేస్తామని హుకుం జారీ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో 1991లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైంది. 'ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో, కులమతాల సుడిగుండాలు బలియైన పవిత్రులెందరో' అని మహాకవి దాశరథి చెప్పినట్టుగా ఈ ఏకగ్రీవాల వెనుక ఎంతటి అల్లకల్లోలం ఉంటుందో కదా..

రాజీవ్ గాంధీ హత్యతో పీవీ నరసింహారావును ప్రధానమంత్రి పదవి వరించింది. అప్పుడు ఆయన్ను నంద్యాల నుంచి ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ నేతలు నానా తంటాలు పడ్డారు. ఎన్నో బెదిరింపులు, కేసులు, కిడ్నాపులు, చివరకు నెత్తుటి జాడలు అనేకం జరిగాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. ఏకగ్రీవం కాకుండానే ఎన్నిక జరిగింది. ఓ అనామకుడి నామమాత్రపు పోటీలో పీవీ 5 లక్షలకు పైగా మెజారిటీ సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కి ఎక్కారు.

ఆవేళ నంద్యాలలో ఏమి జరిగిందంటే...

1991.. అక్టోబర్ 2 నుండి 18 వరకు నంద్యాల ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణకు గడువు. జిల్లా కేంద్రమైన కర్నూలులో పార్టీ నాయకులు తెగబడ్డారు. కాంగ్రెస్ (ఐ) నేతలు గూండాయిజం ప్రదర్శించారు. ఇంత జరుగుతున్నా మౌనమునిగా పేరున్న పివి నరసింహారావు నోరు మెదపకపోవడంతో కాంగ్రెస్ నేతలు తమ అరాచకానికి ఆమోదముద్ర పడినట్టుగా భావించి మరింత తెగబడ్డారు. అవన్నీ తన రాజకీయ ప్రతిష్టను మంటగలుపుతాయని తెలిసినా ఆనాటి ప్రధాని హోదాలో ఉన్న పీవీ మౌనమే వహించారు. ముఠా కుమ్ములాటలతో కత్తులు దూసుకుంటూ ఒకే వరలో ఉంటున్న ఏపీ కాంగ్రెస్ నేతల్ని ఆయన ఏమీ అనలేక కోరలు చాచిన కక్షలు, కార్పణ్యాలకు, చీలీక పేలికలకు ప్రాణం పోశారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఆ సందర్భంలో డాక్టర్ కె.బాలగోపాల్ లాంటి మానవ హక్కుల ఉద్యమకారులు రాసినదాన్ని బట్టి.. హర్యాణాలో దేవీలాల్ ఏకగ్రీవానికి ఆయన, ఆయన కుమారుడు చేసిన దానికి మించి నంద్యాలలో అల్లకల్లోలం జరిగింది.

పీవీ ప్రతిష్ట దెబ్బతిన్నదా?

కర్నూలు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు, నాయకులు సాగించిన గూండాయిజం, ఇతర నేరాలను మౌనంగా సమర్థించడం పీవీ నరసింహారావు రాజకీయ ప్రతిష్టను దెబ్బ తీసింది. రాజకీయాలనుంచి వైదొలుగుదామనుకున్న దశలో పీవీ నరసింహారావుకు అద్భుత అవకాశం వచ్చింది. రాజీవ్ గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ పార్టీకి అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తి కావాల్సి వచ్చారు. ఆయనైతే బాగుంటుందని కాంగ్రెస్ లో అప్పటి వరకు అధికారాన్ని చెలాయించిన నేతలు భావించారు.

భారతీయ పాలకవర్గాలలో చీలికలు పేలికలుగా ఉండి కోరలు చాస్తున్న ముఠాలకు ఆయనైతే తన 'మాయాజాలం'తో ముగుతాడు వేస్తాడనే భావనతో పీవీ పేరును ప్రధాని పదవికి ఏకగ్రీవం చేశారు. ఆయనో గంగిగోవు లాంటి వారని అందరూ భావిస్తే అది కాస్తా తల్లకిందులైంది. పీవీకి ఉన్న ఇమేజ్ ని నంద్యాల ఎన్నిక తల్లకిందులు చేసింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెతను రుజువు చేసింది. ఆసమయంలో పత్రికలలో వచ్చిన వార్తల్ని చూస్తే పీవీ నరసింహారావు కూడా హింసను ప్రోత్సహించడంలో తక్కువేమీ కాదన్నది అర్థమవుతుంది.

నంద్యాల పార్లమెంటు ఎన్నికకు సంబంధించి కర్నూలు కేంద్రంగా ఇంత దారుణం జరుగుతున్నా రాష్ట్ర ప్రజలు కూడా ఆనాడు మౌనంగా ఉండడానికి.. ఓ తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడన్న ఏకైక కారణం కావొచ్చునని డాక్టర్ బాలగోపాల్ రాసిన వ్యాసాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రధానులుగా ఉన్న తెలుగు వాళ్లెవ్వరూ లేరు. అందువల్ల రాకరాక వచ్చిన ఛాన్స్ ను మనంతట మనమే చేతులారా పొగొట్టుకోవడం ఎందుకన్నది ఆనాడు అందరూ లేవనెత్తిన ప్రశ్న. అందువల్ల పోటీ పెట్టకుండా ఉంటే బాగుంటుందని కూడా కొందరు ప్రతిపాదించారు.

పీవీ విద్యావంతుడు, వినయశీలి...

పీవీ నరసింహారావు సంస్కారవంతుడు, విద్యావంతులు, నివేదిత బ్రాహ్మణుడు. అందువల్ల హింస, మూకమనస్థత్వానికి, గుండాగిరి వంటి వాటికి అతీతుడు అనుకున్నారు గాని ఆయన కూడా రాయలసీమలో అనాదిగా వస్తున్న అనాగరిక గూండాగిరికి వంతపాడతారు అనుకోలేదు. నంద్యాలకు మహోన్నతమైన చరిత్ర ఉంది. అత్యవసర పరిస్థితి తర్వాత 1978 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇందిరా గాంధీ ఓడినా ఆంధ్రప్రదేశ్ లో ఒక్క నంద్యాల తప్ప మిగతా అన్ని సీట్లను గెలిచింది. జనతా పార్టీకి చెందిన నీలం సంజీవ రెడ్డిని 1978లో నంద్యాల నుండి పార్లమెంటుకు పంపిన చరిత్ర నంద్యాలకు ఉంది.

'రాయలసీమలోని ఈ ప్రాంత ప్రజలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఆలోచించడం వల్ల ఇది జరుగలేదు. ఈ ప్రాంతంలోని రెడ్డి భూస్వాములు ఆయన్ని (సంజీవరెడ్డి)ని గెలిపించాలని నిర్ణయించుకోవడం వల్లే అలా జరిగిందంటారు' డాక్టర్ బాలగోపాల్. ఇప్పుడు కూడా రాయలసీమ రెడ్లు పీవీని తమ చేతుల్లోకి తీసుకున్నారంటే అందుకు బలమైన కారణం ఉందనడంలో సందేహం లేదు. నంద్యాల నుంచి పీవీని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ వారితో మాట్లాడారు.

ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగుజాతికి గర్వకారణం వంటి తెలివైన పదాల మాటున పార్లమెంటుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు పీవీ వంటి తెలుగు ప్రధానిని వ్యతిరేకించకూడదని రాయలసీమ రెడ్లు ఆదేశించారు. ఎన్టీరామారావు కూడా ఓకే అన్నారు. ఎందుకో విడమరచి చెప్పాల్సిన పని లేదు. టీడీపీ నాయకులకు కూడా హైదరాబాద్, తెలంగాణ పరిసర ప్రాంతాలలో పెద్దఎత్తున వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. పీవీ లాంటి తెలంగాణ వాసికి మద్దతు ఇస్తే బరాబర్ సరిపోతుందని టీడీపీలోని రెడ్లు కూడా సమాధానపరిచారు ఎన్టీఆర్ ని.

సీపీఎం తప్పుబట్టినా పోటీ చేయలేదు..

సీపీఎం టీడీపీ నేతల వైఖరిని ఎగతాళి చేసింది. కానీ పోటీ పెట్టడానికి ముందుకు రాలేదు. సీపీఐ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యం గురించి తరచుగా ఆందోళన వ్యక్తం చేస్తుంటాయే తప్ప రాజకీయాన్ని అస్థిరపరిచే అవకాశం ఉన్న కార్యాచరణలో తమకు తాముగా భాగస్వాములు కాకుండా జాగ్రత్త పడుతుంటాయి. పీవీకి వ్యతిరేకంగా బీజేపీ, మరో రెండు మార్క్సిస్ట్ లెనినిస్టు గ్రూపులు మాత్రమే అభ్యర్థులను పెడతాయమని ముందుకువచ్చాయి.

సై అన్న మోత్కూరు నరసింహులు ...

ఇక చుండూరు మారణకాండ గురించి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఇండిపెండెంట్‌గా అసెంబ్లీకి ఎన్నికైన దళిత ఎంఎల్‌ఏ మోత్కూరు నర్సింహులు కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్ (ఐ) నాయకులు ఇలాంటి ఇండిపెండెంట్లతో మాట్లాడి 'మన తెలుగోడు, తెలుగు జాతికి గర్వకారణం' అనే పేరుతో వారిని పోటీకి రాకుండా నిరోధించే ప్రయత్నం చేశారు. కానీ వారు ఈ రకమైన 'కారణాల్ని' వినడానికి ఇష్టపడలేదు.

ప్రధానమంత్రిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే వారి నిర్ణయం ఫ్యూడల్ ఆలోచన అని, పిచ్చి ఆలోచన అని ఏవోవో వాదించారు. ప్రత్యర్థి అభ్యర్థుల్లో ఎవరో ఒకరిని హత్య చేసి ఎన్నికలను వాయిదా వేయిస్తారేమోనని కూడా కొందరు కాంగ్రెస్ నాయకులు భయపడ్డారు. దానికి తగ్గట్టుగానే వ్యూహాన్నీ రచించినట్టు జరిగిన పరిణామాలను చూస్తే అర్థమవుతుంది.

ఇండిపెండెంట్లకు భద్రత పేరిట కిడ్నాప్..

ఇండిపెండెంట్ అభ్యర్థులను అపహరించి నామినేషన్లు ముగిసే వరకు నిర్భంధంలో ఉంచే అవమానకరమైన నాటకంలో ఏపీసీసీ(ఐ) కార్యదర్శి ప్రకాష్ రెడ్డికి ప్రధాన సహాయకుడిగా నటించిన కర్నూలు మున్సిపాలిటీ చైర్మన్ సుధాకర్ బాబు ఈ భయాన్ని అసంబద్ధంగా కొట్టిపారేసినా అదే పనిని ప్రోత్సహించారు. "భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు విదేశీ శక్తులు ఎంత ఉద్దేశంతో వ్యవహరిస్తున్నాయో మీకు తెలుసు. ఆ శక్తులే రాజీవ్‌ను చంపాయి. ఇప్పుడు ఎన్నికలను వాయిదా వేయించడానికి కుట్రలు పన్నుతున్నాయి. అందుకే పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరో ఒకర్ని కాంగ్రెస్ (ఐ) వాళ్లు చంపుతారని భయపెడుతున్నాయి. అది అసాధ్యం. మన పీవీ ప్రధానిగా కొనసాగాలా? వద్దా?'అన్నారు ఆయన.

ఇదే సందర్భంలో పీవిని ఎక్కడ నుంచి పోటీ చేయించాలనే దానిపై కూడా కాంగ్రెస్ నేతలు ప్రత్యేకించి రాయలసీమ రెడ్లు చాలా కసరత్తు చేశారు. కడప నుంచి పోటీ చేయించాలా లేక నంద్యాల నుంచి పోటీ చేయించాలా అనే దానిపై తర్జనభర్జన పడ్డారు. ముఠాలకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీలోని వైరి వర్గాలు ఎవరి ఆధిపత్యాన్ని వాళ్లు నిలుపుకునేందుకు తంటాలు పడ్డారు. రకరకాల పుకార్లను సృష్టించారు. మరోపక్క ఆవేళ టీడీపీలో ఉన్న తులసి రెడ్డి ఇంకోపక్క వైఎస్ రాజశేఖరరెడ్డి కడప పార్లమెంటు నియోజకవర్గంలో తలెత్తిన హత్యల పుకార్లపై ఖండన మండనలు చేసుకున్నారు.

శవరాజకీయాలు చేసుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమిల్లి జనార్ధనరెడ్డికి వైఎస్ రాజేశేఖరరెడ్డికి అసలు పడదు. ఉప్పు నిప్పుగా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పీవీని కడప నుంచి పోటీ చేయమన్నారు. కడప పివికి సురక్షిత సీటు అని చెప్పారు. కానీ పీవీ తన సొంత కారణాలతో రాజశేఖర్ రెడ్డి కంటే విజయ భాస్కర్ రెడ్డి వైపు మొగ్గుచూపారు. విజయభాస్కరరెడ్డి నంద్యాల సిట్టింగ్ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డిని ఒప్పించారు. గంగుల రాజీనామా చేసి పీవీ కోసం సీటు ఖాళీ చేశారు.

టీడీపీ నిర్ణయం ఇలా..

పీవీని అడ్డం పెట్టుకుని లాభం పొందడం కంటే పరస్పరం ద్వేషించుకుంటున్న కాంగ్రెస్ వర్గాలకే నిర్ణయం వదిలిపెట్టడం మంచిదని టీడీపీ భావించింది. నంద్యాల నుంచి పీవీ గెలుపొందితే విజయ భాస్కర్ రెడ్డికి దక్కబోయే లాభంతో కాంగ్రెస్ వర్గాలే కొట్లాడుకుంటాయని, నంద్యాల ఎన్నికలను అడ్డుకోవడానికి, పెను సంక్షోభం సృష్టించేందుకు కూడా కాంగ్రెస్ వైరి వర్గాలు వెనుకాడబోవని టీడీపీ అంచనా వేసి పక్కకు వైదొలిగినట్టు చెబుతారు.

ఇండిపెండెంట్ అభ్యర్థులు హత్యకు గురవుతారనే భయం కూడా ఈ గ్యాంగ్ వార్ లో భాగమే. వాస్తవానికిది హేతుబద్ధమైన అంశమే. గతంలో అలాంటి అనుభవాలు రాయలసీమలో ఉన్నాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్టు నంద్యాలను ఏకగ్రీవం చేయాలన్నది యత్నం. కేంద్ర న్యాయశాఖ మంత్రి నేతృత్వంలో ప్రధాని పీవీని నంద్యాలకు రప్పించి ఏకగ్రీవంగా ఎన్నిక చేసి పార్లమెంటుకు పంపాలన్నది ఆనాటి రాయలసీమ కాంగ్రెస్ నేతల్లోని ఓ వర్గం నిర్ణయించింది. దానికనుగుణంగా ప్లాన్ చేశారు. మాటల యుద్ధం ప్రారంభించారు. తమ మాట వినని వారిని బెదిరించారు. తిట్టారు. కొట్టారు. కేసులు పెట్టించారు. అటువంటి వార్తలు పత్రికల్లో రాకుండా కూడా చూశారన్నది డాక్టర్ బాల గోపాల్ లాంటి మానవ హక్కుల ఉద్యమ కారుల వాదన.

పీవీ నామినేషన్ వేసిన వేళ..

ఏదైతేనేం, పీవీ నరసింహారావు అక్టోబర్ 10న నామినేషన్ దాఖలు చేశారు. 11 నుంచి 18వ తేదీ వరకు మిగతా వాళ్లెవ్వరూ నామినేషన్లు దాఖలు చేయకుండా ఒక ముఠా కర్నూలు కేంద్రంగా పని చేసింది. కర్నూలు కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లో 50, 60 మంది గూండాలు మకాం వేశారు. జిల్లా సమాచార, ప్రజాసంబంధాల కార్యాలయం ఆవరణలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే ఈ ముఠా తమ వేట కొనసాగించింది. ఆ కాంప్లెక్స్ వైపు ఎవరూ రాకుండా చూశారు. అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా వారికి మరో 50,60 మంది పోలీసులు జతకట్టారు. ఎవరి చేతిలో చూసినా ఆయుధాలే.

నయానా భయానా తెలివితేటలు ప్రదర్శించేవారు. పైగా చట్టం వాళ్ల చేతిలో ఉంది. జిల్లా కలెక్టర్ ప్రాంగణం నుంచి ఈ ముఠాలను పక్కకు పంపడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు ఉన్నారు. పైగా వీరంతా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌లు. వారి కార్యాలయాలూ ఈ కాంప్లెక్స్‌లో ఉన్నాయి. అయినా ఏ అధికారీ ఇదేమిటని ప్రశ్నించలేదు. అదేమని ఎవరైనా ప్రశ్నించినా వాటిని పట్టించుకోకూడదనుకున్నారు.

అన్ని విమర్శలకు వారి నుంచి వచ్చే స్టాండర్డ్ జవాబు ఏమిటంటే "ప్రాంగణంలో ఏదైనా అనధికారిక ఉనికి లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల గురించి ఎవరి నుంచి రాతపూర్వక ఫిర్యాదు రాలేదు" అని. అధికారులు కావాలనే కళ్లకు గంతలు కట్టుకోవడంతో గుండాగిరి అడ్డూ అదుపు లేకుండా సాగింది. నామినేషన్‌ వేయడానికి ఎవరైనా వస్తున్నారన్నఅనుమానం వస్తే వాళ్లని కిడ్నాప్ చేసి విజయభాస్కర్‌ రెడ్డి సమీప బంధువుకి చెందిన మాధవి లాడ్జిలో దాచిపెట్టేవాళ్లు. మాట వినకపోతే దారుణంగా కొట్టేవాళ్లు.

ఇక నామినేషన్ల చివరి రోజయిన అక్టోబర్ 18న కలెక్టర్ కాంప్లెక్స్ ఓ దుర్భేధ్యమైన కోటగా మారింది. ఎటుచూసినా సాయుధ బందోబస్తు. కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో మకాంపెట్టిన ముఠాకు కాంగ్రెస్ (ఐ) నాయకులే ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. ఏపీసీసీ ఐ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి; కర్నూలు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ బాబు; పత్తికొండ ఎంఎల్ ఏ శేషిరెడ్డి; కోడుమూరు ఎంఎల్ ఏ మదగోపాల్; మాజీ ఎమ్మెల్సీ రఘురాంరెడ్డి; ప్రధానమంత్రి కోసం సీటు ఖాళీ చేసిన గంగుల ప్రతాప్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి కొడుకు ప్రకాష్ రెడ్ సహా అనేక మంది అక్కడే ఉండి కిడ్నాపులు, చేయి చేసుకోవడాలు వంటివి చేయించారని ఆరోపించారు డాక్టర్ బాలగోపాల్.

బాధితుల కథనాలు ఇలా ఉన్నాయి...

బాధితుల్లో ఒకరైన హనుమంత రెడ్డి నల్లమల అడవి అంచున ఉన్న ఆత్మకూర్‌కు చెందిన సీనియర్ న్యాయవాది. 15 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న లాయర్. కాంగ్రెస్ (ఐ)కి చెందిన స్థానిక ఎమ్మెల్యే బుడ్డ వెంగళ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి. ఆయన ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పివిపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. (కాంగ్రెస్ పార్టీ అనుభవాలు చూసిన తర్వాత బీజేపీలో చేరారు) అక్టోబరు 14న నామినేషన్ దాఖలు చేసేందుకు దాదాపు 15 మంది స్నేహితులు, అనుచరులతో కలిసి కర్నూలుకు వెళ్లారు. కాంగ్రెస్ గ్యాంగ్ ను తప్పించుకుని కలెక్టరేట్ భవనంలోకి వెళ్లాడు.

కానీ నామినేషన్ ఫారమ్‌లను పొందేందుకు విఫలప్రయత్నం చేసి నిరాశతో వెనుదిరిగారు. నామినేషన్ ఫారం అడిగితే ఒక గది నుంచి మరొక గదికి పంపేవారు. అధికారులు కాంగ్రెస్(ఐ) వాళ్లతో కుమ్మక్కయ్యారని తెలుసుకోవడానికి ఆయనకు ఎక్కువ సేపు పట్టలేదు. అతికష్టం మీద సంపాయించిన నామినేషన్ ఫారాలను దారి కాచిన గూండాలు అపహరించడం, ఏఐసీసీ(ఐ) కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి హనుమంత రెడ్డి బెదిరించడం, చొక్కా కాలర్ పట్టుకుని లాగడం, హనుమంతరెడ్డిని కొట్టడం వంటివనేకం జరిగాయి. తన తాలూకు సమస్యలను ప్రచారం ద్వారా బయటపెట్టాలని అనడంతో.. అందుకు వేరే మార్గాలున్నాయని కాంగ్రెస్ వాళ్లు తేల్చిచెప్పారు. వెంగ‌ళ‌రెడ్డి తాలూకూ స‌మ‌స్య‌లుంటే ఆయనతోనో, అది ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పెద్దలతోనో చర్చించాలే కాని నామినేషన్ వేయడానికి వీల్లేదని ఖరాఖండితంగా చెప్పడం కొసమెరుపు.

హక్కును నిలబెట్టుకోలేని దుస్థితి...

ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా పోటీ చేయాలని హనుమంతరెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే ఆయన్ను ఏదో విధంగా కలెక్టరేట్ నుంచి బయటకు పంపేందుకు కాంగ్రెస్ నేతలు అనేక ఎత్తుగడలు వేసి బయటకు వచ్చిన తర్వాత కిడ్నాప్ చేసి లాడ్జికి తీసుకెళ్లారు. ఆ లాడ్జిలో బస చేసిన మొదటి వ్యక్తి అతడే.

శీలం సంజీవరెడ్డి అనుభవం ఇదీ..

రాయలసీమ రైతు సంఘం అధ్యక్షుడు శీలం సంజీవ రెడ్డి పీవీ నరసింహారావుపై పోటీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలు రాయలసీమను నిర్లక్ష్యం చేసిన తీరును ఎండగట్టాలనుకున్నారు. అక్టోబర్ 15వ తేదీన కలెక్టరేట్ కి చేరుకుంటే పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆయన్ను అడ్డగించి కొట్టి, జీపులో ఎక్కించి లాడ్జికి తీసుకొచ్చి కాంగ్రెస్‌వాళ్లకు అప్పగించారు.

కాకినాడ జ్యోతిష్యుడి కథనం ఇలా..

కాకినాడకు చెందిన ఒక జ్యోతిష్కుడు మన విశ్వవిద్యాలయాలలో జ్యోతిష్యాన్ని బోధనా అంశంగా చేర్చకపోవడాన్ని వ్యతిరేకిస్తూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పాపం ఈ పేదవాడికి పోలీసులు చక్కులు చూపించారంటే నమ్మండి.

హైదరాబాద్‌కు చెందిన మస్తాన్ వలి అనే ఉపాధ్యాయుడు కలెక్టరేట్‌లోనే మూడు రోజులు బందీగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థికి విషయం తెలిసి తన పరివారాన్ని పంపడంతో రక్షించబడ్డాడు. గ్వాలియర్‌కు చెందిన ఒక వ్యక్తి అనుభం మరింత ఆశ్చర్యపరిచినట్లు తెలిసింది. ఎందుకంటే అతను విడుదలైన తర్వాత ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తిరిగి వెళ్లిపోయాడు.

తప్పించుకున్న వైనం..

16వ తేదీ సాయంత్రం ఈ లాడ్జీలో ఉన్న బందీలను హంద్రీ నది ఒడ్డున ఉన్న కర్నూలు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ఇంటికి తరలించారు. అక్కడ నుంచి వీళ్లు.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అయిన 18వ తేదీ రాత్రి తప్పించుకోగలిగారు. కిడ్నాపర్లు తమ నిఘాను కొంత సడలించడంతో సంజీవరెడ్డి లారీలో హైదరాబాద్‌కు చేరుకుని తన అనుభవాన్ని పత్రికలకు చెప్పారు. అప్పుడే ఆ దుర్మార్గపు సంఘటనలు ప్రజలకు తెలిశాయి. అక్కడి నుంచి హనుమంత రెడ్డి ఒట్టి చేతులతో ఆత్మకూర్‌కు తిరిగి వెళ్లి బార్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేస్తే అది నీ వ్యక్తిగతం ఖండించడం కుదరని తెగేసి చెప్పింది. బహుశా ఈ వేధింపుల్ని తప్పించుకునేందుకు అతను బీజేపీలో చేరి ఉండవచ్చు.

ఈనాడు విలేఖరి అనుభవం ఇది..

కర్నూలు పత్రికా విలేఖరులకు ఏం జరుగుతోందో తెలిసినా ఆ విషయాన్ని రాసే ధైర్యం చేయలేకపోయారు. వారిలో ఈనాడు అసిస్టెంట్ రిపోర్టర్, సూర్యప్రకాష్ అనే స్థానిక యువకుడు మాత్రమే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. కాస్త సాహసోపేతమైన నిర్ణయానికే ఆయన వచ్చారు. ఆయన స్వయంగా నామినేషన్ దాఖలు చేసి పరిణామాలను రిపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అతనికి కాస్త విచిత్రమైన అనుభవం ఎదురైంది.

అక్టోబరు 18న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌కు వెళ్లి నామినేషన్‌ దాఖలు చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా కర్నూలు పట్టణంలోని తన చిరునామా పేరిట సంబంధిత రెవెన్యూ అధికారి నుంచి సర్టిఫికెట్‌ తీసుకునేందుకు వెళ్లారు. అయితే అది అసాధ్యమని తేలింది. ఒక అధికారి అతన్ని మరొకరి దగ్గరకి పంపారు. ఆ మరొకరు ఈ సర్టిఫికెట్ ఇచ్చే అసలైన వ్యక్తి సెలవులో ఉన్నారని చెప్పారు. ఎట్టకేలకు స్వయంగా కలెక్టర్‌ వద్దకు వెళ్లి ఓటర్ల జాబితా నుంచి తన నివాస స్థలాన్ని దృవీకరించాలని కోరగా కలెక్టర్‌ నిరాకరించారు. తన పని సక్రమంగా నింపిన ఫారమ్‌లను తీసుకోవడం, వాటిని అంగీకరించడమేనని చెప్పారు. ఆ పత్రాలను నింపడానికి ప్రజలకు సహాయం చేయడమేనని ఆ అధికారి వాదించారు.

సూర్యప్రకాశ్‌ కలెక్టర్‌ గది తలుపు దగ్గర నిలబడి వేడుకుంటుండగా కలెక్టర్‌ గది బయట వేచి ఉన్న మున్సిపల్‌ చైర్మన్‌ సుధాకర్‌బాబు.. ఆ యువకుణ్ణి చొక్కా పట్టుకుని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. సూర్యప్రకాష్ తనను తాను విడిపించుకున్నాడు. ఆ ప్రయత్నంలో దాదాపుగా కలెక్టర్ కాళ్ళపై పడ్డాడు. అయితే కలెక్టర్ తన గదిలో ఏమీ జరగనట్టు నటించాడు. ఆ తర్వాత సూర్యప్రకాష్ కలెక్టర్ పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కడం మినహా మరేమీ చేయలేక వెనుదిరిగారు.

తన నామినేషన్‌ను ఎటువంటి ఇబ్బంది లేకుండా దాఖలు చేయడానికి అనుమతించాలని మళ్లీ డిమాండ్ చేశాడు. సరైన అధికారి నుంచి సరైన ధృవీకరణ పత్రం లభిస్తేనే నామినేషన్‌ను కచ్చితంగా స్వీకరిస్తారని, అంతకు మించి తానేమీ చేయలేనని కలెక్టర్ చెప్పడంతో ఆ అసలైన అధికారి కోసం వెతుకులాట ప్రారంభించారు. బయటకి వెళితే కిడ్నాప్ చేస్తారనే భయంతో కూడా సూర్యప్రకాష్ బయటకు వెళ్లే సాహసం చేయలేదు.

సూర్యప్రకాష్ కలెక్టర్ కార్యాలయంలో రోజంతా కూర్చుని, గడువు ముగిసిన తర్వాత, కిడ్నాప్ చేయరని తెలుసుకున్న తర్వాత బయటకువచ్చారు. కలెక్టరు కార్యాలయం బయట ఉన్న మున్సిపల్‌ చైర్మన్‌ను కలిసి నామినేషన్‌లను ఎందుకు అడ్డుకుంటున్నారని సూర్యప్రకాశ్ కాస్తంత ఉత్సుకతతో ప్రశ్నించారు. సరిగ్గా ఆసమయంలోనే కాంగ్రెస్ నేత సుధాకర్ బాబు 'విదేశీ హస్తాల' గురించి ప్రసంగించారు.

కొందరి నామినేషన్లు స్వీకరించక తప్పని స్థితి...

ఇంత తతంగం నడిచిన తర్వాత కొందరు ఇండిపెండెంట్లు, సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సింహులు తమ నామినేషన్లను దాఖలు చేయడానికి అనుమతి లభించింది.. ఎందుకంటే ఈ అభ్యర్థులు తమను తాము కాపాడుకోగలరని, వీళ్లని ఎవరూ చంపరని నిర్ణయానికి వచ్చిన తర్వాత గ్యాంగ్‌స్టర్లు వెనక్కితగ్గారు. 18వ తేదీ సాయంత్రం వచ్చి స్వతంత్రులందరినీ సురక్షితంగా అపహరించి దాచిపెట్టామని వారు సంతృప్తి చెందారు.

అయితే తాము పొరబడ్డామని రెండు రోజుల తర్వాత అర్థమైంది. ఓ ఇండిపెండెంట్ తప్పించుకుని హైదరాబాద్ పోయాడని తెలిసింది. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ న్యాయసలహాదారుల్లో ఒకరైన టీడీపీ నేత ఉపేంద్ర సన్నిహితుడు, హైదరాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది ఐ కోటిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. తనకు సమీప బంధువు, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పేరుమోసిన భూస్వామి, ఆలంపూర్ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కారులో ఆయన కర్నూలు వెళ్లారు. కర్నూలులో బీజేపీ అభ్యర్థి అనుచరగణంతో కలిసి కలెక్టరేట్‌లోకి వెళ్లి నామినేషన్ వేశారు. అయితే అది బీజేపీ 'డమ్మీ' అభ్యర్థిగా వేశాడని ఈ గూండాలు పొరబడ్డారు. రెండు రోజుల తర్వాత తమ తప్పు తెలుసుకుని వెంటనే ప్రతీకారానికి పూనుకున్నారు.

అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం హైదరాబాద్ నగరం నడిబొడ్డున కోటిరెడ్డి కుమారుడిపై పెద్దఎత్తున కాంగ్రెస్‌(ఐ) గూండాలు దాడి చేశారు. ఆయన కారును ధ్వంసం చేశారు. ‘ మీ నాయన నంద్యాల నుంచి పోటీ చేసేంత మొగోడనుకున్నావా’ అంటూ కొడుకు మీద దాడి చేశారు. ఈ విషయాన్ని ఆయన కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. సాయంత్రమైనా ఫిర్యాదు తీసుకోకపోగా తననే క్రిమినల్‌గా చూస్తున్నట్టు పసిగట్టాడు. కొంత కాలం కిందట ఈ యువకుడితో జరిగిన ఘర్షణకు కొనసాగింపుగా ఈ దాడి జరిగిందని, తండ్రి రాజకీయాలతో ఇతనికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు.

తప్పుడు ఫిర్యాదు చేయడానికి వచ్చావా అంటూ పోలీసులు దుర్భాషలాడారు. తమకున్న పెద్ద సంబంధాలు తమకు కడుపునింపవని, కుట్ర, కుతంత్రం రాజ్యమేలుతోందని ఈ తండ్రీకొడుకులు గుర్తించి.. వారం తర్వాత నంద్యాలలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు కోటిరెడ్డి. ఆ విధంగా దక్షిణ భారత దేశపు తొలి వ్యక్తి అయిన భారతదేశపు ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు పార్లమెంటులో అడుగుపెట్టారు. ఇంత చేసినా ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదు. అయితే గిన్నిస్ బుక్ రికార్డు స్థాయిలో 5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించడం కొసమెరుపు.

బాలగోపాల్ రికార్డ్ చేయకపోయి ఉంటే

ప్రధాని పివి ఏకగ్రీవంగా గెలిపించాలన్న ఒక ఆలోచన ఎంత బీభత్సం సృష్టించిందో బాలగోపాల్ రికార్డు చేయకపోతే, చరిత్రకు తీరని ద్రోహం జరిగేది. ఆయన ధైర్యంగా 'మెహెమ్ ఇన్ నంద్యాల్-1991' నంద్యాల ఆరాచకత్వాన్ని రికార్డు చేశాడు. అది ’ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ‘లో అచ్చయింది. ఇపుడు గుజరాత్ ఏకగ్రీవం వెనక జరిగిన కథేంటో ఎవరైనా రికార్డ్ చేసుంటే బాగుంటుంది.

Read More
Next Story