వెంకన్న సొత్తును దోచేసిన దొంగల భరతం పడతామంటారేమిటీ?
x

వెంకన్న సొత్తును దోచేసిన 'దొంగల' భరతం పడతామంటారేమిటీ?

రాష్ట్రంలో బ్రాహ్మణులపై మహా కూటమి నేతలు హామీలు కురిపించారు. తిరుపతిని దోచేసిన దొంగల భరతం పడతామంటున్నారు. అసలింతకీ ఈ దొంగలెవరు?


(ఎస్.ఎస్.వి. భాస్కరరావు)

తిరుపతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న వేళ టిడిపి, జనసేన అధ్యక్షులు ఎన్. చంద్రబాబు, కొణెదల పవన్ కళ్యాణ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. వారి పర్యటన తిరుపతి నగరంలో కూటమి నేతల్లో ఉత్సాహం, శ్రేణుల్లో జోష్ పెంచింది. రోడ్ షోకు అనూహ్య స్పందన లభించింది. లీలా మహల్ సర్కిల్‌లోని కృష్ణదేవరాయ విగ్రహం వద్ద జరిగిన సభలో టిడిపి చీఫ్ అండ్ చంద్రబాబు చేసిన ప్రసంగం కార్యకర్తలను ఉత్తేజతులను చేసింది.

వెంకన్న సాక్షిగా బాబు హామీ..

రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ మరింత పటిష్టం చేయడంతో పాటు, ఆలయాల పాలక మండలలో బ్రాహ్మణులకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చి సభ్యులుగా నియమిస్తామని ప్రకటించారు.

రు. 50 వేలకు పైగా ఆదాయం ఉన్న ఆలయాల అర్చకులకు రు. 15 వేలు వేతనం ఇస్తామని ప్రకటించారు. దేవాలయ భూములు దోచేసిన వారి భరతం పడతానని ఆయన హెచ్చరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏడాదికి నాలుగు లక్షల వంతున ఐదేళ్లలో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, మెగా డీఎస్సీ పై మొదటి సంతకం ఉంటుందని అంశాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఊహించినట్టే...

" నన్ను తిట్టించడానికే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను రప్పిస్తున్నారు" అని తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండు రోజుల కిందట వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయనకు అండగా ఉన్న వైయస్ఆర్సీపీ నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేయడమే కాదు. కోర్టుల వరకు వెళ్లిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న వేళ వాళ్లు వచ్చి, తిరుపతి నగరంలో జరిగిన వ్యవహారాలన్నీ తిరగదోడి, ఓటర్ల మైండ్ సెట్ మారుస్తారేమో అని ఇది ఆయన సందేహంగా కనిపించింది. ఆయన ఊహించినట్లే...

"తిరుపతిలో దొంగల పడ్డారు"

అని భూమన కరుణాకర్ రెడ్డిపై టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు ఎక్కుపెట్టారు. "తిరుపతిలో గంజాయి విక్రయం పెరిగింది. ఇందులో అధికార పార్టీ నేతలకు ముడుపులు అందుతున్నాయని" చంద్రబాబు ఘాటుగా ఆరోపించారు. బీసీ మహిళల మేయర్ గా ఉంటే, ఆ పదవి అనుభవిస్తుంది డిప్యూటీ మేయర్ అంటూ.. కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయరెడ్డి తీరును ఎత్తిచూపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తున్నట్లే బీసీలను ప్రత్యేకంగా ఆదరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. "తిరుపతికి సమీపంలో టిసిఎల్, హీరో మోటార్స్, కార్బన్, డిక్సన్ పరిశ్రమలు తెచ్చి, ఎలక్ట్రానిక్ హబ్‌గా మార్చాం" అని గుర్తు చేశారు.

ఆ సొమ్ము హుండీలో వేయండి

తిరుపతి ఎమ్మెల్యే భూమన కుటుంబం సంపాదించిన డబ్బంతా శ్రీవారివే. "ఎన్నికల్లో వారి చే డబ్బు తీసుకొని అది వెంకన్న హుండీలో వేయండి" అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సూచించారు. " శ్రీవాణి ట్రస్టు పేరుతో టిక్కెట్ల రేట్లను పెంచారు. కూటమి అధికారంలోకి రాగానే భూమన కుటుంబానికి బుద్ధి చెబుతాం" అని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. "రోజుకు కోడి బొచ్చు మీద భూమన అక్రమ ఆదాయం రూ. 20లక్షలని, 15శాతం కమీషన్లతో భూమన కుటుంబం రెచ్చిపోతోంది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకురౌడీలకు భయపడకండి. వారిని ఉక్కు పాదంతో తొక్కి వేస్తామని హెచ్చరించడం ద్వారా, పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి ఆయన ప్రయత్నం చేశారు.

కూటమిలో జోష్..

తిరుపతి అసెంబ్లీ స్థానంలోకి జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును తెరపైకి తెచ్చారు. టిడిపిలో ఓ వర్గం, జనసేనలో కొందరు. వ్యతిరేకించారు. కొన్ని రోజుల తర్వాత ఆయా పార్టీల అగ్ర నేతలు ప్రత్యక్ష ప్రమేయం ద్వారా అందరినీ ఒకటి చేశారు. అయిష్టంగా కలిశారని అందరూ భావించారు. టిడిపి నేతలకు ఎన్. చంద్రబాబు నాయుడు, జనసేనలోని ఓ వర్గానికి పవన్ కళ్యాణ్ స్వయంగా కలిసి దిశానిర్దేశం చేశారు. గత 15 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. కూటమిలో ప్రధానంగా టిడిపి- జనసేన ప్రధాన నాయకుల మధ్య సమన్వయం కుదిరింది. అగ్రనేతుల సూచనల నేపథ్యంలో వారిలో అంతర్మధనం జరిగింది. దీంతో అంతా ఒక్కటయ్యారని భావిస్తున్నారు.

అది కాకుండా రాష్ట్రంలో అనుకూల పవనాలు ఉన్నాయని సంకేతాలు అందిన నేపథ్యంలో.. కూటమి నేతలు మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంకో ఐదు రోజుల్లో పోలింగ్ ప్రారంభానికి ముందు కూటమి నేతలు తిరుపతిలో సాగించిన రోడ్ షో, బహిరంగ సభ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో మరింత ఉత్సాహం పెంచినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత ఓల్డ్ మేనేజ్మెంట్ పై కూడా వారిద్దరూ తిరుపతి నాయకులకు ప్రత్యేక సూచనలు చేసినట్లు తెలిసింది. ఇంకొన్ని రోజుల్లో జరగనున్న పోలింగ్ ఎలా ఎదుర్కొంటారు. ఫలితం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి. కూటమి నేతల పర్యటన తర్వాత, తిరుపతి ఎమ్మెల్యే భూమాన కరుణాకరరెడ్డి బుధవారం ఘాటుగా స్పందించారు.

సింగడు వచ్చాడు .. వెళ్ళాడు..

"సింగడు అద్దంకి రానూ వచ్చాడు, పోనూ పోయాడు" అన్నట్టు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతికి రానూ వచ్చారు, తిరిగి పోనూ పోయారు" అని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సెటైర్ వేశారు. తిరుపతి వెంకటరెడ్డినగర్ ప్రాంతంలో ప్రచారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు."వీళ్ల తిరుపతి ట్రిప్పుకు, సింగడి అద్దంకి ట్రిప్పుకు పెద్ద తేడా లేదు‌. రాసుకోనొచ్చింది కూడా చదవలేక, చదివేసి వెళ్లిపోయారు" అని ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు, తిరుపతిలో తాము చేయించిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయనున్నారనే ధీమా ఆయన వ్యక్తం చేశారు. తమ హయాంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించామని, ఉద్యోగుల ఇంటి స్థలాల సమస్య కూడా నెరవేరిందని ఆయన గుర్తు చేశారు. "ఇవన్నీ చూసి కన్నుకుట్టి, అసూయతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మమ్మల్ని తిడితే ఓట్లు వేస్తారని భావిస్తే వాళ్ల మూర్ఖత్వమే" అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Read More
Next Story