
సౌందర్యానికి నెలవు శేషాచలం కొండలు
కడప సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ‘నెలనెలా సీమ సాహిత్యం’ ‘తిరుమల దృశ్యకావ్యం - పర్యాటక విశేషాలు’ అన్న అంశంపై రాఘవ ప్రసంగం
కడప : ఎత్తైన కొండలు.. లోతైన లోయలు, నీటి గుండాలు..గలగలా పారే జలపాతాలు..సెల ఏటి సవ్వడులు..వివిధ రకాల వృక్షాలు..వాటి మధ్య తిరుగా డే అనేక రకాల జంతు జాలాలతో కూడిని శేషాచలం కొండలు ప్రకృతి సౌందర్యానికి నెలవని తిరుపతికి చెందిన ప్రముఖ పాత్రికేయులు రాఘవ వివరించారు.
‘తిరుమల దృశ్యకావ్యం - పర్యాటక విశేషాలు’ అన్న అంశంపై కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ఆదివారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘నెలనెలా సీమ సాహిత్యం’ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ 142వ సదస్సుకు వచ్చిన వక్తను సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి పరిచయం చేశారు.
ఈ సదస్సులో రాఘవ ప్రసంగిస్తూ, ముప్పై ఏళ్ళ తన పర్వతారోహణ అనుభవాలను ఫొటోలు, వీడియోల ద్వారా వివరించారు. ‘‘అడవి అమ్మలాంటిది. అమ్మ లాగా అడవి అందరినీ అక్కున చేర్చుకుంటుంది. దానికి తరతమభేదాలు లేవు. జీవవైవిధ్యంతో అలరారుతూ, మానవ సమాజానికి అడవి ఒక గొప్ప సామాజిక సందేశాన్ని అందిస్తోంది. అలసిన మనసులకు సేదతీర్చే అమ్మఒడి ఈ శేషాచలం కొండలు. సుమారు 800 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ శేషాచలం కొండలు విస్తరించాయి. కుమార ధార, రామకృష్ణ తీర్థం, తుంబురు తీర్థం, శేషతీర్థం, గుంజన జలపాతం, విష్ణుగుండం, నారాయణ తీర్థం, దశావతార తీర్థం, మార్కండేయ తీర్థం ; ఇలా చెప్పుకుంటూ పోతే శేషాచలం కొండల్లో లెక్కలేనన్ని తీర్థాలు ఉన్నాయి.’’ అంటూ ఆయా తీర్థాలకు వెళ్ళే దారుల గురించి వివరించారు.
కుమార ధార-శక్తికటారి, శేషతీర్థం-దశావతార తీర్థం మధ్య చేసిన సాహసోపేతమైన పర్వతా రో హగణగురించి వివరిస్తూ, ఫొటోలతో పాటు కొన్ని వీడియోలను కూడా ప్రదర్శించారు. ట్రెక్కింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పడ మే కాకుండా, మానవ మనుగడకు అడవిని పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అడవి నుంచి మనం నేర్చుకోవలసిన సమిష్టి తత్వంను వివరించారు. గతంలో తిరుమలకు ఉన్న ఏడు నడక దారుల గురించి వివరిస్తూ, ఇప్పుడు కొన్ని కనుమరుగైపోయినవి వాటి గురించి చెప్పారు. దేవిప్రియ రాసిన ‘అడవి’ అన్న కవితతో మొదలు పెట్టి, గుంజన గురించి రాసిన ‘గుంజనా..నా గుంజనా’ కవితతో ముగించారు.
సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి సమన్వయ కర్తగా వ్యవహరించిన ఈ సభలో ప్రేక్షకుల నుంచి పలువురు రచయితలు, సాహిత్యాభిబానులు ప్రసంగించారు. రచయిత కొత్త పల్లి రామాంజనేయులు మాట్లాడుతూ, అడవిలో కొంత తిరిగిన అనుభవం తనకు ఉందన్నారు.
జానుమద్ది నాగరాజు మాట్లాడుతూ, రాఘవ భౌతికంగా శేషాచలం కొండలు చుట్టుముట్టి, మనల్ని మానసికంగా ఆ కొండల్ని చుట్టుముట్టేలా చేశారని పేర్కొన్నారు. రిటైర్డ్ తెలుగు పండితులు కందిమళ్ళ రాజా రెడ్డి ‘అడవిని కాంచిన’ అంటూ అడవి గురించి అల్లసాని పెద్దన పద్యం పాడి వినిపించారు. రచయిత రమణా రెడ్డి మాట్లాడుతూ, అరణ్యాల గురించి ప్రాచీన కవులు ‘అరణ్యకాలు’రచించారని, అడవుల నుంచి లభించిన జ్ఞానం, అనుభవం, అనుభూతి అద్భుతం అన్నారు. సాయి విజ్ఞాన కరస్పాండెంట్ భూపతిరాయుడుతో పాటు మరికొందరు కూడా ప్రసంగించారు.
సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డాక్టర్ చింతకుంట శివారెడ్డి, గ్రంథాలయ సహాయకులు ఎన్.రమేశ్‌రావు, జి.హరిభూషణరావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ, ఎం.మౌనిక, సిబ్బంది వినూత్న రీతిలో అతిథి రాఘవకు ఒక పూలమొక్కను బహూకరించారు.