
TIRUMALA | తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి మళ్లీ విమానం!
తిరుమల ఆలయం మీదుగా విమానాల రాకపోకలపై భక్తులు తీవ్ర మనస్థాపం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి గురువారం ఉదయం విమానం వెళ్లింది. ఆగమశాస్త్రానుసారం శ్రీవారి ఆనంద నిలయంపై ఎలాంటి విమాన సంచారం ఉండకూడదని గతంలోనే ఆగమ శాస్త్ర పండితులు స్పష్టం చేశారు. అయినప్పటికీ తరుచూ తిరుమలలో విమానాలు తిరుగుతున్నాయి. ఈ తీరు పట్ల పండితులు, భక్తులు మండిపడుతున్నారు. గత ఏడాది జూన్ 7న శ్రీవారి ఆలయం మీదుగా విమానం వెళ్లగా, ఫిబ్రవరి 15న ఆలయం గోపురం పైనుంచే రెండు జెట్ విమానాలు వెళ్లాయి. తిరుమలను నో ఫ్లయింగ్ జోస్ గా ప్రకటించాలని ఇప్పటికే టీటీడీ.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో శ్రీవారి ఆలయం పైనుంచి అడపా దడపా విమానాలు వెళ్తున్నాయి. రేణిగుంట విమానాశ్రయంలో ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించేందుకు సాధ్యం కాదని అయితే ఆలయానికి సమీపంలో విమానాల రాకపోకలు లేకుండా చూస్తామని అధికారులకు కేంద్రం గతంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ హామీ కూడా అమలు కాకపోవడం భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ కే చెందిన వారు కావడంతో ఆయనైనా ఈ వ్యవహరంలో జోక్యం చేసుకోవాలని, తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని ఆగమ పండితులు, భక్తులు కోరుతున్నారు.