
తిరుమలలో మరొక కుంభకోణం, పట్టువస్త్రాల బదులు పాలియస్టర్ సరుకు సప్లై
ఎసిబి ఎంక్వయిరీకి ఆదేశాలు
తిరుమల లడ్డు వివాదం, పరకామణి చోరి విచారణ లు ఇంకా ఒక కొలిక్కి రాకముందే వెేంకటేశ్వరుని సన్నిధిలో మరొక కుంభకోణం బయటపడింది. శ్రీవారికి పట్టువస్తాలు సరపరా చేయాల్సిన కంపెనీ పాలియస్టర్ వస్తాలను పంపిణీ చేసిందనే విషయం వెల్లడయింది. ఇలా ఒక కంపెనీ 2015 నుంచి 2025 వరకు ఒప్పందాన్నిఉల్లంఘించిందనే విషయం టిటిడి విజిలెన్స్ విచారణలో బయటపడటంతో సమగ్రవిచారణకు అవినీతి నిరోధక శాఖకు కేసును బదలాయించారు. ప్యూర్ మల్బరీ సిల్క్ దుపట్టాలను సరఫరా చేయడానికి బదులు విఆర్ ఎస్ ఎక్స్ పోర్ట్స్ , దాని అనుబంధ సంస్థ కలిపి 100 శాతం పాలియస్టర్ వస్త్రాన్ని సరఫరా చేసిన విషయాన్ని విజిలెన్స్ విభాగం కనుగొందని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. 2015 నుంచి 2025 వరకు ఈ కంపెనీ సుమారు రు. 54.95 కోట్ల విలువయిన పాలియస్టర్ వస్త్రాలను సరఫరా చేసి టిటిడిని మోసగించింది.
ఈ దుపట్టాను టిటిడి విఐపిలకు, దాతలకు కానుకగ ఇస్తూ ఉంటుంది. తిరుమల గుడిలో రంగనాయక మండపం దగ్గిర బ్రేక్ దర్శనంలో టిటిడికి విరాళాలు ఇచ్చే వారికి ఈ దుపట్టాలను కప్పి సత్కరిస్తూ ఉంటారు.
ఈ అవకతవవకకు కారణమయిన వారిని కనిపెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈ వ్యవహారాన్ని ఎసిబి కి బదలాాయించింది.
టిటిడి విజిలెన్స్ విభాగం తాగా వచ్చిన సరుకు శాంపిల్స్ సేకరించారు. విఆర్ ఎస్ ఎక్స్ పోర్ట్స్ అనే సంస్థ తిరుపతి సమీపంలోని నగరిలో ఉంటుంది.
ఇటీవల ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న దుపట్టాల నాణ్యం పరిశీలించాలని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు విజిలెన్స్ వారిని ఆదేశించడంతో అసలు విషయం బయటపడింది. టెండర్ నియమాల ప్రకారం ఈ కంపెనీ ప్యూర్ సిల్క్ పేక,పడుగుతో నేసిన వస్తాలను సరఫరా చేయాలి. అలాగే ఒక వైపు ఓం నమో వెేంకటేశాయా అని ఒక వైపు తెలుగులో మరొక వైపు సంస్కృతంలో నేసి ఉండాలి. దీనికి అటూ ఇటూ శంఖు చక్ర నామం. గుర్తులుండాలి.
ఎసిబి దీని మీద సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పిస్తుంది.

