భారత్ మాతాకీ జై, వందేమాతరం, మురళీ నాయక్ అమర్ హై వంటి నినాదాలతో విజయవాడ నగరం మారుమోగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు చేసిన ఈ నినాదాలను ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, ప్రజలు అందుకోవడంతో విజయవాడ నగరం దేశ భక్తితో దద్దరిల్లి పోయింది. పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తిరంగ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా విజయవాడ నగరంలో శుక్రవారం సాయంత్రం తిరంగ ర్యాలీ నిర్వహించారు. బందరు రోడ్డులోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
ఈ ర్యాలీని విజయంతం చేసేందుకు పెద్ద ఎత్తున కూటమి భాగస్వామి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, ప్రజలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశ భక్తిని, దేశ సమైఖ్యత, సమగ్రతను చాటిచెప్పేలా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన గీతాలాపన అందరికి మరో సారి దేశ భక్తిని గుర్తు చేసింది. భారత దేశంతో పెట్టుకుంటే.. ఒక్కడు కూడా మిగలడని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉగ్రవాదులను హెచ్చరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..
జాతీయ జెండాను చూడగానే దేశ భక్తి, ఉద్వేగం ఒక్క సారిగా ఉప్పొంగుతాయని అన్నారు. పహల్గాం ఉగ్రదాడుల్లో అమాయ టూరిస్టులను పొట్టన పెట్టుకుని, మహిళల సింధూరం తుడిచేస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. బారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత దేశంపై ఉగ్రవాదులు కన్నెత్తి చూడకుండా తిరుగులే జవాబు ఇచ్చామన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో దేశ ప్రజలతో పాటు ప్రపంచమంతా భాతర దేశం సైనిక దళాల పరాక్రమాలను చూశారన్నారు. భారత సైనిక దళాలు ఉగ్ర స్థావరాలను వారి భూ భాగంలోకి వెళ్లి మరీ ధ్వంసం చేశాయన్నారు. అది భారత సైనిక దళాల పరాక్రమమని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు వెల్లడించారు. భారత దేశంపై దాడి చేయాలని చూసే ఉగ్రవాదులకు అదే వారికి చివరి రోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు.
ఉగ్రవాదుల కుట్రలు, కుతంత్రాలు భారత దేశాన్ని, భారత దేశ ప్రజలను ఏమీ చేయలేవన్నారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్‌తో సరైన నిర్ణయం తీసుకుందని, సరైన సమయంలో భారత దేశానికి సరైన నాయకుడు మోదీ ఉన్నారని ఉగ్రవాద మూకలు భారత దేశాన్నీ ఏమీ చేయలేవని అన్నారు. దేశం కోసం, దేశ ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసి వీర మరణం పొందిన పాతికేళ్ల కుర్రాడు మురళీ నాయక్ దేశ ప్రజలకు, మనందరికీ స్పూర్తి అని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..
పహల్గాం ఉగ్రదాడులతో పాటు ఇప్పటి వరకు భారత దేశం మీద జరిగిన ఉగ్ర దాడులన్నింటిలోను పాకిస్తాన్ హస్తం ఉందని, ఆ అండ చూసుకునే ఉగ్ర మూకలు భారత దేశం మీద దాడులకు తెగబడుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. దేశ విభజన జరిగిన నాటి నుంచి భారత దేశంపై అనేక దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పాకిస్తాన్‌ను వారు సక్రమంగా పాలించుకోలేక డెవలప్ అవుతున్న భారత దేశంలో అల్లకల్లోం సృష్టించేందుకు ఉగ్ర మూకలు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడ్డారని మండిపడ్డారు. భారత దేశాన్ని చూసి, భారత దేశం అభివృద్ధి చెందుతున్న తీరును చూసి ఉగ్ర మూకలకు అండగా ఉంటున్న పాకిస్తాన్ అసూయతోను, ద్వేషంతో రగిలిపోతోందన్నారు.
సెక్యూలరిజం పేరుతో పాకిస్తాన్‌కు సపోర్టు చేసే వాళ్లను, పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడే వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోతే సైనికుడిగా పోవాలి అని భారత దేశం కోసం, భారతీయుల కోసం వీర జవాన్ మురళీ నాయక్ ప్రాణ త్యాగం చేశారని అన్నారు. దేశ భక్తి అంటే ఎంటో మురళీ నాయక్ చూపించారు. ఇలాంటి వీర జవాన్ మురళీ నాయక్ అమర్‌హై అంటూ నినదించారు. ఉగ్రమూకలు దాడులు చేస్తున్న కష్ట సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అండగా ఉంటామని, ఉగ్రవాదులు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని, ఇది కొత్త భారతం అని, దీనిని పాకిస్తాన్ గ్రహించాలని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.