
టిడ్కో ఇళ్లకు 6,300 కోట్లు కావాలి
బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవేమేనా అని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి రూ. 6,300 కోట్లు అవసరం అవుతుందని మంత్రి నారాయణ అన్నారు. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సందర్భంగా టిడ్కో గృహాల నిర్మాణం గురించిన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానాలు చెప్పారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన రూ. 3,664 కోట్ల బిల్లులను చెల్లింపులు చేయకుండా పెండింగ్‌లో పెట్టిందన్నారు. ఈ బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ఆగిపోయిన డిట్కో ఇళ్ల నిర్మాణాలను చేపట్టి, వాటిని పూర్తి చేసేందుకు పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణాల గురించి ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజులు ప్రశ్నలు అడిగారు. టిడ్కో ఇళ్ల కోసం 2017 నుంచి లబ్ధిదారుల నుంచి సొమ్ము వసూలు చేసినప్పటికీ నిర్మాణాలు పూర్తికాని విషయం వాస్తవేమేనా? ఇళ్లను ఎప్పటిలోగా పూర్తి చేసి అందజేస్తారు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు ఆగిపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం కూడా వాస్తవమేనా అని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.
Next Story