
ఆంధ్రలో పిడుగుపాటు హెచ్చరిక
గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీచనున్నాయి.
వచ్చే రెండు, మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పిడుగుపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో చెట్ల కింద, స్తంభాల కింద నిలబడరాదని, ఈదురు గాలులు వీచే సమయంలో హోర్డింగ్‌ల కింద నిలబకూడదని ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
గత వారం కురిసిన పిడుగుపాటు వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దాదాపు 10 మంది మరణించారు. పిడుగులు పడటంతో పాటు ఈదురు గాలులకు చెట్లు పడి వీరు మరణించారు. బాపట్ల జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, ఏలూరు జిల్లాలో ఒకరు, తిరుపతి జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆదివారం, సోమవారం కురిసిన ఈ అకాల వర్షాల్లో పెద్ద ఎత్తున, వరి, అరటి, మామిడి, మొక్క జొన్న వంటి పలు పంటలతో పాటు పలు హార్టీ కల్చర్ పంటలు కూడా దెబ్బతిన్నాయి. 2,224 హెక్టార్లలో వరి పంట, 138 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది.
ఇదిలా ఉంటే మరో వైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీచనున్నాయి. గురువారం ఒక మండలంలోను, శుక్రవారం 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 28 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ బుధవారం తెలిపారు.
Next Story