
ఏపీకి పిడుగుపాటు హెచ్చరికలు
శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు మందగొండిగా సాగిన నైరుతి రుతుపవనాల కదలికల్లో కాస్త స్పీడ్ పెరగడం వల్ల ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ శాఖలు తెలిపాయి. శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపాయి. దీని ప్రభావంతో సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, దీంతో జాలర్లు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశాయి.
గతంలో కంటే ఈ సారి ఎనిమిది రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటి వరకు అంచనా వేసిన స్థాయిలో వర్షాలు పడలేదు. దాదాపు 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతువపనాలు ఎనిమిది రోజులు ముందుగానే ప్రవేశించాయని.. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖతో పాటు ఏపి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది. అయితే రుతుపవనాల కదలికల్లో జాప్యం కారణంగా వాటి ప్రభావం కనిపించ లేదు. జూన్ మాసంలో కూడా మే నెల మాదిరిగానే ఎండలు తలపించాయి. ఉక్కపోత కూడా తగ్గ లేదు. అయితే తాజాగా రుతుపనాల కదలికల్లో వేగం పెరుగుతుండటంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
కర్ణాటక నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. ఈ నేపథ్యంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, కూరాడ, విన్నకోట, కౌతవరం, వేమవరం, వల్లమన్నాడు, దగ్గుమిల్లి, తాడిచర్ల, చినగొన్నూరు తదితర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున వర్షం కురిసింది. మూడు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో 16.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఆ ప్రాంతాల్లోని రోడ్లు జలమయం కాగా కొన్ని కాలనీల్లో ఇళ్లు నీట మునిగాయి. ఉపరితల ఆవర్తనం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో శని, ఆదివారాలు రెండు రోజుల పాటు పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Next Story