
తూమాటి దోణప్ప సాహితీ కృషీవలుడు
ప్రాచీన తెలుగు భాష హోదా ఫలాలు భావి తరాలకు అందేలా కృషి చేయాలని వెంకయ్యనాయుడు కోరారు.
ఆచార్య తూమాటి దోణప్ప సాహిత్య కృషీవలుడని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో శనివారం ఆచార్య దోణప్ప 30వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క ఆర్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు ‘విశిష్ట తెలుగు దిగ్దర్శనం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పుస్తక రచయితలైన చెన్నపురి తెలుగు అకాడమీ సభ్యులు తూమాటి సంజీవరావు, తిరునగిరి భాస్కర్‌తో పాటు పుస్తకంలో వ్యాసాలు రాసి అందించిన రచయితలకు వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఆచార్యతూమాటి దోణప్ప జానపద సాహిత్యం మొదలుకుని, తెలుగు భాష, తెలుగు సాహిత్యం, సంస్కృతి వంటి అనేక రంగాల్లో చేసిన కృషి మహోన్నతమైందన్నారు. దోణప్ప సవ్యసాచిగా, సాహితీ కృషీవలుడిగా పేరు పొందారని అన్నారు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతిగా నియమించిన సందర్భంలో ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని నాటి సీఎం ఎన్టీఆర్‌ను అభినందించినట్లు గుర్తు చేసుకున్నారు. ఎంతో మంది మహనీయుల కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించిందన్నారు. అయినా తెలుగు వెలుగులు భావితరాలకు అందకపోడం విచారకరమని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాచీన తెలుగు హోదా ఫలాలను భవిష్యత్ తరాలకు అందేవిధంగా కృషి చేయాలన్నారు. చదువులు, ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేసే దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు అడుగులు వేయాలని కోరారు. అప్పుడే ఇంగ్లీషుపై వ్యామోహం పోతుందన్నారు.