ఊబిలో చిక్కుకుని ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు మృతి
x

ఊబిలో చిక్కుకుని ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు మృతి

మరణించిన విద్యార్థులు అన్నమాచార్య యూనివర్శిటీకి చెందిన వారు.


అన్నమయ్య జిల్లాలో గురువారం దారుణం చోటు చేసుకుంది. ఎంబీఏ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. సరదా ఈత వారి ప్రాణాలు తీసింది. ఈత కోసం వెళ్లి ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బాలరాజుపల్లిల్లో ఈ దుర్ఘటన గురువారం చోటుచేసుకుంది. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

రాజంపేట మండలం తాళ్లపాక పంచాయతీ పరిధిలోని న్యూ బోయనపల్లిలోని అన్నమాచార్య యూనివర్శిటీలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు సరదా ఈత కోసం రాజంపేట మండలం బాలరాజుపల్లికి సమీపంలోని చెయ్యేరు నదికి వెళ్లారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో చెయ్యేరుకు వరద నీరు వచ్చింది. ఈ వరద నీటిలో ఈత కొట్టేందుకు ఈ విద్యార్థులు వెళ్లారు. చెయ్యేరులో ఊబి ఎక్కువుగా ఉండటంతో ఈతకు దిగిన ఎనిమిది మంది విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థులు ఆ ఊబిలో ఇరుక్కుని మృత్యువాత పడ్డారు.
దీంతో అన్నమాచార్య యూనివర్శిటీలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులను రాజంపేటకు చెందిన దిలీప్‌ మణికుమార్, ఒంటిమిట్టకు చెందిన కొత్తూరు చంద్రశేఖర్‌రెడ్డి, పోరుమామిళ్లకు చెందిన పీ కేశవలుగా పోలీసులు గుర్తించారు. దీంతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చేతికొచ్చిన కొడుకులు మరణించడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తీవ్ర విషాదం అలముకుంది.
Read More
Next Story