తేదీ ఒకటే అయినా దినాలు మాత్రం నాలుగు
x

తేదీ ఒకటే అయినా దినాలు మాత్రం నాలుగు

పార్టీలు తలా పేరుపెట్టి తెలంగాణా చరిత్రలో ఎంతో కీలకమైన సెప్టెంబర్ 17వ తేదీకి ప్రాముఖ్యత లేకుండా చేసేశాయి.


తెలంగాణా రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. అధికారంలోకి రావటంలో ప్రతి పార్టీది ఒక్కో పంథా ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ చరిత్రలో తెలంగాణాకు సంబంధించిన ముఖ్య ఘట్టాన్ని కూడా పార్టీలు తమదైన పద్దతిలో చిత్ర విచిత్రమైన భాష్యాలు చెబుతున్నాయి. తెలంగాణా చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి చాలా ప్రాధాన్యతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న తేదీని పార్టీలు తమిష్టం వచ్చినట్లుగా జరుపుకుంటున్నాయి. తేదీ ఒకటే అయినా పార్టీలు తమచిత్తం వచ్చిన పేర్లు పెట్టుకుని రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. సెప్టెంబర్ 17వ తేదీని ఒక పార్టీ ప్రజాపాలనాదినోత్సవం అంటుంది. మరో పార్టీ జాతీయ సమైక్యతా దినోత్సవం అంటుంది. మరో పార్టీ తెలంగాణా విమోచనమంటే మరో రెండుపార్టీలు తెలంగాణా విలీన దినోత్సవమంటున్నాయి.



ఒకే తేదీకి, ఒకే ఘట్టానికి పార్టీలు తమిష్టం వచ్చినట్లుగా పేర్లు పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తుండటం జనాల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఒకే తేదీ, ఒకే ఘట్టానికి పార్టీలు ఇన్ని పేర్లతో కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నట్లు ? ఎందుకంటే ఏ ఒక్క విషయంలో కూడా పార్టీల మధ్య సయోధ్య లేకపోవటమే కారణం. ఇపుడు విషయం ఏమిటంటే సెప్టెంబర్ 17వ తేదీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనా దినోత్సవంగా ఘనంగా జరిపింది. ఇదే రోజును కేంద్ర ప్రభుత్వం తెలంగాణా విమోచన దినోత్సవంగా నిర్వహించింది. 2014 ఎన్నికలకు ముందు మీడియాతో కేసీఆర్ మాట్లాడుతు సెప్టెంబర్ 17వ తేదీని కొందరు తెలంగాణా విమోచన దినోత్సవమని, మరికొందరు తెలంగాణా విలీన దినోత్సవమని, ఇంకొందరు తెలంగాణా విద్రోహ దినోత్సవమని చెప్పుకుంటున్నట్లు గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత పార్టీలు తమ కార్యాలయాల్లో తమిష్టం వచ్చినట్లుగా చెప్పుకుని జెండా ఎగరేసుకోవచ్చని కూడా సూచించారు.



అంతకుముందు ఒక సభలో మాట్లాడుతు సెప్టెంబర్ 17వ తేదీని పెద్దఎత్తున స్వాతంత్ర్యదినోత్సవంగా జరుపుకోవాలని పిలుపిచ్చారు. అయితే అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చప్పుడు చేయటంలేదు. సీపీఐ, సీపీఎం మాత్రం సెప్టెంబర్ 17ను తెలంగాణా విలీన దినోత్సవంగా నిర్వహించాయి. నిజానికి ప్రత్యేక తెలంగాణా రాకముందు బీఆర్ఎస్ నేతలు సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణా విలీన/ విమోచన దినోత్సవంగానే ప్రస్తావించేవారు. కేసీఆర్ మాత్రం బహిరంగంగా స్వాతంత్ర్య దినోత్సవంగా పెద్దఎత్తున జరుపుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మాట మార్చేసి సెప్టెంబర్ 17వ తేదీని జాతీయ సమైక్యతా దినోత్సవంగా మార్చేశారు. దీనికి కారణం ఏమిటంటే ఎంఐఎం పార్టీ అనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.



2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ బొటాబొటి మెజారిటితో అధికారంలోకి వచ్చింది. అధికారాన్ని సుస్ధిరం చేసుకునేందుకు ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నది. ఎప్పుడైతే ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నదో వెంటనే సెప్టెంబర్ 17వ తేదీపై కేసీఆర్ మాట మార్చేసి జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించారు. కేసీఆర్ ప్రకటపై కాంగ్రెస్, బీజేపీలు మండిపడ్డాయి. ఎంఐఎంతో పొత్తు కారణంగానే తెలంగాణా విమోచన (విలీన) దినోత్సవాన్ని కేసీఆర్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా మార్చేసినట్లు తీవ్రమైన ఆరోపణలు కూడా చేశాయి. తెలంగాణా ఏర్పడిన పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా సెప్టెంబర్ 17పై మాట మార్చేసింది. సెప్టెంబర్ 17వ తేదీని ప్రజా పాలనా దినోత్సవంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎందుకంటే ఇపుడు కాంగ్రెస్ కూడా ఎంఐఎం మద్దతుపైనే ఆధారపడ్డది కాబట్టి.

ఇది చరిత్ర




1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని రాజ్యాలు, సంస్ధానాలు ఇండియన్ యూనియన్లో కలిసిపోయాయి. అయితే దేశానికి మధ్యలో ఉన్న నిజాం రాజ్యం మాత్రం ఇండియన్ యూనియన్లో కలవటానికి ఇష్టపడలేదు. నిజాం రాజ్యమంతా స్వతంత్రంగానే ఉంటుందని 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ప్రకటించారు. అంతేకాకుండా ఇండియన్ యూనియన్ ఎక్కడ తనపైకి యుద్ధం ప్రకటిస్తుందో అన్న అనుమానంతో నిజాం పాకిస్ధాన్ సైన్య సహకారం కోరారు. అలాగే ఐక్య రాజ్యసమితిని కూడా సాయం కోరారు. అయితే పాకిస్ధాన్ కాని ఐక్య రాజ్యసమితి కాని నిజాం రిక్వెస్టుకు సానుకూలంగా స్పందించలేదు. దాంతో నిజాం ప్రభుత్వంపై సైనిక చర్య తప్పదని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాంను హెచ్చరించారు. ఆ హెచ్చరికలు, తర్వాత జరిగిన సంప్రదింపుల ఫలితంగా తన ప్రభుత్వాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయటానికి నిజాం అంగీకరించారు.



విచిత్రం ఏమిటంటే సెప్టెంబర్ 17వ తేదీపైన మేథావుల్లో సైతం భిన్న వాదనలు ఉండటం. ఇండియన్ యూనియన్లో నిజాం స్టేట్ విలీనమైంది కాబట్టి విలీన దినోత్సవంగా పరిగణించాలని కొందరు వాదిస్తున్నారు. అదేంకాదు నిజాం పాలన నుండి జనాలకు విమోచనం లభించింది కాబట్టి సెప్టెబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగానే జరపాలని మరికొందరు వాదిస్తున్నారు. నిజాం స్టేట్ లో భాగంగా ఉన్న కర్నాటక, మహారాష్ట్రాలోని ప్రాంతాలు తెలంగాణాతో తర్వాత విడిపోయాయి. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సెప్టెంబర్ 17వ తేదీని విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్నాయి. ఈ మొత్తానికి కేంద్ర బింధువైన తెలంగాణాలో మాత్రం సమైక్య పాలనలో కావచ్చు లేదా ఇపుడు ప్రత్యేక తెలంగాణాలో కూడా కావచ్చు పార్టీలు తలా పేరుపెట్టి తెలంగాణా చరిత్రలో ఎంతో కీలకమైన సెప్టెంబర్ 17వ తేదీకి ప్రాముఖ్యత లేకుండా చేసేశాయి.

Read More
Next Story