మరణంలోనూ ప్రత్యేకతను చాటుకున్నచార్వాక తోటకూర!
x
తోటకూర వెంకటేశ్వర్లు

మరణంలోనూ ప్రత్యేకతను చాటుకున్న'చార్వాక' తోటకూర!

నిజాయితీకి నిలువుటద్దం, నిబద్ధతకు చిరునామా: తోటకూర వెంకటేశ్వర్లుకు నివాళి


(కృష్ణా కానూరి, విజయవాడ)
తెలుగు నేలపై హేతువాద భావజాలాన్ని సామాన్యుడి ముంగిటకు చేర్చిన 'చార్వాక' పత్రిక రథసారధి తోటకూర వెంకటేశ్వర్లు (83) అస్తమయంతో ఒక శకం ముగిసింది. బతుకులోనే కాకుండా మరణంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్న తోటకూర వెంకటేశ్వర్లు శుక్రవారం (డిసెంబర్ 26) గుంటూరులో గుండెపోటుతో కనుమూశారు. హేతువాద ఉద్యమానికి ప్రాణం పోసి, సహకారోద్యమానికి ఆదర్శ నేతగా నిలిచారు. ఆదర్శాలకు కట్టుబడి ఆర్భాటాలకు దూరంగా, ప్రచారానికి ఆమడదూరంలో ఉంటూ, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం రాజీలేని పోరాటం చేసిన అపురూప వ్యక్తిత్వం ఆయనది. బ్యాంకు ఉద్యోగిగా ప్రస్థానం మొదలుపెట్టి, సహకార రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం శ్రమించి, వ్యవస్థలోని లోపాలను ఎదిరిస్తూ ఒంటరిగా సుప్రీంకోర్టు వరకు పోరాడిన ఆ ధీశాలి ప్రస్థానం నేటితరానికి ఒక గొప్ప పాఠం.
అక్షరమే ఆయుధంగా 'చార్వాక' ప్రయాణం
బాపట్ల జిల్లా సంతరావూరు గ్రామానికి చెందిన తోటకూర వెంకటేశ్వర్లు విద్యాభ్యాసం ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగింది. చిన్నతనంలోనే హేతువాద ప్రభావానికి లోనైన ఆయన ఆ తర్వాతి కాలంలో హేతువాద ఉద్యమాన్నే నడిపారు. 1970వ దశకంలో హేతువాద ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో ప్రపంచ ప్రసిద్ధ హేతువాది ఏ.టి. కోవూరు ప్రభావంతో వెంకటేశ్వర్లు 'చార్వాక' మాస పత్రికను ప్రారంభించారు. 1976-81 మధ్య కాలంలో ఈ పత్రిక ద్వారా వేలాది మందిని హేతువాదం వైపు ఆకర్షించారు. విశేషమేమిటంటే, ఎడిటర్ గా తన పేరును కూడా వేసుకోకుండా, అనామకుడిగానే వుంటూ ఉద్యమాన్ని నడిపిన నిగర్వి ఆయన. ప్రసిద్ధ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావుని కూడా 'చార్వాక' వేడుకకు ఆహ్వానించిన ఘనత ఆయనది.
నిజాయితీ అనే నిప్పుల మీద నడక..
వ్యక్తులు వ్యవస్థలపై పోరాటం చేయడమంటే కత్తి మీద సామె. ఇంటా బయట అవమానాలు, మొండివాడు అనే ముద్రలు వేయించుకోవడమే. తోటకూర జీవితంలోనూ అదే జరిగింది. ఆయనది నిఖార్సైన పోరాటం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ ఉద్యోగుల శ్రేయస్సు కోసం 'కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ', 'కోఆపరేటివ్ స్టోర్స్' స్థాపించారు. 'మార్కెట్ మనల్ని శాసించకూడదు.. మనమే మార్కెట్ ను నియంత్రించాలి' అనే ఆశయంతో ఆయన చేసిన పని, అవినీతిపరుల కడుపుకొట్టింది. ఫలితంగా తోటి ఉద్యోగుల కుట్రలకు బలై ఉద్యోగాన్ని కోల్పోయినా, కుంగిపోకుండా న్యాయశాస్త్రాన్ని స్వయంగా అధ్యయనం చేసి, సుప్రీంకోర్టులో జస్టిస్ తార్కుండే వంటి దిగ్గజాల ఎదుట తన వాదనలు తానే వినిపించుకున్న ధైర్యశాలి.

తోటకూర వెంకటేశ్వర్లు (స్వెట్టర్ వేసుకున్న వ్యక్తి)తో కేశవులు, అక్బర్ పాషా

ఆయన నిజాయితీ ఎంతటిదంటే... తన పిల్లల్లో ఒకరి పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం లంచం అడిగిన కానిస్టేబుల్‌కు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ కానిస్టేబుల్- ఆ అడ్రసు అసలు లేనే లేదని చెప్పి- మూడేళ్ల జాప్యం చేయించారు. ఈ తరహా తీరు వల్ల తన పిల్లలు ఇబ్బంది పడ్డా ఆయన మాత్రం తన విలువలను వదులుకోలేదు.

చివరి కోరికలోనూ ఒక ప్రత్యేకత
జీవితాంతం హేతుబద్ధంగా జీవించిన ఆయన, మరణం విషయంలోనూ అంతే స్పష్టతతో వున్నారు. తాను మరణించినపుడు ఆర్భాటాలు వద్దని, ఎవరికీ సమాచారం ఇవ్వవద్దని, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే అంత్యక్రియలు జరగాలని చెప్పి, ఆమేరకు కుటుంబ సభ్యుల నుంచి మాట తీసుకున్నారు. కన్నీళ్లు, సంతాప సభల కంటే, నిశ్శబ్దంగా నిష్క్రమించడమే సరైనదని నమ్మిన అరుదైన మానవతావాది ఆయన.
"మా నాన్న తోటకూర వెంకటేశ్వర్లు గారు ఈరోజు వేకువజామున గుంటూరు లో గుండె నొప్పితో చనిపోయారు. మా నాన్న గారి చివరి కోరిక మేరకు మా ముగ్గురు అన్నదమ్ములు, అమ్మ సమక్షం లో మాత్రమే అంత్యక్రియలు పూర్తి చేశాము. ఇది ఆయన చివరి నిమిషం లో కూడా మాకు గట్టిగా చెప్పి, మాట తీసుకున్నారు. ఆయన చివరి కోరిక ఇది. మీ అందరి సమక్షంలో అంతిమ కార్యక్రమం చేయాలని ఉన్నా, నాన్న గారి చివరి కోరిక మేరకు చేయలేక పోయాం.
అందరూ రావటం బాధపడటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇదంతా తనకి ఇష్టం ఉండదు అన్నాడు. ఆయన మంకు పట్టుదల మీ అందరికీ తెలుసు కదా.
మమ్ములను క్షమించి, సహృదయం తో అర్థం చేసుకోగలరు .
మీ ...
శ్రీహర్ధ, రాము, సతీష్"
ఇంతటి పట్టుదల ఆయనది.
పేదరికం ఆయనకు కొత్తకాదు, ఆకలి రుచి ఎరగనివాడు. ఆయన జీవితంలో ఓ సంఘటన వింటే కన్నీళ్లు ఆగవు.
ఉద్యోగం పోయి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న రోజుల్లోనూ ఎక్కడా చేయి చాచని వ్యక్తి. అష్టకష్టాలు చుట్టుముట్టిన రోజుల్లో కూడా సిద్ధాంతం కోసం బతికిన త్యాగశీలి తోటకూర వెంకటేశ్వర్లు. సహకార రంగంపై ఆయన రాసిన పుస్తకాలు, చార్వాక పత్రిక ద్వారా ఆయన అందించిన విజ్ఞానం ఎప్పటికీ సజీవం. ఒక వ్యక్తిగా ఆయన భౌతికంగా మనమధ్య లేకపోయినా, ఆయన పాటించిన విలువలు, ప్రదర్శించిన సాహసం హేతువాద, మానవవాద ఉద్యమాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే వుంటాయి.
తోటకూర వెంకటేశ్వర్లు మృతి పట్ల హేతువాది మాస పత్రిక సంపాదకుడు మేడూరి సత్యనారాయణ, ప్రజాసాహితి ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబు, పి.యు.సి.ఎల్. ఆంధ్రప్రదేశ్ నేత మల్లెల శేషగిరిరావు, సహకారభూమి పక్షపత్రిక గౌరవ సంపాదకులు దాసరి కేశవులు, సంపాదకుడు అక్బర్ పాషా, భారత హేతువాద సంఘం, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం, రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ నాయకులు, అభిమానులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
(రచయిత- ఇండిపెండెంట్ జర్నలిస్టు, సహకార రంగ నిపుణులు)
Read More
Next Story