
పోలవరం బోర్డు
ఆంధ్రలో ఆ రెండు జిల్లాలూ సమ్‌థింగ్ స్పెషల్!
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనతో అతి తక్కువ మండలాలతో అల్లూరి సీతారామరాజు, అతి తక్కువ జనాభాతో పోలవరం జిల్లాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జరిపిన పునర్విభజన ప్రక్రియలో రెండు ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 22 మండలాలతో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఇప్పుడు కేవలం 11 మండలాలకే (6.04 లక్షల జనాభా) పరిమితమైంది. దీంతో ఈ జిల్లా ఇప్పుడు విశాఖ జిల్లా (48.5 లక్షల జనాభా)తో పాటు రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లాగా మారిపోయింది. కొత్తగా ఏర్పడుతున్న పోలవరం జిల్లా కూడా ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ జిల్లాలో 12 మండలాలున్నా జనాభా కేవలం 3.49 లక్షల మందే ఉన్నారు. ఈ లెక్కన మండలాల పరంగా చూస్తే అతి చిన్న జిల్లాగా అల్లూరి సీతారామరాజు, జనాభాలో అతి చిన్న జిల్లా పోలవరం తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయన్న మాట!
కొత్తగా ఏర్పడుతున్న పోలవరం జిల్లా మ్యాప్
సగానికి సగం చీలిన అల్లూరి జల్లా..
జిల్లాల పునర్విభజనతో అల్లూరి సీతారామరాజు జిల్లా సగానికి సగం చీలిపోయింది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 22 మండలాలుండేవి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 11 మండలాలను అప్పట్లో కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిపారు. వీటిలో చింతూరు, ఎటపాక, కూనవరం, వరరామచంద్రపురం, అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, రంపచోడవరం, వై.రామవరం మండలాలున్నాయి. తాజాగా జిల్లాల పునర్విభజనలో రాష్ట్ర ప్రభుత్వం రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది. ఈ జిల్లాలోని మండలాలన్నీ రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోనివే. ఈ పోలవరం జిల్లాను గతంలో తూర్పు గోదావరి జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిపిన 11 మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న గుర్తేడు మండలంతో రూపొందించింది. దీంతో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా 11 మండలాలు, కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా 12 మండలాలను కలిగి ఉన్నట్టయింది. పోలవరం జిల్లా రూపుదిద్దుకున్నాక ప్రస్తుతం అల్లూరి జిల్లాలో చింతపల్లి, అనంతగిరి, అరకువేలీ, డుంబ్రిగుడ, జి.మాడుగుల, గూడెం కొత్తవీధి, హుకుంపేట, కొయ్యూరు, పాడేరు. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలు మిగిలాయి. కాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 మండలాలున్నాయి.
జిల్లా కేంద్రం రంపచోడవరం పట్టణం
ఆ రెండూ గిరిజన జిల్లాలే..
కొత్త జిల్లా పోలవరం 12 మండలాలు, అల్లూరి జిల్లాలో ఉన్న 11 మండలాలన్నీ గిరిజన మండలాలే కావడం మరో విశేషం! దీంతో ఈ రెండూ పూర్తిగా గిరిజన మండలాలతో ఉన్న జిల్లాలుగా ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. కాగా తాజా మార్పులు చేర్పులతో కొత్తగా ఏర్పడనున్న పోలవరం జిల్లాలో 3,49,953 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6,04,047 మంది జనాభా ఉంటారు.
పోలవరం జిల్లా స్వరూపం ఇదీ!
కొత్తగా ఏర్పాటవుతున్న పోలవరం జిల్లా స్వరూపాన్ని పరిశీలిస్తే.. ఈ జిల్లా 5,528 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. 53,771 హెక్టార్లలో అడవుల విస్తీర్ణం ఉంది. 54,344 హెక్టార్లలో పంట భూములు ఉన్నాయి. 3,49,953 మంది జనాభా, 2,55,313 మంది ఓటర్లు ఉన్నారు. రెండు ఐటీడీఏలు, రెవిన్యూ డివిజన్లు (రంప చోడవరం, చింతూరు), 12 మండలాలు, 189 పంచాయతీలు, 827 గ్రామాలను కలిగి ఉంది. నాలుగు సాగునీటి ప్రాజెక్టులు, చింతూరు మండలం పొల్లూరు, వై.రామవరం మండలం డొంకరాయిల్లో జలవిద్యుత్ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా రైతులు వరి, మొక్కజొన్న, పత్తి, అరటి, జీడిమామిడి, పొగాకు తదితర పంటలను ఎక్కువగా పండిస్తారు.
ఇక ఉత్తరాంధ్ర పరిధిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో ప్రస్తుత మండలాల సంఖ్య ఇలా ఉంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాలు, విజయనగరం జిల్లాలో 28 మండలాలు, అనకాపల్లి జిల్లాలో 24, పార్వతీపురం మన్యం 15, విశాఖపట్నం 11, అల్లూరి సీతారామరాజు జిల్లా 11 మండలాలను కలిగి ఉన్నాయి.
అనకాపల్లి జిల్లాలో మండలాలుః
అనకాపల్లి జిల్లాలో 24 మండలాలున్నాయి. వీటిలో అనకాపల్లి, అచ్యుతాపురం, బుచ్చయ్యపేట, చోడవరం, దేవరాపల్లి, ఎలమంచిలి, కె.కోటపాడు, కశింకోట, మునగపాక, పరవాడ, రాంబిల్లి, సబ్బవరం, చీడికాడ, గొలుగొండ, కోటవురట్ల, మాడుగుల, మాకవరపాలెం, నక్కపల్లి, నర్సీపట్నం, నాతవరం, పాయకరావుపేట, రావికమతం, రోలుగుంట, ఎస్.రాయవరం.
విశాఖపట్నం జిల్లాలో మండలాలుః
విశాఖపట్నం జిల్లాలో మొత్తం 11 మండలాలున్నాయి. వీటిలో ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం, సీతమ్మధార, విశాఖపట్నం రూరల్, గాజువాక, గోపాలపట్నం, మహారాణిపేట, ములగాడ, పెదగంట్యాడ, పెందుర్తి.
విజయనగరం జిల్లాలో మండలాలు..
ఈ జిల్లాలో 28 మండలాలున్నాయి. అవిః బాడంగి, బొబ్బలి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, రామభ్రదపురం, తెర్లాం, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం, రాజాం, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, వంగర, భోగాపురం, బొండపల్లి, డెంకాడ, గంట్యాడ, జామి, కొత్తవలస, లక్కవరపుకోట, నెల్లిమర్ల, పూసపాటిరేగ, శృంగవరపుకోట, వేపాడ, విజయనగరం.
పార్వతీపురం మన్యం జిల్లాలోః
ఈ జిల్లాలో 15 మండలాలున్నాయి. వీటిలో భామిని, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, బలిజపేట, గరుగుబిల్లి, కొమరాడ, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం.
శ్రీకాకుళం జిల్లాలో మండలాలుః
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 30 మండలాలున్నాయి. వీటిలో.. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, నందిగాం, పలాస, సోంపేట, వజ్రపు కొత్తూరు, ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల, జి.సిగడాం, గార, జలుమూరు, లావేరు, నరసన్నపేట, పోలాకి, పొందూరు, రణస్థలం, సరుబుజ్జిలి, శ్రీకాకుళం, హిరమండలం, కోటబొమ్మాళి, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట, మెళియాపుట్టి, పాతపట్నం, సంతబొమ్మాళి, సారవకోట, టెక్కలి.
Next Story

