ఈ స్థానాల్లో ఆ పార్టీలదే పట్టు
x

ఈ స్థానాల్లో ఆ పార్టీలదే పట్టు

కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు టీడీపీకి, మరి కొన్ని నియోజక వర్గాలు వైఎస్‌ఆర్‌సీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.


ఎన్నికలు అనగానే ఎత్తులకు పై ఎత్తులేయడం, గెలుపు గుర్రాలను వెతకడం పరిపాటి. డబ్బు, పరపతి ఉన్న వారికి టికెట్లు దక్కుతున్నాయి. కానీ గెలుపు మాత్రం అందరికీ దక్కడం లేదు. అది కొందరికే పరిమితం అవుతుంది. తెలుగుదేశం పార్టీ గత రెండు ఎన్నికల్లో కొన్ని నియోజక వర్గాల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. పూతలపట్టు, రంపచోడవరం, ఎర్రగొండపాలెం, రాజాం, శ్రీశైలం, నెల్లూరు రూరల్, పులివెందుల నియోజక వర్గాల్లో 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవి చూసింది. పూతలపట్టు, ఎర్రగొండపాలెం, రాజాం నియోజక వర్గాలు ఎస్సీ రిజర్వుడు స్థానాలు కాగా రంపచోడవరం ఎస్టీ రిజర్వుడు స్థానం. ఇక శ్రీశైలం, నెల్లూరు రూరల్, పులివెందుల నియోజక వర్గాలు జనరల్‌ స్థానాలు. మూడు ఎస్సీ నియోజక వర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభిమానులు, ఓటర్లు దాదాపు 70 శాతంపైనే ఉన్నారు. అలాంటప్పుడు అక్కడ టీడీపీ గెలుపు అవకాశాలు చాలా స్వల్పమే అని చెప్పొచ్చు. రంపచోడవరం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ రెండు ఎన్నికల్లోను ఘన విజయం సాధించింది. విచిత్రం ఏమిటంటే ఇక్కడ 2014లో గెలిచిన వంతల రాజేశ్వరి ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆమెకు 2019లో టీడీపీ నుంచి సీటు ఖరారు చేసినా ఓటమి పాలయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి నాలుగపల్లి ధనలక్ష్మి గెలుపొందారు. సుమారు 39వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో రాజేశ్వరిని ఓడించారు. అంటే ఇక్కడ గిరిజనులు కాంగ్రెస్‌ అభిమానులుగాను ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభిమానులుగాను ఉన్నారు. శ్రీశైలం అసెంబ్లీ నియోజక వర్గం ఏర్పడిన నాటి నుంచి ఇది కాంగ్రెస్‌కు కంచుకోటగానే చెప్పొచ్చు. ఈ నియోజక వర్గం ఏర్పడిన అనంతరం జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఏరాసు ప్రతాప్‌రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. 2014లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బుడ్దా రాజశేఖరరెడ్డి టీడీపీ అభ్యర్థి శిల్పాచక్రపాణి రెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత వీరిద్దరు పార్టీలు మారారు. బుడ్డా రాజశేఖరరెడ్డి టీడీపీలోకి వెళ్లగా, శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లారు. అయినా 2019 ఎన్నికల్లో గెలుపు మాత్రం వైఎస్‌ఆర్‌సీపీనే వరించింది. నెల్లూరు రూరల్‌ కూడా కాంగ్రెస్‌ కంచుకోట. తొలుత ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనం వివేకనందరెడ్డి గెలుపొందారు. తర్వాత 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేసిన కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి గెలుపొందారు. ఇక పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గం వైఎస్‌ఆర్‌ కుటుంబం అడ్డాగా ప్రసిద్ధి చెందింది. ఏళ్ల తరబడి అక్కడ నుంచి ఆ కుటుంబ సభ్యులే గెలుస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ తర్వాత ఏర్పడిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ తరపున వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలిచారు.

రాష్ట్రంలోని కొన్ని నియోజక వర్గాల్లో టీడీపీ తప్ప వైఎస్‌ఆర్‌ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. వైఎస్‌ఆర్‌సీపీ ఏర్పడిన తర్వాత రెండు సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోను ఓటమి పాలైంది. చీరాల, గన్నవరం, ఇచ్చాపురం, పెద్దాపురం, పాలకొల్లు, ఉండి, గుంటూరు పశ్చిమ, కొండపి, రేపల్లే, విజయవాడ తూర్పు, విశాఖ తూర్పు, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్‌లో కూడా వైఎస్‌ఆర్‌సీపీకి విజయం దక్క లేదు. మండపేట, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ నియోజక వర్గాల్లోను వైఎస్‌ఆర్‌సీపీ ఓటమి పాలైంది. ఈ నియోజక వర్గాలు టీడీపీకి కంచుకోటలు. ఈ కోటలను బద్దలు కొట్టడం వైఎస్‌ఆర్‌సీపీకి గడచిన రెండు ఎన్నికల్లోను సాధ్యం కాలేదు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా కనీసం కొన్ని నియోజక వర్గాల్లోనైనా పట్టు సాధించాలనే ఉద్దేశంతో అభ్యర్థులను ఏరి కోరి నియమించింది.



Read More
Next Story