ఈ సారి కూడా మోదీ గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లేనా?
x

ఈ సారి కూడా మోదీ గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లేనా?

పీఎం మోదీ ఏమి మాట్లాడుతారు.. ఎలాంటి వరాలు ఇస్తారు.. విభజన చట్టం హామీలపై ఎలా స్పందిస్తారనేది హాట్‌ టాపిక్‌గా మారింది.


నాడు అమరావతిలో జరిగిన అమరావతి నిర్మాణం శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు బహుమతిగా తెచ్చారు. పార్లమెంట్‌ నుంచి మట్టి, చెంబుడు గంగా జలాన్ని తెచ్చి పవిత్రమైనవి వాటిని తెచ్చి అమరావతి శంకు స్థాపనలో కలుపుతున్నట్టు చెప్పారు. తర్వాత చేతులు దులుపుకున్నారు. నాటి ఐదేళ్ల కాలంలో కానీ, తర్వాత జగన్‌ హయాంలోని ఐదేళ్ల కాలంలో కానీ ఆంధ్రప్రదేశ్‌ను మోదీ పెద్ద పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా బుధవారం చంద్రబాబు నాయుడు మరో సారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ సారి కూడా గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు తెచ్చి చేతులు దులుపుకుంటారా అని పైకి చెప్పుకోలేక పోయినా అన్ని పార్టీల శ్రేణుల్లో అంతర్గత చర్చ సాగుతోంది.

గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నిధులు కేటాయించడం, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలోను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందనే విమర్శలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, విశాఖపట్నం రైల్వే జోన్‌ ఏర్పాటు, రాజధాని అమరావతి నిర్మాణం వంటి పలు అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందించడంలోను ప్రధాని మోదీ విఫలమయ్యారనే విమర్శలు అన్ని పార్టీలు, అన్ని వర్గాల్లోను ఉంది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యమైన విజయాన్ని నమోదు చేసుకున్న టీడీపీ కేంద్రంలో కూడా కీలకంగా మారింది. బీజేపీ తర్వాత అత్యధిక సీట్లు కలిగిన పార్టీగా ఉన్న టీడీపీ అవతరించింది. ఆంధ్రప్రదేశ్‌లో అద్బుతమైన విజయాన్ని నమోదు చేసుకున్న ఎన్డీఏ కూటమి, కేంద్రంలోను కీలకంగానే మారింది. కేంద్రంలోని ఏన్డీఏ కూటమి ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలన్నా.. ప్రధానిగా మోదీ కొనసాగాలన్నా టీడీపీ సపోర్టు ఎంతో కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు విమర్శల కత్తులు దూసుకున్న చంద్రబాబు, మోదీ ప్రస్తుతం మంచి దోస్తులుగా ముందుకు సాగుతున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ ప్రధాని హోదాలో హాజరు కానున్నారు. దీంతో మోదీ పైన టీడీపీతో పాటు రాష్ట్ర బీజేపీ, జననసేన కూటమి శ్రేణులు ఎన్నో అశలు పెట్టుకున్నారు. ఎలాంటి వరాల ఝల్లు కురిపిస్తారు, నిధుల కేటాయింపుల్లో ఎలాంటి హామీలు ఇవ్వనున్నారు, విభజన చట్టంలోని హామీల గురించి ప్రస్తావిస్తారా? పోలవరం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు? విశాఖపట్నం రైల్వే జోన్‌ ఏర్పాటుకు సంబంధించి మోదీ ఏమి చెప్పనున్నారు? ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు? ఇతర హామీల గురించి ఎలా స్పందించనున్నారనేది అటు రాజకీయ వర్గాలు, ఇటు మేధావులు, అన్ని వర్గాల ప్రజల్లో ఆసక్తి కరంగా ఎదురు చూస్తున్నారు.
ఒక వేళ రాష్ట్ర అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా వంటి పలు అంశాలపై ఈ సారి స్పష్టమైన హామీలు కానీ, వాటి అమలకు అటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇటు ప్రధాని మోదీ నుంచి స్పష్టమైన హామీలు ఇప్పించుకోలేక పోతే టీడీపీ, జనసేన, బీజేపీలు ఎన్డీఏ భాగస్వాములుగా ఉండీ కూడా ఏమి ప్రయోజనమనే టాక్‌ ఇప్పటికే అన్ని వర్గాల్లో వినిపిస్తోంది.
Read More
Next Story