జగన్‌తో రఘురామ ఏం మాట్లాడారో తెలుసా!
x

జగన్‌తో రఘురామ ఏం మాట్లాడారో తెలుసా!

అసెంబ్లీ సమావేశాల తొలి రోజున జగన్, రఘురామకృష్ణం రాజు మధ్య సంభాషణ జరగడం అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు వారేం మాట్లాడుకున్నారు అన్నది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం గవర్నర్ ప్రసంగంతో మొదలైన సమావేశాల నుంచి వైసీపీ నేతలు తొలిరోజే బాయ్‌కాట్ చేశారు. నల్ల కండువాలు కప్పుకుని నిరసన వ్యక్తం చేసిన జగన్.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో తమ పార్టీని, పార్టీ నేతలను నేరుగా విమర్శించడం సరికాదని, అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అసెంబ్లీలో రెండు వర్గాలు ఉంటాయని, ఒకటి అధికారపక్షమైతే మరొకటి ప్రతిపక్షమని, ఇక్కడ ప్రతిపక్షంగా ఒకే పార్టీ ఉందని, ఆ పార్టీ నేతనే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్బంగా మాజీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు వారు ఏం మాట్లాడుకున్నారు అన్నది మరింత ఆసక్తికర అంశంగా మారింది. రాష్ట్రమంతా దీని గురించే చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో వారి మధ్య చాలా ఘాటైన మాటలే నడిచాయని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. నీకు అధికారంలో ఉన్నప్పుడు నన్ను కొట్టించి, చంపేయడానికి కూడా ప్రయత్నించావు.. ఇప్పుడు నాకు అధికారం ఉంది అన్న విధంగా రఘురామ.. జగన్‌వైపు చూశారని కూడా కొందరు అంటున్నారు. మరికొందరు అదే విషయంపై జగన్‌కు స్వీట్ వార్నింగ్ ఇవ్వడానికి రఘురామ వెళ్లారని కూడా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కేసు నమోదు చేశానని, అతి త్వరలోనే కటకటాల వెనక్కు పంపుతానని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించడానికే రఘురామ వెళ్లారని కూడా కొందరు మేధావులు ఊహాగానాలు చేశారు. అయితే వారి మధ్య అటువంటిదేమీ జరగలేదని తెలిపోయింది. ఈ విషయాన్ని రఘురామకృష్ణం రాజే వెల్లడించారు.

అసెంబ్లీ సమావేశాల సందర్బంగా జగన్ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వెళ్తున్న సమయంలో రఘురామ తన సీటు నుంచి లేచి జగన్‌ను పలకరించారు. అందరూ ఆసీనులైన తర్వాత కూడా జగన్ వద్దకు వెళ్లి ఆయన భుజంపై చెయి వేసి మరీ రఘురామ మాట్లాడారు. వారిద్దరి మధ్య ఉన్న వివాదాస్పద వాతావరణ నేపథ్యంలో రఘురామ చర్యలు రాజకీయ వర్గాలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. కాగా ‘‘అసలు మీకు ప్రతిపక్ష హోదాతో పనేముంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీ పార్టీ శాసనసభాపక్షానికి నాయకుడు మీరే. ఆ హోదాలో అసెంబ్లీకి రండి. ప్రతిపక్ష నేత హోదా అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి సభా సమావేశాలకు హాజరుకాండి అని అడిగాను. అందుకు జగన్ కూడా సానుకూలంగా స్పందిస్తూ.. తప్పకుండా వస్తానని అన్నారు’’ అని చెప్పానని రఘురామ చెప్పారు.

రఘురామ మాటలకు అర్థమదేనా..

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రతిపక్ష హోదాతో ఏముంది అంటూ జగన్‌కు రఘురామ హితబోధ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష హోదా కోసం ఎంతో పోరాడుతున్న జగన్‌కు అది అందని ద్రాక్ష అని ఆర్ఆర్ఆర్ చెప్పారా అని, లేకుంటే ఎంత ప్రయత్నించినా ప్రతిపక్ష హోదాను రానివ్వమని హెచ్చరించారా అని కూడా చర్చలు జరుగుతున్నాయి. అదే విధంగా ఆర్ఆర్ఆర్‌తో మాట్లాడిన తర్వాతే అసెంబ్లీ నుంచి వైసీపీ బాయ్‌కాట్ చేసింది. ఆ తర్వాత బయట మాట్లాడుతూ.. వైసీపీ ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్ వ్యాఖ్యానించడం మరింత ఆసక్తికరంగా మారింది. జగన్ తన వ్యాఖ్యలతో ప్రతిపక్ష హోదా పొందడంపై పోరాటానికి సిద్ధమని సమర శంఖం ఊదారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Read More
Next Story