ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు
“ప్రజారోగ్యం విషయంలో అధికారులు అలెర్టుగా ఉండాలి. నీటి సరఫరా లోపాల వల్ల వ్యాధుల వచ్చే పరిస్థితి ఉండకూడదు. భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఆయా శాఖలకు చెందిన అధికారులనే బాధ్యులుగా చేస్తాం. ప్రజలకు సేవలందించే విషయంలో సమాచారాన్ని క్రోడీకరించి... త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విషయంలో అధికారుల్లో పోటీతత్వం పెరగాలి. దీని కోసమే మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి డేటా లేక్ వ్యవస్థను తెచ్చాం. అవేర్ ద్వారా 42 అంశాల్లో ప్రజలకు సమాచారం అందించేలా కార్యాచరణ చేశాం. ప్రతీ విభాగం శాటిలైట్ డేటాను వినియోగించుకుని ప్రజలకు మేలు జరిగేలా ఆ సమాచారాన్ని వినియోగించాలి. ప్రస్తుతం 800కు పైగా సేవలు వాట్సప్ ద్వారా అందిస్తున్నాం. మిగతా 383కుపైగా సేవలు కూడా ఈ పరిధిలోకి వస్తే 1200 సేవలు వాట్సప్ గవర్నెన్సు ద్వారా అందించే అవకాశం ఉంటుంది. అధికారులు తప్పు చేసినా... ప్రజాప్రతినిధులు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. న్యాయ విభాగంలోనూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పెండెన్సీ కేసుల విషయంలో ప్రణాళికలు చేయండి. ఇ-ఫైల్స్ డిస్పోజల్ కూడా వేగంగా జరిగేలా చూడండి. కోర్టు కేసులను త్వరగా క్లియర్ అయ్యేలా చూడాలి.”అని సీఎం స్పష్టం చేశారు.
నిధులను ఖర్చు పెట్టండి... యూసీలివ్వండి
“డిసెంబర్ నెలాఖరులోగా ఖర్చు పెట్టాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను ఇప్పటికీ ఖర్చు పెట్టకుండా వివిధ శాఖలు జాప్యం చేస్తున్నాయి. ఇవి సుమారుగా రూ. 1171 కోట్లు ఉంటాయి. ఈ నిధులను డిసెంబరు 20 లోగా ఖర్చు చేయాలి. వాటికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లనూ కేంద్రానికి పంపాలి. ఈ ఏడాది మరిన్ని ప్రాజెక్టుల ద్వారా అదనపు నిధులు వినియోగించుకుంటే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది. కేంద్రం ఇచ్చిన నిధులు మురిగిపోకుండా తక్షణం సద్వినియోగం చేసుకోవాల్సిందే. మంత్రులు ఈ విషయంలో చురుగ్గా వ్యవహరించాలి. ఈ మేరకు వారి వారి కార్యదర్శుల్ని గైడ్ చేయాలి. ఫైనాన్స్ విభాగం, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్లు ఈ అంశంలో బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వ శాఖలు చేసిన ఖర్చులపై కూడా విశ్లేషణ చేసి వారిని బాధ్యులను చేస్తాం. కేంద్ర ప్రాయోజిత పథకాలపై అన్ని ప్రభుత్వ శాఖలూ తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలి. 2026 మార్చి నాటికల్లా ప్రతీ విభాగం ఆడిట్ పరిధిలోకి రావాలి. ప్రభుత్వ శాఖలు చేసిన వ్యయాన్ని కాగ్ కు పూర్తిస్థాయిలో వివరించండి. అప్పుడే పారదర్శకంగా నివేదిక ఉంటుంది. తద్వారా క్రెడిబిలిటీ వస్తుంది. రోజుల తరబడి మంత్రుల వద్ద ఫైళ్లు ఉండేందుకు వీల్లేదు. వాటిని వేగంగా పరిష్కరించాల్సిందే. ప్రతీ శాఖ మంత్రి, కార్యదర్శులు ఫైళ్ల క్లియరెన్సును సీరియస్సుగా తీసుకోవాలి.”అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.
పనితీరు పెరగాలి... ఫిర్యాదులు తగ్గాలి
“సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రతీ మూడు నెలలకు ఓసారి సమీక్ష చేస్తాం. రైతులు, పంటల ధరలు, రహదారులు, ఉద్యోగాలకల్పన, తాగునీరు, ధరల పెరుగుదల లాంటి అంశాల్లో మెరుగ్గా స్పందించాలి. వేసవిలో తాగునీటి సరఫరా విషయంలో ఇప్పటి నుంచే ప్రభుత్వ శాఖలు సిద్ధం కావాలి. సుపరిపాలనకు అనుగుణంగా బిజినెస్ రూల్స్ సవరించాలి. ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలను విశ్లేషించి వ్యవస్థలో లోపాలను సవరించుకోవాలి. ప్రతి ఒక్క అర్హుడికీ సంక్షేమ పథకాల ప్రయోజనం కలిగేలా కార్యాచరణ చేపట్డాలి. ఫిర్యాదులు తగ్గాలి... అప్పుడే ఆయా శాఖల పనితీరు మెరుగైనట్టుగా భావిస్తాం. రెవెన్యూ, పోలీసు, పురపాలక శాఖల్లో పెద్ద ఎత్తున గ్రీవెన్సులు వస్తున్నాయి. ప్రజాఫిర్యాదులు వెంటనే పరిష్కారం కావాలి. క్షేత్రస్థాయిలో సుపరిపాలన ప్రజలకు చేరేలా అంతా కలిసి పనిచేయాలి. ప్రభుత్వం అందించే పౌర సేవలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ సంబంధిత శాఖలను అప్రమత్తం చేస్తున్నాం. రియల్ టైమ్ లోనే పరిష్కారాలు అందించేలా చర్యలు చేపట్టాలి. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గిరిజన పాఠశాలల్లో ముస్తాబు అనే ఓ చిన్న కార్యక్రమం చేపట్టి విద్యార్ధుల్లో మార్పు తెచ్చారు. ఓ చిరు ప్రయత్నం విద్యార్ధుల్లో మంచి మార్పు తీసుకువచ్చింది. ఇలాంటి మంచి కార్యక్రమాలను రాష్ట్రం మొత్తం అమలు చేయాలి.”అని సీఎం వివరించారు.