
ఇది సూపర్ సిక్స్ ఎగవేతల బడ్జెట్
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో సీఎం చంద్రబాబు మరో సారి ప్రపంచ బ్యాంక్ ఏజెంట్‌గా నిరూపించుకున్నారని సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పేర్కొంది.
కూటమి ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ స్పందించింది. సంపదలు సృష్టిస్తామని తరచుగా హామీల్ని ఇచ్చే చంద్రబాబు కూటమి ప్రభుత్వం భారీ అప్పులు సృష్టించే విలక్షణ బడ్జెట్‌ని ప్రవేశపెట్టిందని మండిపడింది. గత తొమ్మిది నెలలుగా సూపర్ సిక్స్ అమలు గురించి ఆశిస్తున్నా, రాష్ట్ర ప్రజలను వంచిస్తూ ఈ రోజు 3,22,859 కోట్ల బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజలకి ఇచ్చిన అన్ని హామీలకు ఎగనామం పెట్టిన బడ్జెట్‌గా మా సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ భావిస్తున్నది. ఎన్నికల్లో అనేక సంక్షేమ హామీల్ని ప్రజలకు ఇచ్చి చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చింది. కానీ అది ప్రజా సంక్షేమానికి విరుద్ధమైన ట్రికిల్ డౌన్ థియరీ ప్రకారం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది.
ప్రజలకు కొనుగోలు శక్తిని పెంచితే రాష్ట్ర అభివృద్ధి పెరుగుతుందనే సంక్షేమ సిద్ధాంతం ప్రకారం ఎన్నికల హామీలను ఇచ్చింది. కానీ కార్పొరేట్ వర్గాలను ప్రోత్సహిస్తే అభివృద్ధి జరుగుతుందనే ట్రికిల్ డౌన్ థియరీ ప్రకారం ఈరోజు బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. తద్వారా తాను ప్రపంచ బ్యాంకు ఏజెంట్‌గా చంద్రబాబు మరోసారి నిరూపణ చేసుకున్నాడు. ఏటా 20 లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తానని హామీలిచ్చి బుట్టదాఖలా చేసింది. ఈ లోగా నిరుద్యోగ భృతి ఇస్తానని హామీకి బడ్జెట్ ఎగనామం పెట్టింది. ఉచిత బస్సు హామీని ఎగరగొట్టింది. స్త్రీలకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని హామీని ఈ బడ్జెట్ పట్టించుకోలేదు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు కోత పెట్టింది. తల్లికి వందనం పథకానికి 12 వేల కోట్ల అవసరం కాగా, కేవలం 8270 కోట్లు మాత్రమే కేటాయించింది. దీపం పథకాన్ని 1కోటి 55 లక్షల మంది లబ్ధిదారులకు ఇస్తానని 90 లక్షల మందికి కోత పెట్టింది. 10 లక్షల రుణాలకు వడ్డీ మాఫీ చేస్తాను అన్న డ్వాక్రా పథకానికి ఎగనామం పెట్టింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం తను రైతు వ్యతిరేక విధానాన్ని బహిర్గత పరుచుకున్నది. అన్నదాత పథకానికి 6300 కోట్ల రూపాయలకు కుదించింది. రైతుకు 20 వేల రూపాయలు ఇస్తానన్న హామీకి కోత పెట్టింది. దీనికై 10,400 కోట్ల అవసరం ఉంటే 6300 కోట్లు కేటాయించింది. ఇంకా వలంటీర్ల భర్తీకి ఇచ్చిన హామీని ఎగవేసింది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ హామీకి ఎగనామం పెట్టింది. పేద విద్యార్థుల ఉచిత చదువుకు ఉద్దేశించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి తగిన కేటాయింపులు చేయలేదు.
ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాల్సి ఉండగా ఎటువంటి నిధులు బడ్జెట్లో కేటాయించ కుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికే 9 నెలలు మోతాదుకు మించి అప్పులు చేసి వడ్డీలు తీర్చలేని రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భర్తీ చేయలేని స్థితికి తెచ్చి భవిష్యత్తులో రాష్ట్రాన్ని అప్పులు తీర్చే పేరిట కార్పొరేట్లకు విదేశీ ఆర్థిక సంస్థలకు తాకట్టు పెట్టే వైపుగా ఈ బడ్జెట్ అడుగులు వేస్తున్నది. ఈ ప్రజా వ్యతిరేక, సంక్షేమ వ్యతిరేక, కూటమి బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాలని మా సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది అని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అధికార ప్రతినిధులు పి ప్రసాద్, చిట్టి పాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
Next Story