వివాదాలకు కేంద్రం.. విశాఖ కేంద్ర కారాగారం..
x

వివాదాలకు కేంద్రం.. విశాఖ కేంద్ర కారాగారం..

నిత్యం ఆరోపణలకు కేంద్ర బిందువే. తాజాగా సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ల సస్పెన్షన్. మరోవైపు సామర్థ్యానికి మించి ఖైదీలతో ఈ జైలు హౌస్‌ఫుల్

విశాఖపట్నం సెంట్రల్ జైలు.. ఒకప్పుడు ఈ జైలు పేరు చెబితే ఖైదీలకు నిలయంగా గుర్తుకొచ్చేది. కొన్నేళ్లుగా అది వివాదాల కేంద్ర కారాగారంగా పేరు గడించింది. తరచూ ఏవో ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. అవినీతి, లైంగిక ఆరోపణలే కాదు.. గంజాయి పంపిణీకి కూడా ఇది ఆలవాలంగా మారిపోయింది. సాక్షాత్తూ జైలు సిబ్బంది, అధికారులు కూడా ఈ ఆరోపణల్లో చిక్కుకుంటున్నారు. పనిష్మెంట్లకు గురవుతున్నారు. అయినప్పటికీ వీరిలో ఎలాంటి మార్పు రావడం లేదు సరికదా? సరికొత్త వివాదాల్లో తలదూరుస్తూ ఈ సెంట్రల్ జైలును వార్తల్లో నిలుపుతున్నారు.

తొలుత బ్రిటిషర్ల కాలంలో విశాఖ నగరం నడిబొడ్డున 1908లో సెంట్రల్ జైలు ఏర్పాటైంది. అలా ఈ కారాగారం 93 ఏళ్ల పాటు అక్కడే మనుగడ సాగించింది. పెరుగుతున్న ఖైదీలను దృష్టిలో ఉంచుకుని 2001లో ఈ జైలును నగర శివారుల్లోని రామకృష్ణాపురానికి తరలించారు. అక్కడ వంద ఎకరాల సువిశాల స్థలంలో కేంద్ర కారాగారాన్ని ఆధునిక హంగులు, సదుపాయాలతో ఏర్పాటు చేశారు.

అప్పట్నుంచి ఈ సెంట్రల్ జైలులో వివాదాలు, ఆరోపణలకు కొదవ లేదు. 15 ఏళ్ల క్రితం ఖైదీల కుటుంబీకులకు ములాఖత్ అవకాశం కల్పించేందుకు లంచాలు, ఇతర లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో జైలర్, డిప్యూటి జైలర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. 2009లో వల్లభరావు అనే ఖైదీ ఈ జైలు నుంచి తప్పించుకుపోయాడు. సిబ్బంది సహకారంతోనే ఆయన పరారయ్యాడంటూ బాధ్యులను సస్పెండ్ చేశారు. పదేళ్ల క్రితం రమేష్ అనే జైలర్ ఖైదీ కుమార్తె నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు.

ఇటీవల ఉప్పాడ గౌరీశంకర్ అనే ఖైదీ జైలులో మరుగుదొడ్డి వెంటిలేటర్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతలో జైలు ఫార్మసిస్టు శ్రీనివాసరావు జైలులో ఉన్న ఓ ఖైదీకి తన లంచ్ బాక్స్లో గంజాయి తీసుకెళ్తూ సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోయాడు. అంతేకాదు.. జైలు సూపరింటెండెంట్ కిషోర్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావులు రాత్రి వేళ ఖైదీల కుటుంబీకులతో సెల్ఫోన్లలో మాట్లాడేందుకు అవకాశం కల్పించారన్న ఫిర్యాదులు జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు వెళ్లాయి.

దీనిపై ముందస్తుగా వారం రోజుల క్రితమే సూపరింటెండెంట్ను అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలుకు, డిప్యూటి సూపరింటెండెంట్ను నెల్లూరుకు బదిలీ చేశారు. సమగ్ర విచారణ జరిపిన అధికారులు కాల్ డేటా రికార్డులను సాంకేతికతతో పరిశీలించారు. వీరి విచారణలో వారిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని తేల్చారు. అనంతరం తాజాగా వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు.

సెంట్రల్ జైల్.. హౌస్ ఫుల్..

రాష్ట్రంలో ఖైదీల కెపాసిటీలో రెండోది అయిన విశాఖపట్నం సెంట్రల్ జైలు ఇప్పుడు ఖైదీల సంఖ్యలో అగ్రస్థానంలో ఉంది. వాస్తవానికి ఈ జైలు సామర్థ్యం 914 మందికే ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ 2100 మందికి పైగా ఉన్నారు. వీరిలో 1600 మంది వరకు రిమాండ్ ఖైదీలు. ఇందులో గంజాయి కేసుల్లో చిక్కుకున్న ఖైదీలే 1400 మంది ఉన్నారు. మిగిలిన వారు సాధారణ, కఠిన కారాగార, సివిల్, మరణ శిక్ష పడిన వారు ఉన్నారు.

గంజాయి కేసు ఖైదీల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందిన ముద్దాయిలున్నారు. కాగా సామర్థ్యానికి మించి ఖైదీలతో ఈ జైలు కిటకిటలాడిపోతూ హౌస్ఫుల్ అయిపోయింది. దీంతో నలుగురు ఉండాల్సిన చోట రెట్టింపు సంఖ్యలో ఉంచుతున్నారు. ఎక్కువగా గంజాయి కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వారు బెయిల్పై విడుదల కావాలంటే సంబంధీకులు జామీను/షూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ ఖైదీల్లో అధికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడం వల్ల జామీనుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా నెలలు, ఏళ్ల తరబడి ఈ జైలులోనే మగ్గిపోతున్నారు. దీంతో ఖైదీలు అదనపు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ జైలుకు రోజుకు 20 మంది ఖైదీలు వస్తుంటే, 15 మంది విడుదలవుతున్నారు. అందువల్ల రోజురోజుకూ ఖైదీల పెరుగుదలకు కారణమవుతోంది.

అదనపు భవనాలకు అనుమతి..

విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీల రద్దీని దృష్టిలో ఉంచుకుని గతంలోనే జైలు అధికారులు అదనపు భవనాల కోసం జైళ్ల శాఖకు ప్రతిపాదించారు. దీంతో కొన్నాళ్ల క్రితం 500 మంది ఖైదీలకు సరిపడేలా జీ+1 భవన నిర్మాణానికి రూ.26 కోట్లు, మరో 200 మంది ఓపెన్ ఎయిర్ ఖైదీల కోసం ప్రత్యేక భవన నిర్మాణానికి రూ.15 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ రెండు భవనాలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఈ సెంట్రల్ జైలులో ఖైదీల రద్దీ నుంచి కాస్త వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Read More
Next Story