రోడ్డు ప్రమాదాలపై థర్డ్ పార్టీ అడిట్
x

రోడ్డు ప్రమాదాలపై థర్డ్ పార్టీ అడిట్

రహదారులపై ప్రతీ అర కిలోమీటరకూ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టాలని రహదారి భద్రతా కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.


రాష్ట్రంలో ప్రతీ రోడ్డు ప్రమాదంపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రహదారి ప్రమాదానికి కారణం వాహనమా, డ్రైవరా, లేక రోడ్డు ఇంజనీరింగ్ లోపమా అన్న వివిధ అంశాలను గుర్తించేలా ఈ ఆడిటింగ్ జరగాల్సి ఉందని స్పష్టం చేశారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రవాణా శాఖామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, రోడ్ సేఫ్టీ అథారిటీ, రవాణాశాఖ, జాతీయ రహదారులు, పురపాలక తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్ సేఫ్టీ ఏజెన్సీల నియామకం, రాష్ట్ర రహదారి భద్రతా నిధి, రహదారులపై బ్లాక్ స్పాట్లను సరిదిద్దటం, ప్రమాదాలను నివారించేలా క్రాష్ బారియర్లు, డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రతీ మూడు నెలలకు ఓ మారు ఈ అంశాలపై పురోగతిని సమీక్షించుకునేలా రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందటం ఆందోళనకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

అయితే ఇందులో మూడో వంతు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్ల జరిగినవేనని, 53 శాతం మేర ప్రమాదాలు కార్లు, ద్విచక్ర వాహనదారుల సెల్ఫ్ యాక్సిడెంట్లు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రహదారి ప్రమాదాల్లో ఏపీ దేశంలో 8వ స్థానంలో ఉండటంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు, తిరుపతి, పలనాడు, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువ ఉండటంపై కారణాలు ఆరా తీయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వాస్తవానికి ఓవర్ స్పీడ్ కారణంగా 79 శాతం మేర, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా 3 శాతం, మద్యం, మొబైల్ ఫోన్ల కారణంగా 1 శాతం చొప్పున ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జాతీయ రహదారులపై 42 శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటుంటే రాష్ట్ర రహదారుల పై 21 శాతం మేర ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
నిబంధనల మేరకు
అమిత వేగాన్ని నియంత్రించేందుకు వీలుగా ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో స్పీడ్ గవర్నర్లను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే రవాణేతర వాహనాలకూ వీటిని ఏర్పాటు చేసే అంశంపై ఆలోచన చేయాలని పేర్కొన్నారు. వాహనాల వేగాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఇరువైపుల ప్రతీ అర కిలోమీటరు పరిధిని కవర్ చేసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. వీటిని ఆర్టీజీఎస్‌తో అనుసంధానించటంతో పాటు వెహికిల్ ట్రాకింగ్ కోసం ఓ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని రవాణాశాఖకు సూచనలిచ్చారు. హెచ్చరికలు జారీ చేసినా అమిత వేగంగా ప్రయాణించే వాహనాలను సీజ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడు నెలల్లో వేగ నియంత్రణపై చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు కమిటీ మార్గ నిర్దేశాల మేరకు అన్ని చర్యలూ చేపట్టాలని సీఎం సూచనలిచ్చారు. డ్రైవర్ల శిక్షణకు కూడా ఆధునిక డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. దర్శి, ఆదోని డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రోడ్ సైన్లు, రహదారుల పై బ్లాక్ స్పాట్లను సరిచేయటం, పాద చారులకు సదుపాయాలు, మార్కింగ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. జాతీయ రహదారుల పై ఉన్న 680 బ్లాక్ స్పాట్లను సరిదిద్దాలని సీఎం ఆదేశించారు.
స్లీపర్ బస్సుల వాహన పర్మిట్లపై
అనధికారికంగా వాహనాల్లో మార్పు చేర్పులపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బస్ బిల్డింగ్ కోడ్ ప్రకారం అనధికార ఆల్టరేషన్స్ ఉండేందుకు వీల్లేదని అన్నారు. ఈ సమస్యను అధిగమించటానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలన్నారు. అనధికారికంగా మార్చేసిన స్లీపర్ బస్సుల కారణంగా ప్రమాదాల తీవ్రత మరింతగా పెరుగుతోందని అన్నారు. నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించడానికి కారణాలేమిటన్న దానిపై అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా రాష్ట్ర రెవెన్యూ దెబ్బతినకుండా ఏపీలోనూ మార్పు చేర్పులపై ఆలోచన చేయాలని స్పష్టం చేశారు. స్లీపర్ బస్సులు వివిధ రాష్ట్రాల్లో వాహన పర్మిట్లపై కేంద్రానికి లేఖ రాయాలన్నారు. దీనిపై అధికారులు సమాధానం ఇస్తూ ఇప్పటి వరకూ అనధికారికంగా ఆల్టరేషన్ చేసిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిషన్ ఉన్న 134 బస్సులను సీజ్ చేసినట్టు సీఎంకు తెలిపారు. పాఠశాలల బస్సుల్ని కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. రవాణేతర వాహనాల్లో స్పీడ్ గవర్నెన్సు విధానంపై కేంద్రాన్ని సంప్రదిస్తున్నట్టు తెలిపారు. రహదారులపై ప్రమాదాల సమయంలో అత్యంత వేగంగా సమీపంలోని ఆస్పత్రులకు బాధితుల్ని తరలించేందుకు 108 అంబులెన్సులు, జాతీయ రహదారుల అంబులెన్స్ లను ఇంటిగ్రేట్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించే వారిని ప్రోత్సహించేలా చర్యలు ఉండాలన్నారు.
రోడ్ సేఫ్టీ అంశాలపై విస్తృతంగా ప్రచారం
డ్రైవింగ్ నిబంధనల్ని ఉల్లంఘనల కేసుల్లో జరిమానాల కంటే ముందు హెచ్చరికలు జారీ చేయాలని సీఎం సూచించారు. ఐదుసార్ల కంటే ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేసేలా త్వరలోనే కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్టు అధికారులు వివరించారు. ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోండి. ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర రహదారులు, మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ మార్కింగ్ , రోడ్ మార్కింగ్ లను సరిచేయాలని అన్నారు. వాహనాల ఫిట్ నెస్ కోసం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. రీహాబిలిటేషన్ సెంటర్ ను ఏపీలో ఏర్పాటు చేసే అంశం పరిశీలించాలని.. రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ మేరకు పోలీసు, రవాణా, ఇంజనీరింగ్, వైద్యారోగ్యం, ఎక్సైజ్ శాఖలను సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. రోడ్ సేఫ్టీ అంశాలపై విస్తృతంగా ప్రచారం జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు ట్రాఫిక్ సెన్సిటైజ్ చేసేలా సందేశాలు ఇచ్చేలా చూడాలన్నారు. ప్రతీ ఏటా నవంబరు నెలలో 3వ ఆదివారం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని స్పష్టం చేశారు.
Read More
Next Story