చిత్రహింసలకు గురి చేస్తారు..బెయిల్‌ ఇవ్వండి
x

చిత్రహింసలకు గురి చేస్తారు..బెయిల్‌ ఇవ్వండి

హోలోగ్రామ్‌ల తయారీ, సరఫరా కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టును కోరారు ఓ అధికారి.


రాజకీయ కారణాలు, రాజకీయ కక్షలతో నాపై కేసు పెట్టారు. ఇవి తప్పుడు కేసులు. పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేసే అవకాశం ఉంది. చేయని నేరం చేసినట్లు ఒప్పుకోవాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తారు. వీటి నుంచి రక్షించుకునేందుకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలి. అని ఓ అధికారి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మద్యంపై దృష్టి పెట్టింది. గత జగన్‌ ప్రభుత్వ హయాంలో మద్యంలో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందిని ఆరోపించింది. ఆ మేరకు నాడు ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌బీసీఎల్‌) ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డిపై కేసులు బనాయించారు. ఆయన ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. తాజాగా మరో కేసు వెలుగులోకి తెచ్చారు.

గత జగన్‌ ప్రభుత్వ హయాంలో మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హోలోగ్రామ్‌ల తయారీ సరఫరా టెండర్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెరపైకి తెచ్చారు. దీనిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై వాసుదేవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కారణాలతో తనపై తప్పుడు కేసులు బనాయించారని, ఈ కేసులో తనను అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేపడితే.. నేరం ఒప్పుకోవాలనే విధంగా తనపై ఒత్తిడి చేస్తారని ఆ పిటీషన్‌లో కోర్టుకు వివరించారు. అంతేకాకుండా తనను చిత్ర హింసలకు గురి చేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. కోర్టు విధించే షరతులకు తాను ఎట్టి పరిస్థితుల్లో కట్టుబడి ఉంటానని, బెయిల్‌ ఇవ్వాలని పిటీషన్‌లో హైకోర్టుకు వివరించారు.

Read More
Next Story