
వేట కొడవళ్లతో వెంటాడి నరికేశారు
ఈ దాడిలో ఇద్దరు మరణించిగా మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నాడు.
శాంతించిందనుకున్న రాయలసీమ పల్లెలో పగ మళ్ళీ పడగవిప్పింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలు వేటకొడవళ్ల రూపంలో వీరంగం సృష్టించాయి. రెండేళ్లుగా గుండెల్లో దాచుకున్న కసిని ప్రత్యర్థులు ఒక్కసారిగా బయటపెట్టడంతో కర్నూలు జిల్లా కందనాతి గ్రామం రక్తసిక్తమైంది. గ్రామం విడిచి వెళ్ళిన వారు తిరిగి రావడమే తరువాయి.. అదను కోసం వేచి చూసిన శత్రుమూకలు పట్టపగలే వేటాడి.. వెంటాడి ఇద్దరిని బలితీసుకున్నాయి.
వార్త వివరాల్లోకి వెళ్తే..
కర్నలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వర్గపోరు సాగుతోంది. రెండేళ్ల క్రితం జరిగిన ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్న ఒక వర్గం వారు, ప్రత్యర్థుల భయంతో గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే, కాలం గడిచింది కదా అని వారు ఇటీవల తిరిగి గ్రామంలో అడుగుపెట్టారు. కానీ, అవతలి వర్గం తమ పగను గుండెల్లోనే దాచుకుంది. శత్రువుల రాక కోసం 'కాపుకాసిన' ప్రత్యర్థులు, అదను చూసి మృత్యుపాశం విసిరారు.
వేటాడి.. వెంటాడి..
ప్రత్యర్థులు తమ పాత కక్షలను తీర్చుకోవడానికి వేటకొడవళ్లతో పట్టపగలే రంగంలోకి దిగారు. పొలం పనుల్లో ఉన్న పరమేశ్ (35)పై ఒక్కసారిగా దాడి చేసి, ప్రాణాలు తీసే వరకు విచక్షణారహితంగా వేట కొడళ్లతో వేటు వేశారు. మరోవైపు గ్రామంలోనే ఉన్న వెంకటేశ్ (40)ను లక్ష్యంగా చేసుకుని, అందరూ చూస్తుండగానే వేటకొడవళ్లతో దాడి చేసి రక్తపు మడుగులోకి నెట్టారు. ఇదే క్రమంలో పొలం నుంచి వస్తున్న గోవింద్‌పై కూడా దాడి చేశారు. తీవ్ర గాయాలైనప్పటికీ అతను ప్రాణాలతో బయటపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల పహారా
ఒకేసారి ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురవ్వడంతో కందనాతిలో యుద్ధ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న డీఎస్పీ భార్గవి భారీ పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాలను పరిశీలించి, సాక్ష్యాధారాలను సేకరించారు. గ్రామంలో మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనతో కందనాతి గ్రామస్తులు భయం గుప్పెట్లో చిక్కుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
Next Story

