వీరిని కూటమి కలిపింది..
రాజకీయ శత్రువులు ఒకటయ్యారు. వైఎస్ జగన్‌ను ఓడించేందుకు వీరంతా జతకట్టారు వీరిలో. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రలు కాగా ఒకరు వారి కూటమిలో భాగస్వామి.
రాజకీయంగా శాశ్వత శత్రువులు ఉండరంటారు. నిజమేనని ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్‌లు ఒకే వేదికపై కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపుకు ప్రచారం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ను వదిలి బయటకు వచ్చిన తరువాత సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లో విఫలమై బీజేపీలో చేరారు. తాజాగా ఆయన రాజంపేట పార్లమెంట్ బీజెపి అభ్యర్థిగా (ఎన్‌డీఏ కూటమి) రంగంలోకి దిగారు.
ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించే బాధ్యతను చంద్రబాబునాయుడు ఎన్‌డీఏ తరపున భుజానికెత్తుకున్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నా వీరు శాశ్వతంగా శత్రువులు కాదు, అలాగని మిత్రలు కాదు. వీరి బంధం ప్రత్యేకమైంది. మామూలుగా అయితే ఒకరినొకరు కలిసినప్పుడు పలరించుకోవడం, ఎవరి పనుల్లో వారు ఉండటం ఇప్పటి వరకు జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను ఎదుర్కోవడం, ఆయనకు కుడి భుజంగా ఉన్న మిథున్‌రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.
ఒకే వాహనంలో పలకరింపులు..
గురువారం పార్లమెంట్ పరిధిలోని రాజంపేట, రైల్వేకోడూరుల్లో ఒకే వాహనంలో తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్బంగా వాహనంలోపల చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, పవన్ కళ్యాణ్‌లు మాట్లాడుకునేందుకు అవకాశం లభించి. చిరునవ్వులు చిందిస్తూ వారు ఫొటోకు ఫోజులివ్వడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. గతంలో చిన్నా చితకా మనస్పర్థలు రాజకీయంగా ఉన్నా ఈదెబ్బతో అవి పటాపంచలయ్యాయని చెప్పొచ్చు.
గతంలోనూ కిరణ్‌కు సహకరించిన బాబు
కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ సమయంలో కిరణ్‌కుమార్‌రెడ్డికి చంద్రబాబునాయుడు రాజకీయంగా సహకరించి ముఖ్యమంత్రి స్థానాన్ని పదిలం చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం చాలా పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటన వారిద్దరి మధ్య బద్ధ శత్రుత్వం లేదని చెప్పటానికి మచ్చుతునకగా చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసే జగన్‌ను టార్గెట్ చేస్తూ వచ్చారనే టాక్ వచ్చింది. పైగా రాజకీయంగా జగన్‌ను ముప్పుతిప్పలు పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. ఇప్పుడు జగన్ వారికి కొరకరాని కొయ్యగా మారాడు. బలమైన రాజకీయ నేతగా ఎదిగి ఎదురేలేని నాయకుడిగా ఉన్న జగన్‌ను ఎలాగైనా ఢీకొట్టాలనే ఉద్దేశ్యంతో ముగ్గురు నేతలు ఒక్కటయ్యారు.
రెండు సార్లు గెలిచిన వైఎస్సార్‌సీపీ..
రాజంపేట పార్లమెంట్ ఒకప్పుడు కాంగ్రెస్ కొచుకోట. ఇక్కడి నుంచి ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ రెండు సార్లు గెలిచింది. గత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో పివి మిదున్‌రెడ్డి విజయం సాధించారు. 2024లో కూడా మిథున్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నుంచి అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. కూటమి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి రంగంలో ఉన్నారు. హోరాహోరీగా సాగే పోటీలో కిరణ్‌కుమార్‌రెడ్డి భవితవ్యం తేలనుంది. గతంలో బీజేపీ ఒకసారి పోటీ చేసి ఓడిపోయింది. 2014లో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన దగ్గుబాటి పురందేశ్వరికి 1,74,763 ఓట్లు మాత్రమే వచ్చాయి. తిరిగి ఆ వైపుకు మళ్లీ పురందేశ్వరి చూడాలనుకోలేదు.
Next Story