
పోలీసోళ్లు కొట్టి కొట్టి చంపేశారు
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగయ్య మృతి చెందారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మరో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్ రంగన్న మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రంగయ్య కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. రంగన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్‌గా ఉన్నారు. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఆ సమయంలో రంగన్నే వాచ్‌మెన్‌గా ఉన్నారు. దీంతో రంగన్న ఈ హత్య కేసులో సాక్షిగా ఉన్నారు. అయితే వాచ్‌మెన్ రంగయ్య మృతి మీద అతని భార్య తీవ్రంగా స్పందించారు. సంచలన ఆరోపణలు గుప్పించారు.రంగయ్య మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని అతని భార్య సుశీలమ్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసుల వల్లే తన భర్త రంగయ్య ప్రాణాలు పోగొట్టుకున్నారని మండిపడ్డారు. రంగయ్య మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.