అక్కడ ఆగలేదంటారు.. ఇక్కడ ఆగిపోయిందంటారు!
x
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌

అక్కడ ఆగలేదంటారు.. ఇక్కడ ఆగిపోయిందంటారు!

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయిందంటూ కూటమి నేతలు చేస్తున్న ప్రకటనలు ఎవరిని మోసం చేయడానికన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


ఏడాది, రెండేళ్లు కాదు.. దాదాపు నాలుగున్నరేళ్ల నుంచి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఉక్కు కార్మికులు, ప్రజా సంఘాలు, కూటమి మినహా ఇతర రాజకీయ పార్టీలు నిరసనలు చేపడుతున్నాయి. ఎన్నికల ముందు కూటమి నేతలు ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సభలూ సమావేశాల్లో పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ జరగనీయబోమని ఉపన్యాసాలు దంచారు. కూటమి అధికారంలోకి వచ్చాక వీరు కుంటిసాకులు వెతుకుతున్నారు. లాజిక్కులు మాట్లాడుతున్నారు. పైగా రాష్ట్రంలో కూటమి పాలనా పగ్గాలు చేపట్టాక కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు/కార్మికులను తొలగించడం, ప్లాంట్‌లో కీలకమైన విభాగాలను ప్రైవేటుకు అప్పగించడం వంటి దూకుడు చర్యలు చేపట్టింది. ఇంత జరుగుతున్నా అది ప్రైవేటీకరణలోకి రాదంటూ కూటమి నేతలు బుకాయిస్తున్నారు. జనవరిలో కేంద్రం రూ.11,440 కోట్ల రివైవల్‌ ప్యాకేజీ ఇవ్వడమే ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు. ఆ సొమ్ముతోనే ప్రైవేటీకరణ ఆగిపోయినట్టుగా హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత కూటమి నేతలు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకున్నామని ఎవరికి వారే ప్రకటించుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే ఉక్కు ప్రైవేటీకరణ ఆగిందని ఆయన తనయుడు, మంత్రులు పదేపదే వల్లె వేస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, ఆయన ఎమ్మెల్యేలు తమ వల్లే ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు. బీజేపీ నేతలు కూడా ప్రైవేటీకరణకు బ్రేకులు వేశామని చెబుతున్నారు.

ప్రైవేటీకరణ ఆగినట్టు ప్రధాని ఎందుకు చెప్పలేదు?
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. కానీ ఇంతటి కీలకమైన విషయం ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు వెల్లడి చేయడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. జూన్‌ 21న ప్రధాని అంతర్జాతీయ యోగా డే వేడుకలకు విశాఖ వచ్చినప్పుడు రైర్వే జోన్‌ ఇచ్చామని ప్రకటించారే తప్ప స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిలిపి వేస్తున్నట్టు ఒక్క మాటా మాట్లాడలేదు. అదే నిజమైతే ఆ క్రెడిట్‌ను తన ఖాతాలోనే వేసుకునే వారన్న వాదనలున్నాయి. ఇటీవల స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక నాయకుడు పాడి త్రినాథరావు రాసిన లేఖకు అండర్‌ శక్రటరీ అజయ్‌ నాగ్‌పాల్‌.. కేబినెట్‌ కమిటీ ఆన్‌ ఎకడమిక్‌ ఎఫైర్స్‌ నిర్ణయం ప్రకారం విశాఖ ఉక్కును నూరు శాతం డిజిన్వెస్ట్‌మెంట్‌ చేస్తామని లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతేకాదు.. కొద్దిరోజుల క్రితం వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా కూటమి నేతలు ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయిందంటూ అడ్డంగా బుకాయిస్తున్నారు.
ఇదీ పవన్‌ కల్యాణ్‌ లాజిక్‌..
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయిందనడానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ చెప్పిన లాజిక్‌ వింటే ఆశ్చర్యం కలుగుతుది. మూడు రోజుల క్రితం విశాఖలో సేనతో సేనాని కార్యక్రమంలో ఆ పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడుతూ..‘ఈ దేశంలో ఎవరైనా అమిత్‌షాతో గొడవ పెట్టుకుంటారా? ఆయనతో ఎవరూ ఎదురుగా అభిప్రాయం చెప్పలేరు. ఆయన భయ పెడతారని, బెదిరిస్తారని కాదు. ఆయనడిగే లాజికల్‌ ప్రశ్నలకు వీళ్ల దగ్గర సమాధానం ఉండదు. నేషనల్‌ లీడర్‌షిప్‌ ఎప్పుడూ చాలా క్లియర్‌గా ఉంటుంది గుర్తు పెట్టుకోండి. వారి దగ్గర సమాధానం ఉంది. స్టీల్‌ ప్లాంట్‌కు ఇంత నష్టం వస్తుందని. నష్టం వస్తే ఎన్నాళ్లు భరిస్తాం అంటారు. అమిత్‌షాను కలిసినప్పుడు నేనేమన్నానంటే? విశాఖ ఉక్కు భావోద్వేగాలతో వచ్చింది. గుడ్డిగా చేసేయమని చెప్పం. కుదిరితే సొంత గనులు కేటాయించి ఒడిశా నుంచి ముడిసరకు తరలింపునకు పైప్‌లైన్‌ వేయండని చెప్పాం. ఆయన చాలా కీన్‌గా విన్నారు. ఎస్‌ చెప్పలేదు. నో చెప్పలేదు. విల్‌ లుక్‌ ఇన్‌ టూ ఇట్‌.. అన్నారు. అప్పట్నుంచి ప్రైవేటీకరణ ముందుకెళ్లలేదు’ అని చెప్పారు. ఆయన ఎస్‌ అనలేదు.. నో అనలేదు.. అంటే.. ప్రైవేటీకరణ ఆగినట్టేనన్న నిర్ధారణకొచ్చేశారన్న మాట!

వీవీ రమణమూర్తి

కేంద్రం తీర్మానం చేస్తేనే ప్రైవేటీకరణ ఆగినట్టు..
‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయినట్టు కూటమి నేతలు చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలే. 2021లో విశాఖ ఉక్కులో నూరు శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్టు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నామని కేంద్రం ప్రకటిస్తేనే నమ్మాలి. ప్లాంట్‌కు రోజుకు ఎనిమిది రేక్‌ల ముడిసరకు సరఫరా కావలసి ఉండగా నాలుగే వస్తున్నాయి. తగినంత ముడిసరకు లేకుండా పూర్తిస్థాయి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుంది? ఇలా నష్టాల్లోకి తెచ్చేసి ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలన్నది కేంద్రం లక్ష్యం. వాస్తవాలు ఇలా ఉంటే కూటమి నేతలు ప్రైవేటీకరణ ఆగిందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపకుంటే కూటమి నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు’ అని సీనియర్‌ జర్నలిస్టు, రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వీవీ రమణమూర్తి ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకే..
‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిందంటూ కూటమి నేతలు అవాస్తవాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై వేగాన్ని మరింత పెంచింది. దానికి రాష్ట్రంలోని కూటమి నేతలు సై అంటున్నారు. గడచిన నాలుగున్నరేళ్లుగా కేంద్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టే స్పష్టం చేస్తోంది. తాజాగా ప్లాంట్‌లో 34 విభాగాలను ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. అది అమలైతే మరింత మంది కార్మికులను తొలగిస్తారు. జనవరిలో ఇచ్చిన రూ.11,440 కోట్ల ప్యాకేజీతో ప్లాంటును కాపాడామని కూటమి పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ సొమ్ములో ముడిసరకుకు గాని, ఎక్విప్‌మెంట్‌కు గాని ఒక్క రూపాయీ ఖర్చు చేయకుండా బ్యాంకు అప్పులు, జీఎస్టీ బకాయిలు చెల్లించారు. ఉక్కు ప్రైవేటీకరణ ఆగేదాకా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం’ అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నరసింగరావు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధికి తెలిపారు.
Read More
Next Story