అమరావతి పనుల్లో ఆలస్యం అన్నారో... ఇకంతే...
x

అమరావతి పనుల్లో ఆలస్యం అన్నారో... ఇకంతే...

ఎవరైనా అమరావతి పనుల్లో ఆలస్యం జరుగుతుందని అంటే వాళ్లకు చీవాట్లు తప్పవు. ఈ విషయం మంత్రి నారాయణ స్పష్టం చేశారు.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, నిర్వాహక వైఫల్యాలపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పటి వరకు ఇటువంటి పరిణామాలు జరగలేదు. సాధారణంగా కాంట్రాక్టర్లతో జరిగే సమావేశాల్లో ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా అమరావతి నిర్మాణం జరగాలని చెబుతూ వస్తున్నారు. కాంట్రాక్టర్లు, వారి సిబ్బందికి అవసరమైన క్వార్టర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రాయపూడి వద్ద నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజి కావాల్సిన క్వార్టర్లు ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికే వారు పనులు మొదలు పెట్టారు.


అమరావతి నిర్మాణంలో కీలకమైన ఐదు ఐకానిక్ టవర్లు, హైకోర్టు భవన నిర్మాణాల ర్యాఫ్ట్ ఫౌండేషన్ల పరిస్థితిని పరిశీలించిన సందర్భంలో ఒక కాంట్రాక్ట్ సంస్థ అధికారిపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "పనిచేయడం చేతగాని యూజ్‌లెస్ ఫెలో, దూరంగా వెళ్లిపో" అంటూ ఆ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్లాబ్ వేయాలంటే వచ్చేనెల 25 తేదీ వరకు పడుతుందని ఆ అధికారి చెప్పటంతో మంత్రికి ఆగ్రహం తెప్పించింది. పనుల్లో వేగం కావాలని కోరుతున్న సమయంలో ఆ అధికారి మాటలు మంత్రిని ఇరిటేట్ చేశాయి. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాజెక్టు విధ్వంసమైన నేపథ్యంలో, న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుంటూ, ఫిబ్రవరి రెండో వారం నుంచి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని, చెప్పిన పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆయన హెచ్చరించారు.

మంత్రి నారాయణ అమరావతిలో అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పనులు చేయడంలో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలే కాని ఆలస్యమవుతుందచెబితే సహించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని మంత్రి ఆగ్రహం వెనుక అదే కారణమని చెప్పొచ్చు.

మంత్రి నారాయణ నిరంతరం అమరావతి పనుల విషయంలో పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు పనులు వేగం పుంజుకోవాలని చూస్తున్నారు. రోడ్ల నిర్మాణ పనులు, కాలువల పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే నిర్మించిన భవనాల పనులు ముందుకు సాగుతున్నాయి. కొన్ని నివాస భవనాల పనులు త్వలోనే పూర్తవుతాయని మంత్రి చెప్పారు.

సీఆర్డీఏ పరిపాలనా భావనాన్ని ఆగస్ట్ 15న ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు జరిగాయి. ఈ భవనం ఇప్పటికే పూర్తయింది. భవిష్యత్ లో అమరావతి అభివృద్ధి సంస్థ కార్యాలయం ద్వారానే అన్ని కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంది. ఈ భవనంలోకి ప్రస్తుతం ఫర్నీచర్ చేరిస్తే అన్ని హంగులు ఏర్పడినట్లే.

Read More
Next Story