
విశాఖలో రూ.1కి భూమి ఇస్తామంటే వ్యతిరేకించారు..కానీ
ఏపీలో పరిశ్రమలు, ఉద్యోగాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
విశాఖలో రూ.1కి భూమి ఇస్తామంటే వ్యతిరేకించారని, ఏడాదిలోనే టాప్ కంపెనీలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాజిస్టిక్స్, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై ప్రసంగించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు తగ్గిపోయాయని విమర్శిస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు
ఏవియేషన్, ఏరో స్పేస్ రంగాల్లో కొత్త యూనివర్సిటీలు
ఏవియేషన్ రంగంలో విశాఖలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని తెలిపారు. అలాగే, ఏరో స్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎనర్జీ, అగ్రో ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, లైఫ్ సైన్సెస్ తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని చెప్పారు. ఆటోమొబైల్ రంగంలో కియా మోటార్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏపీలో ఉత్పత్తి చేస్తున్నాయని, 2014–19 మధ్య కియా కార్ల ఉత్పత్తితో పాటు మోడల్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. ఇసుజు, హీరో మోటార్స్ లాంటి సంస్థలు కూడా తమ హయాంలోనే ఏపీకి వచ్చాయని ఆయన అన్నారు.
పెట్టుబడులు పెట్టాక రాష్ట్ర ప్రాజెక్టుగా భావించి త్వరిత అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. వికసిత్ భారత్‌లో భాగంగా స్వర్ణాంధ్ర లక్ష్యంగా విజన్ రూపొందించామని, 2.4 ట్రిలియన్ ఎకానమీ, 450 బిలియన్ ఎగుమతులు, తలసరి ఆదాయం లక్ష్యాలు పెట్టుకున్నామని చెప్పారు. 100% అక్షరాస్యత, 95% నైపుణ్యం కలిగిన మానవ వనరుల సాధనకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన అన్నారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్నామని, పరిశ్రమలకు నీటి భద్రతపై దృష్టి పెట్టామని తెలిపారు. ప్రొడక్ట్ పర్ఫెక్షన్ నుంచి సర్క్యులర్ ఎకానమీ వరకు దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
పెట్టుబడులు..కంపెనీలు
గూగుల్ డేటా సెంటర్‌ను 6 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేస్తోందని, టీసీఎస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి సంస్థలు వస్తున్నాయని సీఎం తెలిపారు. విశాఖను పోర్టు సిటీ, స్టీల్ సిటీ నుంచి నాలెడ్జ్ ఎకానమీ సిటీగా మారుస్తున్నామని చెప్పారు. ఎకనామిక్ కారిడార్లు, పారిశ్రామిక క్లస్టర్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని, విశాఖ, అమరావతి, తిరుపతిలో ఆయా రంగాల పెట్టుబడులు రాబోతున్నాయని ఆయన అన్నారు.
ఏడాదిలోనే గత ప్రభుత్వం సాధించిన దానికంటే మూడు రెట్లు పెట్టుబడులు సాధించామని, 125 ప్రాజెక్టుల్లో రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్, భారత్ పెట్రోలియం, ఎల్జీ, ఐబీఎం, టీసీఎస్, గూగుల్, ఎన్టీపీసీ, రిలయన్స్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని సీఎం వెల్లడించారు.
Next Story