TRAGEDY | పుష్ప-2 హీరో, దర్శక నిర్మాతలపై విమర్శల వెల్లువ!
x

TRAGEDY | పుష్ప-2 హీరో, దర్శక నిర్మాతలపై విమర్శల వెల్లువ!

పుష్ప-2 సినిమా హాలు వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు చనిపోతే హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కి అసలు పట్టదా అంటూ నెటిజన్లు ఊగిపోతున్నారు..


హైదరాబాద్ సంధ్య థియేటర్ లో పుష్ప-2 సినిమా చూడడానికి వచ్చినపుడు జరిగిన తొక్కిసలాటలో మరణించిన కుటుంబంపై ఆ చిత్రం యూనిట్ బాధ్యులు కనీసం జాలి చూపాల్సిన పని లేదా అని నెటిజన్లు విరుచుకుపడ్డారు. ప్రత్యేకించి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కనీస బాధ్యత కూడా మరిచారని, సెలబ్రిటీలు ఇలా ఉంటారా? విమర్శలకు దిగారు.
హైదరాబాద్‌ సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన తోపులాటలో ఓ తల్లి, కుమారుడు చనిపోయారు. సంధ్య థియేటర్‌ వద్దకు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వచ్చిన చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయడంతో రేవతి(35) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ(9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఆసుపత్రి చికిత్సలో పొందుతూ తల్లి, కుమారుడు మృతిచెందారు.
ఈ దుర్ఘటనపై హీరో అల్లు అర్జున్ గాని పుష్ప-2 చిత్ర దర్శక నిర్మాతలు గాని స్పందించలేదంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. సినిమాలలో హీరోలు తప్ప బయట ప్రపంచం పట్టదా అనే వాళ్లు కొందరైతే వీళ్లకు కొంచెం కూడా సామాజిక బాధ్యత లేదంటూ మరికొందరు విమర్శించారు.
వీటన్నింటి సారాంశం ఇలా ఉంది..
'కొంచెం సామాజిక బాధ్యత ఉండాలి సెలబ్రిటీలకు... మీ క్రేజ్ కోసం ప్రమోషన్ల పేరిట హడావిడి చేసి హైప్ తీసుకు వస్తారు. ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టారు కాబట్టి ప్రమోషన్లు చేయాలి. గతంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీ హిట్స్ తెచ్చిన పెద్ద ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ లాంటివాళ్ళు ఎప్పుడు ప్రమోషన్లు చేసి ప్రేక్షకుల ఎమోషన్స్ తో ఆడుకోలేదు. ఇంత క్రేజ్ ఉన్నప్పుడు మొదటి రోజు ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమా చూస్తే వచ్చే మజా కోసం ఇప్పుడున్న యంగ్ హీరోలు వస్తున్నారు. మీకు అది ఒక మజా, మీ సంతోషమే మీకు ముఖ్యం. మీరు రావడం వలన అక్కడ సరైన భద్రత లేకపోతే గందరగోళం జరిగి ఇటువంటి తొక్కిసలాటలే జరుగుతాయి. ఇందుకు మీరు కనీస బాధ్యత కూడా వహించరు అని విజయవాడకు చెందిన గడ్డం కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమా కోసం పెద్దఎత్తున ప్రచారం చేసి హైప్ క్రియేట్ చేసి రెండు ప్రాణాలు బలితీసుకున్నందుకు మీపై క్రిమినల్ కేసు పెట్టాలంటూ ఇంకో నెటిజన్ తన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. 'ఇవాళ నిండు ప్రాణాలు బలి అయ్యాయి. ఆ చిన్న పిల్లోడి వీడియో చూస్తే నిజంగా చాలా బాధేసింది. కాస్త సామాజిక బాధ్యత, స్పృహ అనేది నేర్చుకోవాలి ఇప్పటి యంగ్ హీరోలు. ఈ హీరో, ఆ హీరో అని కాదు అందరి గురించి.. ఇకనుంచి ఇటువంటి పనులు చేయరు అనుకుంటున్నాను' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలు, చిన్నపిల్లలు ఇలా జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండటం ఉత్తమమని ఇంకోకరు సలహా ఇచ్చారు. పుష్ప-2 తొక్కిసలాటలో ఒక తల్లి, చిన్నారి కన్నుమూశారు. వారికి సంతాపం, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ సోషల్ మీడియాలో సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాన్ని తప్పుబట్టిన వారూ లేకపోలేదు. తొలిరోజే సినిమా చూడకపోతే వచ్చే నష్టమేమిటన్నది ఇటువంటి వారి ప్రశ్న కాగా అందుకు ఘాటుగా స్పందించిన వారూ లేకపోలేదు. "ఆ కుటుంబం 99% గోదావరి జిల్లాలది అయ్యుండొచ్చు. మాకు కంచంలో చేప ముక్క, జేబీలో టికెట్ ముక్క లేకపోతే ఆ రోజంతా వెలితే. గోదారోళ్లకున్న అనేకానేక మోజుల్లో… మొదటి రోజున మొదట ఆట చూడడం అనేదొకటి. అందులో ఉండే thrill వేరు. తొలి రోజు తొలాట కోసం ticket counter ల ముందు క్యూ కట్టడం, పోలీసులు కటకటాల్ని తాకించినట్టుగా ఆగర్రు (మోకాలి దిగువన మడమకు పైన ఉండే ఎముక)ను లాఠీతో కొట్టుకుంటూ వెళ్లడం… అంత బాధలోనూ టికెట్ సాధించి తొలాట (first screening) చూసి కేరింతలు కొట్టడం… మా గోదారోళ్లకే సొంతం. ఆ కుటుంబాన్ని తప్పుబట్టకండి. వారి సినీ ప్రేమను గౌరవించి ఒక కన్నీటి చుక్క రాల్చండి. మేమంతే, సినిమా పిచ్చోళ్లం!" అని రాజమండ్రికి చెందిన మణిభూషణం తన ఫేస్ బుక్ లో పెట్టారు.
ఈ సినిమా దర్శక నిర్మాతలు, హీరోపై క్రిమినల్ కేసు పెట్టాలని పీడీఎస్ యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఈ చావులకు వాళ్లే కారణం అని ఆరోపిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
Read More
Next Story