
బంగ్లాదేశ్ ‘వల’లో పడ్డ తెలుగు జాలర్లు... ఎందుకలా జరుగుతుంది?
చేపలవేటకు వెళ్తున్న జాలర్లు సముద్రంలో హద్దులు దాటడంతో పొరుగు దేశాల రక్షణ సిబ్బందికి చిక్కి జైలు పాలవడం పరిపాటిగా మారింది.
మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వందల కిలోమీటర్ల దూరం బోట్లలో వెళ్తారు. చేపల లభ్యత దొరికే వరకు అలా వేటాడుకుంటూ మరబోట్లలో ముందుకు వెళ్తుంటారు. అలా ఒక్కోసారి మనదేశ పరిధిలోని సముద్ర జలాల సరిహద్దులను కూడా అధిగమించి పొరుగుదేశ జలాల్లోకి ప్రవేశిస్తుంటారు. దీంతో నిత్యం కాపలా ఉండే ఆ దేశ కోస్టు గార్డు, మెరైన్ పోలీసులకు చిక్కుతుంటారు. ఒక్కసారి వారికి పట్టుబడితే ఆయా దేశాల చట్టాల ప్రకారం అక్రమ చొరబాటుదార్లుగా భావించి వారిని జైలులో పెడ్తారు. ఏళ్ల తరబడి పట్టుబడ్డ జాలర్లు ఆ జైళ్లలోనే మగ్గుతుంటారు. కొన్నేళ్లుగా సముద్ర జలాల్లో చేపలవేటకు వెళ్లే జాలర్లు పట్టుబడడం, కొన్నేళ్లు అక్కడ జైళ్లలో శిక్ష అనుభవించడం, మరోపక్క కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ దేశంతో సంప్రదింపులు జరిపాక విడుదల చేయడం పరిపాటిగా మారింది. అలాగే ఇతర దేశాల జాలర్లు మన దేశ సముద్ర జల్లాల్లోకి ప్రవేశించినా ఇదే పరిస్థితి.
బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డుకు చిక్కిన 8 మంది మత్స్యకారులు..
ఈనెల 13న విశాఖలోని వడ్డాది సత్యనారాయణకు చెందిన ఇండ్–ఏపీ–వీ5–ఎంఎం–735 నంబరు మెకనైజ్డ్ బోటులో ఎనిమిది మంది మత్స్యకారులు చేపలవేటకు వెళ్లారు. వీరు పశ్చిమ బెంగాల్ సముద్ర జలాల్లో చేపలు వేటాడుతూ తమ బోటును బుధవారం ఉదయం దిఘా సమీపంలో లంగరు వేశారు. పెద్ద ఎత్తున వీస్తున్న ఈదురుగాలులు, ఎగసి పడే కెరటాల ప్రభావంతో వీరి బోటు బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయింది. దీంతో బోటును సీజ్ చేశారని, వీరిని బంగ్లాదేశ్ మెరైన్ పోలీసులు పట్టుకుని బంగ్లా జైలులో పెట్టారని బోటు యజమాని వడ్డాది సత్యనారాయణ చెప్పారు. కాగా. వీరితో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో ఐదారు బోట్లలో వెళ్లిన 104 మంది మత్స్యకారులు కూడా బంగ్లా మెరైన్ పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖ నుంచి బోటులో వెళ్లిన వారిలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజుపాలేనికి చెందిన మరుపిల్లి చిన్న అప్పన్న, మరుపిల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపిల్లి ప్రవీణ్, సూరపత్తి రాము, మరుపిల్లి చిన్న అప్పన్న, పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన నక్కా రమణ, వాసుపల్లి సీతయ్యలు ఉన్నారు. వీరు బంగ్లా మెరైన్ పోలీసులకు చిక్కిన విషయం తెలియడంతో ఆయా మత్స్యకారుల కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. సత్వరమే తమ వారిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
చేపల లభ్యతే చూసుకుంటారు..
సాధారణంగా సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు చేపల లభ్యతనే లక్ష్యంగా పెట్టుకుంటారు. అంతే తప్ప తాము సముద్ర జలాల సరిహద్దులను ఉల్లంఘిస్తున్నామన్న సంగతిని అంతగా పట్టించుకోరు. ఆ క్రమంలో వారు సరిహద్దులను అతిక్రమిస్తూ పొరుగు దేశాల రక్షణ సిబ్బందికి దొరికిపోతుంటారు. అలాగే ఒక్కోసారి సముద్ర సరిహద్దులను సరిగా గుర్తించకుండా ముందుకు వెళ్లినప్పుడు కూడా పట్టుబడుతుంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల సరిహద్దుల్లోని సముద్ర జలాల్లో చేపల ఎక్కువగా లభించే ప్రాంతాల్లో చేపలవేట ముమ్మరంగా సాగిస్తుంటారు. ఆ సమయంలో వీరు పొరపాటున వారి సాగర జలాల్లోకి చొరబడి ఆ దేశ జైళ్ల పాలవుతుంటారు.
ఏపీ తీరంలో చేపల లభ్యత లేకే..
‘కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ తీరంలో చేపల లభ్యత ఆశాజనకంగా లేకపోవడంతో ఉత్తరాంధ్ర మత్స్యకారులు గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు. పశ్చిమ బెంగాల్ సముద్ర జలాలు లోతుగా ఉండడంతో పాటు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అక్కడ చేపలు బాగా దొరుకుతాయి.
జానకీరామ్
ఆ ప్రాంతంలో ధర ఎక్కువగా పలికే ట్యూనాలు, షార్కులు, టేకు వంటి చేపలు లభ్యమవుతాయి. దీంతో విశాఖ ప్రాంతం నుంచి దాదాపు 1500 కి.మీల దూరం ఉన్న ఆ ప్రాంతానికి బోట్లలో వెళ్తారు. అక్కడ 15-20 రోజులు వేట సాగిస్తే సగటున ఒక బోటుకు 10 టన్నుల చేపలు పడతాయి. రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అక్టోబర్-ఫిబ్రవరి మధ్య వచ్చే ఆదాయంతోనే ఏడాదంతా గడుపుతారు. దీంతో లోతు సముద్రంలో వేట ప్రమాదకరమని తెలిసినా ఆదాయన్నిచ్చే చేపలవేటకు వెళ్తుంటారు. ఇలా ఒక్కోసారి తెలిసో తెలియకో సరిహద్దు దాటి బంగ్లా మెరైన్ పోలీసులకు చిక్కుతున్నారు' అని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసుపల్లి జానకీ రామ్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు..
గతంలోనూ ఉత్తరాంధ్ర జాలర్లు బంగ్లాదేశ్ మెరైన్ పోలీసులకు చిక్కిన ఘటనలున్నాయి. 2019లో బంగ్లా సముద్ర జలాల్లోకి పొరపాటున చొరబడ్డ 63 మంది భారత జాలర్లు బంగ్లా మెరైన్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో ఎనిమిది మంది విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన వారున్నారు. ఐదు నెలలు జైలులో గడిపిన తర్వాత అక్కడి కోర్టు ఆదేశాలతో వీరు విడుదలయ్యారు. ‘అప్పట్లో పట్టుబడిన మత్స్యకారుల విడుదల కోసం తాను మూడు పర్యాయాలు బంగ్లాదేశ్‌కు Ðð ళ్లి మూడు నెలల పాటు అక్కడే ఉన్నాను. అప్పటి విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ చొరవ, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మత్స్యకారుల విడుదలకు మార్గం సుగమం అయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ మెరైన్ పోలీసులకు పట్టుబడిన వారిని సత్వరమే విడుదల చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి’ అని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసుపల్లి జానకీరామ్ చెప్పారు.
2020లో పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన ఉత్తరాంధ్ర మత్స్యకారులు
పాకిస్తాన్‌కూ పట్టుబడ్డారు..
ఇక పాకిస్తాన్‌కు కూడా మన మత్స్యకారులు తరచూ పట్టుబడుతున్నారు. 2018 నవంబరు 22న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 23 మంది మత్స్యకారులు పాకిస్తాన్ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీకి చిక్కారు. వీరు గుజరాత్‌లోని వీరావల్ ప్రాంతం నుంచి బోట్లలో చేపలవేటకు బయల్దేరారు. పొరపాటున పాక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించడంతో ఆ దేశ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులకు పట్టుబడ్డారు. అనంతరం వీరిని పాక్‌లోని కరాచీ జైలులో పెట్టారు. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో రెండేళ్ల తర్వాత 2020 జనవరి 6న వీరిలో 22 మంది విడుదలయ్యారు. మూడేళ్ల అనంతరం మరో ముగ్గురిని 2023 మే 18న విడుదల చేశారు. వీరికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించింది.

