లయోలా కళాశాల గేటు తాళాలు పగులగొట్టి వాకింగ్ చేశారు..ఏమి జరిగిందంటే?
విజయవాడ లయోలా కళాశాల వద్ద వాకర్స్ నిరసన తెలిపారు. అనంతరం గేట్లకు ఉన్న తాళాలు పగలకొట్టి లోపలికి వెళ్లి వాకింగ్ చేశారు.
విజయవాడ లయోలా కళాశాల వద్ద ఆదివారం ఉదయం యుద్ద వాతావరణం నెలకొంది. వాకింగ్ చేసుకునేందుకు వాకర్స్‌ను లోపలకు అనుమతించ లేదు. కళాశాల యాజమాన్యం గేట్లకు తాళాలేసి మూసేసింది. దీంతో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గేట్ల ముందు ఆదివారం నిరసన చేపట్టారు. కళాశాల మైదానంలోకి వాకర్స్‌ను అనుమంతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గేటు ముందు బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. కళాశాల యాజమాన్యం ఎంతకీ గేట్లు తెరవక పోడంతో వాకర్సే గేట్లకు వేసున్న తాళాలను పగులగొట్టారు. అనంతరం మైదానంలోకి వెళ్లి వాకింగ్ చేశారు.
ఎప్పటి నుంచో మైదానంలో వాకింగ్
గత 25 సంవత్సరాల నుంచి నగరవాసులు లయోలా కాలేజీ వాకర్స్ పేరుతో కళాశాల మైదానంలో వాకింగ్ చేస్తున్నారు. దాదాపు మూడు వేల మంది సభ్యులతో వాకర్స్ అసోసియేషన్ ఉంది. అయితే కొవిడ్ సమయంలో కళాశాల యాజమాన్యం వాకింగ్ ట్రాక్‌ను మూసివేసింది. అప్పటి నుంచి వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్‌ను తిరిగి తెరవాలంటూ వాకర్స్ అసోసియేషన్ కళాశాల యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంది. అయితే యాజమాన్యం మాత్రం దీనిని పట్టించుకోలేదు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లభించ లేదు. సమస్య పరిష్కారం కాలేదు.
ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్‌లకు మాత్రమే..
కొద్ది రోజుల తర్వాత దీనిని ఓపెన్ చేసిన కళాశాల యాజమాన్యం కేవలం ఐఏఎస్‌లు, ఐపీఎస్ అధికారులు మాత్రమే వాకింగ్ చేసుకునే విధంగా లయోలా కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకుంటూ అనుమతి ఇచ్చింది. అయితే దీనిపై పట్టు వీడని వాకర్స్ ఎన్నికల సమయంలో నేతల దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాకింగ్ ట్రాక్ తెరిపిస్తామని నేతలు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నేటికీ నెరవేరక పోవడంతో వాకర్స్ నిరసనలకు దిగారు.
వాకింగ్ ట్రాక్ తెరవాలంటూ కళాశాల ముందు కొద్ది సేపు ధర్నా చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కళాశాల యాజమాన్యం వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఉదయపు నడకకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గేట్లకు ఉన్న తాళాలు పగలకొట్టి లోపలికి వెళ్లి వాకింగ్ చేశారు.
Next Story