
విశాఖ బీచ్‌లో అయోధ్య రాముడి నమూనా ఆలయం
అయోధ్య రాముడిని అమ్మేస్తున్నారు!
విశాఖ తీరంలో ఏర్పాటు చేసిన ఆయోధ్య బాలరాముడి నమూనా ఆలయం చిక్కుల్లో పడింది.
భక్తుల బలహీనతను, భక్తి భావాన్ని క్యాష్ చేసుకునే వారెందరో ఉంటారు. అలా గురి చూసి.. భక్తి బాణం వేసి అందిన కాడికి దోచుకుంటారు. ఇప్పుడు విశాఖ సాగరతీరంలో ఏర్పాటు చేసిన అయోధ్య రాముడి ఆలయ నమూనా నిర్వాహకులు అలాంటి వ్యాపారమే చేస్తున్నారు. అత్యాసకు పోవడంతో వ్యవహారం బెడిసి కొట్టి చిక్కుల్లో పడ్డారు. అసలేం జరిగిందంటే?
విశాఖ బీచ్‌లో అయోధ్య రాముడి నమూనా ఆలయం
ఇటీవల కాలంలో అయోధ్యకు, అయోధ్య రాముడికి చెప్పలేనంత ప్రాముఖ్యత పెరిగింది. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్టతో అది మరింత ఎగబాకింది. అయోధ్యకు వెళ్లి రామ మందిరాన్ని, అందులోని బాల రాముడిని దర్శించుకునే వారి సంఖ్య కూడా అధికమైంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది అయోధ్య రామ మందిరాన్ని పోలిన నమూనా ఆలయాన్ని (రెప్లికాని) ఏర్పాటు చేస్తున్నారు. అందులో రాముడిని ప్రతిష్టిస్తున్నారు. కొందరు ఆ రెప్లికాల్లోకి ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తుండగా, మరికొందరు టిక్కెట్టు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన కుంభమేళా సందర్భంగా గరుడ గ్రూప్ ప్రయాగరాజ్‌లో బాల రాముడితో కూడిన అయోధ్య నమూనా మందిరాన్ని ఏర్పాటు చేశారు. దానికి భక్తుల నుంచి అనూహ్య ఆదరణ వచ్చింది. దీంతో ఇదేదో బాగుందే! అనుకుని అలాంటి అయోధ్య రాముడి ఆలయ నమూనాను విశాఖ సాగరతీరంలో ఏర్పాటుకు సంకల్పించారు. ఆర్కే బీచ్ రోడ్డులోని పాం బీచ్ హోటల్ వెనక ఉన్న ఖాళీ స్థలంలో 91 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేశారు. అందులో బాల రాముడిని ప్రతిష్టించారు. మే 22 నుంచి ఈ నమూనా ఆలయంలోకి ప్రవేశం కల్పించారు. ఒక్కొక్కరికి రూ.50 టిక్కెట్టు ధర నిర్ణయించారు. విశాఖలో అయోధ్య రామ మందిరం, అందులో బాల రాముడి దర్శనం.. అంటూ మీడియాలోను, సోషల్ మీడియాలోనూ నిర్వాహకులు ఊదరగొట్టారు. ఆ ప్రచారంతో ఈ రామమందిరం నిత్యం వేలాది మందితో కిక్కిరిసి పోతోంది. రాముడి దర్శనానికి గంటల సమయం పడుతోంది. ఇది నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో అయితే రామ మందిరానికి చూడటానికి వచ్చే వారితో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోతోంది. ట్రాఫిక్‌ను క్రమబద్థీకరించడానికి పోలీసులకు తల ప్రాణం తోకకు వస్తోంది.
భద్రాచలం దేవస్థానం విశాఖ పోలీసులకు పంపిన ఫిర్యాదు
సీతారామ కల్యాణం పేరిట దోపిడీ యత్నం!
అనూహ్యంగా వచ్చి పడుతున్న ఆదాయంతో నిర్వాహకుల మదిలో సరికొత్త దోపిడి ఆలోచన పుట్టింది. ఈనెల 29న ఈ నమూనా ఆలయంలో సీతారాముల కల్యాణం జరిపించాలని, కల్యాణంలో కూర్చునే దంపతులకు రూ.2,999 టిక్కెట్టు ధర నిర్ణయించారు. ఈ కల్యాణాన్ని భద్రాచలం దేవస్థానం ఆస్థాన పండితులు జరిపిస్తారని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. కల్యాణ టిక్కెట్లు పొందదలచుకున్న వారు సంప్రదించాల్సిన వారి ఫోన్ నంబర్లను కూడా అందులో పేర్కొన్నారు.
అయోధ్య రాముని కల్యాణంపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
భద్రాచలం దేవస్థానం సీరియస్..
విశాఖ నమూనా అయోధ్య రామమందిరంలో సీతారాముల కల్యాణాన్ని భద్రాచలం దేవస్థానం పండితులు జరిపిస్తారన్న విషయాన్ని తెలుసుకున్న భద్రాచలం దేవస్థానం సీరియస్ అయింది. ‘విశాఖలో అట్టి కల్యాణం జరిపించుటకు భద్రాచలం ఆలయం ఆస్థాన పండితులు వస్తున్నట్టు, టిక్కెట్టు ధర రూ.2,999 కలదని నిర్వాహకులు సామాజిక మాధ్యమాల నందు వీడియో పోస్టు చేయుట జరిగింది. కానీ వారు నిర్వహించే కల్యాణానికి గాను మా దేవస్థానానికి సమాచారం లేదు. సంబంధం లేదు. ఈ దేవస్థానం నుంచి ఆస్థాన పండితులు వస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఈ దేవస్థానం ప్రమేయం లేకుండా వారిష్టానుసారం దేవస్థానం పేరు ఉపయోగించుకుని శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నట్టు తెలుపుతూ భక్తుల నుంచి భారీ సంఖ్యలో నగదును వసూలు చేయుట జరుగుతున్నది. దేవదాయ, ధర్మదాయ శాఖ చట్టం 30/87 ప్రకారం నియమ నిబంధనలకు విరుద్ధం.. ఎంతమాత్రం క్షమార్హం కాని విషయం. సీతారాముల కల్యాణం నిర్వహణకు చట్టపరంగా, న్యాయపరంగా ఈ దేవస్థానం వారు సర్వహక్కులు కలిగి ఉన్నారు. అందువల్ల భద్రాచలం దేవస్థానం పేరును ఉపయోగించుకుంటూ భక్తుల నుంచి టిక్కెట్టు రూపంలో నగదు వసూలు చేస్తున్నందున అక్రమ వసూళ్లను, కల్యాణాన్ని నిలుపుదల చేసి సదరు నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఆ ఎఫ్‌ఐఆర్ కాపీని ఈ దేవస్థానానికి అందజేయాలని కోరడమైనది’ అంటూ విశాఖలోని త్రీటౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి అడ్రస్ చేస్తూ పోలీస్ కమిషనర్, దేవదాయ శాఖ డిప్యూటి కమిషనర్ తదితరులకు భద్రాచలం దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి సోమవారం పంపిన∙ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదుపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిర్వాహకులు బీజేపీ యువజన విభాగం పదవిలో ఉండడం వల్లే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వచ్చేది భద్రాచలం పండితులే కానీ..
‘ఈనెల 29న విశాఖ అయోధ్య న మూనా ఆలయంలో సీతారాముల కల్యాణం తలపెట్టాం. దానికి టిక్కెట్టు ధర ఇంకా నిర్ణయించలేదు. వసూళ్లు చేయలేదు. ఈ కల్యాణానికి భద్రాచలం నుంచి పండితులు (కొండవీటి రామలింగేశ్వరశర్మ) వస్తున్నారన్నమే గాని ఆ దేవస్థానం నుంచి కాదు. పోలీసులకు కూడా ఇదే విషయాన్ని చెప్పాం. భద్రాచలం దేవస్థానం ఈవో ఘాటు స్పందన సరికాదు. ఎవరో మాపై కిట్టని వారు ఆ దేవస్థానానికి ఫిర్యాదు చేసి ఉంటారు’ అని నమూనా ఆలయం నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.
Next Story