ఏటా నైరుతి రుతుపవనాలు కేరళను ఎప్పుడు తాకుతాయా? అని యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. సకాలంలోనే అవి కేరళలోకి ప్రవేశించాలని దేశ ప్రజానీకం కోరుకుంటుంది. అయితే ఈ ఏడాది సకాలంలో కాదు.. ఐదు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని వార్త చెప్పింది. అంతేకాదు.. సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని కూడా కుండబద్దలు కొట్టింది.
సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటో తేదీన కేరళను తాకుతాయి. అయితే ఒక్కోసారి వీటి రాక ఒకింత ఆలస్యమవుతుంది. ఇలా ‘నైరుతి’ రాక ఆలస్యమైతే దాని ప్రభావం వర్షపాతంపై పడుతుంది. అయితే ఈ సంవత్సరం ఈ రుతుపవనాల ఆగమనం ముందుగానే కాదు.. సాధారణానికి మించి వర్షాలను కురిపిస్తాయని ఐఎండీ తేటతెల్లం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల సీజను కొనసాగుతుంది. ఈ సీజనులో దేశం మొత్తమ్మీద సగటున 87 సెం.మీల వర్షం కురుస్తుంది. ఈ సంవత్సరం 105 శాతం వర్షపాతం (91.35 సెం.మీలు) నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. అంటే సాధారణంకంటే దాదాపు ఐదు సెం.మీలు అధికంగా వర్షం కురిసే వీలుందన్న మాట! కొన్నాళ్ల క్రితం పసిఫిక్ మహా సముద్రంలో ఉష్ణోగ్రతలను బట్టి ఈ ఏడాది అరకొర వానలకు కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు ఉండవచ్చని వాతావరణ నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అందుకు భిన్నంగా ఎల్‌నినో పరిస్థితులుండవని, వర్షాలు ఆశాజనకంగా కురవడానికి దోహదపడే లానినా ప్రభావమే ఈ రుతుపవనాల సీజనులో కొనసాగుతుందని ఐఎండీ గత నివేదికలోనే వివరించింది.
13నే అండమాన్‌లోకి నైరుతి..
నైరుతి రుతుపవనాలు కేరళను తాకడానికి ముందుగా అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయి. ఏటా సాధారణంగా ఇవి మే 19 నాటికి అండమాన్ నికోబార్ దీవులను తాకుతాయి. అయితే ఈ ఏడాది అవి ఈనెల 13 నాటికే అండమాన్‌లోకి ప్రవేశించనున్నాయని కొద్దిరోజుల క్రితం ఐఎండీ తెలిపింది. దీనికి అనుగుణంగా శనివారం విడుదల చేసిన నివేదికలో నైరుతి రుతుపవనాలు కేరళలోకి మే 27నే ప్రవేశించనున్నాయని ప్రకటించింది. నైరుతి ఆగమనంపై గడచిన 20 ఏళ్లలో అంటే.. 2005 నుంచి 2024 వరకు ఒక్క 2015 మినహా మిగిలిన అన్ని సంవత్సరాలూ ఐఎండీ వేసిన అంచనాలు నిజమయ్యాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు కేరళ నుంచి జూన్ ఏడో తేదీకల్లా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ (అనంతపురం)లోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది అవి ఐదు రోజులు ముందుగా కేరళను తాకడం వల్ల జూన్ రెండు మూడు తారీఖులకల్లా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా కేరళలోకి ప్రవేశించడమే కాదు.. వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని ప్రకటించడం ఇప్పుడు రైతాంగానికే కాదు.. పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు ఎంతో ఊరటనిస్తోంది.
ఏ ఏడాది ఎప్పుడు ప్రవేశం?
గడచిన ఐదేళ్లలో కేరళను నైరుతి రుతుపవనాలు ఎప్పడు తాకాయన్నది పరిశీలిస్తే..
సంవత్సరం తాకిన తేది అంచనా తేది
–––––––––––––––––––––––––
2020 జూన్ 1 జూన్ 5
2021 జూన్ 3 మే 31
2022 మే 29 మే 27
2023 జూన్ 8 జూన్ 4
2024 మే 30 మే 31
రెండు మూడు రోజుల్లో మళ్లీ భగభగలే..
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది వేసవి ఛాయలు మార్చి ఆఖరి నుంచే మొదలయ్యాయి. సాధారణంకంటే 4–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ దడ పుట్టించాయి. కానీ మూడు వారాల నుంచి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. కొంతసేపు మండుటెండలు, అంతలోనే ఉరుములు, మెరుపులు, వర్షం, ఈదురు గాలుల (దీనిని థండర్ స్టార్మ్ యాక్టివిటీగా పేర్కొంటారు)తో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టి వేసవి తాపం అంతగా అనిపించడం లేదు. వడగాడ్పుల ప్రభావం కూడా ఏమంత చూపడం లేదు. అయితే ఈ పరిస్థితి మరో రెండు మూడు రోజులకే పరిమితం కానుంది. ఎందుకంటే? నైరుతి రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాక (ఈనెల 13 తర్వాత) తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాల ఆగమనం జరిగాక సముద్రంపై నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపైకి వచ్చే తేమ గాలులు (సీ బ్రీజ్) నిలిచిపోయి, రాజస్థాన్ నుంచి వేడిగాలుల వీస్తాయి. దీంతో పగటి ఉçష్ణోగ్రతలు (45 డిగ్రీలకు పైగా) గణనీయంగా పెరుగుతాయని, వడగాడ్పుల తీవ్రత కూడా అధికమవుతుందని విశాఖపట్నానికి చెందిన ఐఎండీ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు. కోస్తాంధ్రకంటే రాయలసీమ, తెలంగాణలకు ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. ఈ పరిస్థితి జూన్ రెండు మూడు తేదీల వరకు కొనసాగుతుందన్నారు. మధ్య మధ్యలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముందస్తుగా నైరుతి రుతుపవనాల ప్రవేశం మంచి వర్షాలకు సంకేతమని ఆయన వివరించారు.