ఎవరి కోటలు వారికి సొంతం..
x

ఎవరి కోటలు వారికి సొంతం..

రాష్ట్రంలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు టిడిపికి కంచుకోటలు. ఇంకొన్ని చోట్ల వైఎస్ఆర్సిపికి అడ్డాలు. ఆ స్థానాల్లో పాగా వేయాలని ఇరు పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి.


(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)

తిరుపతి: రాష్ట్రంలో కొన్ని అసెంబ్లీ స్థానాలు ఇప్పటికి కూడా టీడీపీ పార్టీకి అందని ద్రాక్ష పండులానే మిగిలాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఎంత ప్రయత్నించినా ఆ స్థానాల్లో ఇప్పటికీ పాగా వేయలేకపోతోంది. ఆనాటి కాంగ్రెస్, ప్రస్తుత వైఎస్ఆర్సిపి కూడా కొన్ని చోట్ల టిడిపి కంచుకోటలను బద్దలు కొట్టలేకపోతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైన తమ ప్రత్యర్థుల కంచుకోటలను బద్దలు కొట్టాలని అధికార వైఎస్ఆర్సిపి, బిజెపి- జనసేన- టిడిపి కూటమి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ఆవిర్భవించిన తర్వాత పదోసారి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు టిడిపి ఐదుసార్లు పాలన సాగించింది. ఈ పరంపరలో కొన్ని సీట్లలో ఇంతవరకు గెలుపు సాధించలేకపోయింది. అందులో కొన్ని స్థానాలు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడినవి ఉంటే… ఇంకొన్ని స్థానాలు టిడిపి పురుడు పోసుకోకముందు నుంచే ఉన్నాయి.

అదేవిధంగా 12 ఏళ్ల వయసు ఉన్న ప్రస్తుత అధికార వైఎస్సార్సీపి పరిస్థితి కూడా అదే. కొన్ని స్థానాల్లో ఇప్పటికీ గెలవలేక పోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ఆవిర్భవించి ఇప్పటికి 42 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ పార్టీ ఏర్పడిన ఏడాదికే మొదటి అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. ఆంధ్రప్రదేశ్‌లో 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గానూ 289 చోట్ల పోటీ చేసిన టిడిపి 201 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014లో 175 స్థానాల్లో పోటీ చేసిన టిడిపి 102 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైంది. ప్రస్తుతం టిడిపి 140 స్థానాలలో సొంతంగా పోటీ చేస్తుంటే మరో 31 సీట్లలో మిత్రపక్షమైన జనసేన, బిజెపి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ఖాతా తెరవని టిడిపి

రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటివరకు టిడిపి ఖాతా తెరవని నియోజకవర్గాలు ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రభావం కొనసాగుతోంది. ఆ కోవలో... కడప జిల్లా పులివెందుల నియోజకవర్గాన్ని ప్రధానంగా చెప్పవచ్చు. పులివెందుల నియోజకవర్గానికి మూడు ఉప ఎన్నికలతో కలిపి 1978 నుంచి 2019 వరకు 13సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. అందులో పది సార్లు కాంగ్రెస్ పార్టీ, రెండు సార్లు వైఎస్ఆర్సిపి, ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టిడిపి ప్రతినిధులు పోటీపడినా విజయాన్ని అందుకోవడం సాధ్యం కాలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి అభ్యర్థిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు.

ఇక్కడ విచిత్రం..

ప్రకాశం జిల్లా నల్లమల అడవి ప్రాంతాన్ని అనుకుని ఉన్న ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం 1955లో ఏర్పడి 1970 తర్వాత రద్దయింది. మూడు దశాబ్దాల తర్వాత 2009 నుంచి ఎర్రగొండపాలెం ఉనికిలోకి వచ్చింది. కంభం నియోజకవర్గ పరిధిలో ఎర్రగొండపాలెం ఉన్నప్పుడు టిడిపి రెండుసార్లు విజయం సాధించింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒక ఉపఎన్నిక సహా 8 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు, 1962, 1967 ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి పూల సుబ్బయ్య విజయం సాధించారు. వైయస్సార్సీపి ఆవిర్భవించిన తర్వాత 2009, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్ విజయం సాధించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి సిపిఐ నేత పూల సుబ్బయ్య, ఆ తర్వాత ఆదిమూలపు సురేష్ మాత్రమే రెండుసార్లు గెలిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం వైఎస్ఆర్సిపి అభ్యర్థి గూడూరు చంద్రశేఖర్‌పై టిడిపి అభ్యర్థిగా ఎలక్షన్‌లో తలపడుతున్నారు.

నియోజకవర్గాల విభజన తర్వాత..

రాష్ట్రంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ తర్వాత రాయలసీమ జిల్లాలోని చిత్తూరు జిల్లా పూతలపట్టు, కర్నూలు జిల్లా శ్రీశైలం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, విజయనగరం జిల్లా రాజాం అసెంబ్లీ స్థానంలో కూడా టిడిపి పాగా వేయలేకపోతోంది. నెల్లూరు నగరం, రూరల్ నియోజకవర్గంలో కూడా టిడిపి విజయం సాధించలేదు. నెల్లూరు నగరం రెండు నియోజకవర్గాలుగా ఏర్పడడానికి ముందు నెల్లూరు స్థానంలో టిడిపి 1983, 1994లో విజయం సాధించింది. ఆ తర్వాత కర్నూలు జిల్లా కోడుమూరు, విజయవాడ వెస్ట్ నియోజవర్గంలో కూడా అదే పరిస్థితి.

టిడిపి ఆవిర్భవించిన తర్వాత 1983లో మాత్రమే విజయవాడ వెస్ట్‌లో గెలిచింది ఆ తర్వాత మళ్లీ గెలిచిన దాఖలాలు లేవు. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన వైజాగ్ ఈస్ట్, విశాఖ, మండపేట, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో ఇంతవరకు విజయాన్ని నమోదు చేసిన దాఖలాలు లేవు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీట్ నుంచి వైయస్సార్‌సిపి అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ పోటీ చేస్తుండగా ఆయనపై కూటమి అభ్యర్థిగా బిజెపి నేత సృజనా చౌదరి పోటీలో ఉన్నారు. ఇదిలా ఉంటే... కొన్ని సీట్లు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలవని నియోజకవర్గాలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి.

వైయస్సార్సీపి ఆవిర్భావంతో...

దివంగత సీఎం డా. వైఎస్సార్ మరణం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్సిపిని స్థాపించి ఎన్నికల బరిలోకి దిగారు. 2012 ఉప ఎన్నికలలో వైయస్ఆర్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డితో పాటు 17 సీట్లలో పోటీ చేసింది. వారిలో 15 మంది విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ 65 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది. 2019 ఎన్నికల్లో 175 సీట్లలో పోటీ చేసి 151 స్థానాల్లో సంచలన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఎన్నికలను పరిశీలిస్తే 24 స్థానాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలవలేదు. ఆ స్థానాల్లో 2012, 2014 ఎన్నికల్లో సాధించుకున్న సీట్లు కూడా కోల్పోయారు.

టిడిపికి బాగా పట్టున్న చిత్తూరు జిల్లా కుప్పంలో టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో కింజారపు అచ్చెన్నాయుడుపై తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి వైఎస్ఆర్‌సిపి అవిశ్రాంతంగా పోరాటం చేస్తోంది. అంతేకాకుండా గుంటూరు వెస్ట్, ఇచ్చాపురం, పెద్దాపురం, కొండపి, పాలకొల్లు, ఉండి, రేపల్లె, విజయవాడ వెస్ట్‌లో కూడా వైసిపి ఇంతవరకు గెలవలేదు. 2004లో మినహా ఇచ్చాపురం, ఉండి నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులే గెలిచారు.

వై నాట్ కుప్పం..

2024 సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంపై పట్టు సాధించాలని వైఎస్ఆర్సిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారింది. 1983, 1985 ఎన్నికల్లో ఎన్ రంగస్వామి నాయుడు.. టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత 1989 నుంచి ఎన్. చంద్రబాబు నాయుడు.. కుప్పం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ నియోజకవర్గంపై పట్టు సాధించడాన్ని వైఎస్ఆర్సిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి "ఆపరేషన్ పుంగనూరు" అమలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎన్ చంద్రబాబునాయుడు పై పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె చంద్రమౌళి గత ఎన్నికల్లో అనారోగ్యంతో మరణించారు. దాంతో ఇప్పుడు చంద్రమౌళి స్థానంలో ఆయన కుమారుడు కే భరత్ పోటీ చేస్తున్నారు.

అది టిడిపి సీటే...

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సిపి ఇంతవరకు విజయం సాధించలేదు. ఈ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన కరణం బలరాం వైయస్ఆర్సీపీలో ఉన్నారు. విజయం సాధించింది టిడిపి నుంచే... 2014లో ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయనపై వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసిన యడం బాలాజీ, 2019లో ఆమంచి వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేసిన కృష్ణమోహన్ విజయం సాధించలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్, వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కరణం వెంకటేష్, టిడిపి అభ్యర్థిగా మద్దులూరి మాల కొండయ్య యాదవ్ పోటీ పడుతున్నారు.

కమ్యూనిస్టు కోటలో...

కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ స్థానం కమ్యూనిస్టులకు అడ్డాగా ఉండేది. సిపిఎం చరిత్ర పురుషుడు పుచ్చలపల్లి సుందరయ్య మూడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన తర్వాత టిడిపి నుంచి రెండుసార్లు వల్లభనేని వంశీ గెలిచారు. ఈ నియోజకవర్గ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వంశీ ఇప్పుడు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలు టిడిపికి జీవన్మరణ సమస్యగా మారాయి. వైయస్సార్సీపి ఎలాగైనా పట్టు సాధిస్తామనే ధీమాతో సాగుతోంది. ఎత్తుకు పైఎత్తులతో సాగుతున్న ఆ రెండు పార్టీల అధినేతల్లో ఏ పార్టీకి ఓటర్లు పట్టం కడతారనేది ఇంకొన్ని రోజుల్లో తేలుతుంది.

Read More
Next Story