ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థులు వీరే
x

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థులు వీరే

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఒక స్థానం కమ్మకు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సీటును కాపు సామాజిక వర్గానికి కేటాయించారు.


ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉభయ గోదావరి జిల్లాలకు పేరాబత్తుల రాజశేఖర్‌లను ఖరారు చేసింది. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం ప్రకటించారు.

వచ్చే ఏడాది ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. కృష్ణా–గుంటూరు, తూర్పు గోదావరి–పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజక వర్గాల ఎమ్మెల్సీలుగా కేఎస్‌ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ ఉన్నారు. 2025 మార్చి 29తో వీరి పదవీ కాలం ముగుయనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ముందుగానే తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయడం గమనార్హం.
పేరాబత్తుల రాజశేఖర్‌ ఐపోలవరం ఎంపీపీగాను, జడ్పీటీసీగాను పని చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా కూడా పని చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్‌ అసెంబ్లీ సీటును రాజశేఖర్‌ ఆశించారు. అయితే పొత్తుల్లో ఈ సీటు టీడీపీకి లేకుండా పోయింది. కూటమి భాగస్వామి అయిన జనసేనకు కేటాయించారు. దీంతో కాకినాడ రూరల్‌ అసెంబ్లీ సీటు రాజశేఖర్‌కు లేకుండా పోయింది. సీఎం చంద్రబాబు రాజశేఖర్‌కు మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు తూర్పు గోదావరి–పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా రాజశేఖర్‌ పేరును ఖరారు చేశారు. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు.
కృష్ణా–గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆ పార్టీలో సీనియర్‌ నేత. గతంలో మంత్రిగా కూడా పని చేశారు. గత ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో రాజేంద్ర ప్రసాద్‌కు సీటు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. జనసేన నుంచి పోటీ చేసి గెలిచిన నాదెండ్ల మనోహర్‌ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యే స్థానం దక్కనందకు రాజేంద్రప్రసాద్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తన అనుచరులతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీడీపీ రాజేంద్రప్రాద్‌ను ప్రేయారిటీగా తీసుకొని కృష్ణా–గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. రాజేంద్రప్రసాద్‌ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. వైఎస్‌ఆర్‌సీపీ కూడా కృష్ణా–గుంటూరు జిల్లాల అభ్యర్థిగా పొన్నూరు గౌతమ్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
ఉమ్మడి కృష్ణా–గుంటూరు, తూర్పు గోదావరి–పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదుకు ఇది వరకే ఈసీ నోటీఫికేషన్‌ ఇచ్చింది. అక్టోబరు 1 నుంచి నవంబరు 6 వరకు ఓటు కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. నవంబరు 23న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించనుంది. డిసెంబరు 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. డిసెంబరులో ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు.
Read More
Next Story