ఏపీలో లూఠీలకు  రాత్రి పగలు  తేడా లేదు..
x

ఏపీలో లూఠీలకు రాత్రి పగలు తేడా లేదు..

ఇళ్లను కొల్లగొట్టడంలో గత ఏడాది కంటే ఈ ఏడాది దొంగలు ఆరితేరారు. పగలు, రాత్రి తేడా లేకుండా దోచుకున్నారు.


ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లు కొల్లగొట్టడంలో దొంగలు ముందున్నారు. వేరే రాష్ట్రాలకు చెందిన దోపిడీ ముఠాలు రాష్ట్రంలోకి ప్రవేశించడమే కాకుండా చెడ్డీ గ్యాంగుల వంటివి కూడా ఈ ఏడాది రాష్ట్రంలో దోచుకోవడంలో ముందున్నారు. ఇళ్లలోకి ఎవ్వరూ లేని సమయంలో దూరి లూఠీ చేయడం ఒకెత్తయితే అందరూ ఉండగానే ఇళ్లలోకి పగలు వచ్చి మాటా మాటా కలిపి వారిని కట్టేసి లూఠీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కొందరిని హత్య చేసి లూఠీ చేయంగా మరికొందరిని కట్టేసి లూఠీలు చేశారు. పోలీసులు కొన్న కేసులు ఛేదించారే కాని కొన్ని కేసులు ఛేదించలేకపోయారు.

రాష్ట్రంలో గత సంవత్సరం (2023) పగటి పూట 682 లూఠీలు జరగ్గా, ఈ సంవత్సరం (2024) పగటిపూట 802 లూఠీలు జరిగాయి. ఇక రాత్రి పూట గత సంవత్సరం (2023) 2,846 లూఠీలు జరగ్గా ఈ సంవత్సరం (2024) 3,114 లూఠీలు జరిగాయి. అంటే ప్రజలు రేయింబవళ్లు నిద్ర లేకుండా దోపిడీ దారులు రాకుండా కాపలా ఉండటానికే సరిపోతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో రాత్రి పూట దొంగలు ఇంటిని లూఠీ చేయడంతో పాటు ఇంటి వాళ్లను కట్టేసి అత్తా కోడళ్లను రేప్ చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. శాంతి భద్రతలు సరిగ్గా ఉండి సకాలంలో గస్తీలు చేస్తూ ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కాదని ప్రజలు అంటున్నారు. అప్పటికీ కొందరు గూర్ఖాలు రాత్రులు గస్తీ తిరిగినా వారిని ఏమార్చి ఈ లూఠీలకు పాల్పడుతున్నారు.

పగటి పూట ఇల్లు కొల్లగొట్టడాలు 17.5 శాతం పెరిగితే, రాత్రి పూట ఇళ్లు కొల్లగొట్టడాలు 9.4 శాతం పెరిగాయి. గత సంవత్సరం కానీ, ఈ సంవత్సరం కానీ రాత్రి పూట ఇళ్ల లూఠీలు ఎక్కువగానే జరిగాయి. వేల కుటుంబాలు లూఠీకి గురయ్యాయంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చరు. ఈ లూఠీలకు పాల్పడే వారు ఎక్కువగా గంజాయి వంటి మత్తుమందులు తీసుకుంటున్నారు. ఇళ్లలోకి ప్రవేశించగానే చంపడం, రేప్ లు చేయడం, విలువైన వస్తువులు, డబ్బు దోచుకోవడం చేస్తున్నారు. గంజాయి తీసుకునే వారు రేయింబవళ్లు మత్తులోనే ఉంటున్నారు.

మాదక ద్రవ్యాలు తీసుకునే వారు, అమ్మే వారిపై నమోదైన కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గత సంవత్సరం 1,761 నేరాలు జరగ్గా, ఈ సంవత్సరం 1,819 నేరాలు జరిగాయి. అంటే మూడు శాతం నేరాలు పెరిగాయి. మాదక ద్రవ్యాల కేసులు పట్టణాలు, నగరాల్లో వేలల్లో నమోదు కావడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మత్తులో ఏమి చేస్తున్నారో తెలియక నేరాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. మాదక ద్రవ్యాలు తీసుకునే వారికి వేరే రాష్ట్రాల వారితో సంబంధాలు ఉండటం, వారు, ఇక్కడి వారు కలిసి దోపిడీలు, రాబరీలు, లూఠీలు చేస్తున్నారని పోలీసులు విచారణల్లో తేలుతున్నాయి. దొంగతనాలు చేసే వారు స్థానికంగా ఉంటున్న వారే కాకుండా వేరే రాష్ట్రాల గ్యాంగ్ లు వస్తుంటే ఆ గ్యాంగ్ లను పట్టుకోవడంలో పోలీసులు కొంత వరకు విజయం సాధించినా మరి కొందరు తప్పించుకు తిరుగుతూనే ఉన్నారు.

Read More
Next Story