రాష్ట్ర అంతర్గత భద్రతకు ప్రమాదం ఉంది
x
AP Dy CM Pawan Kalyan

రాష్ట్ర అంతర్గత భద్రతకు ప్రమాదం ఉంది

గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.


సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకం. అందుకే రాష్ట్ర పోలీసులను, పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి లేఖ రాశానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యం అని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలింది. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని అన్నారు. సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో, రాష్ట్ర పోలీసులు కూడా అంతర్గత భద్రతపై అంతే సీరియస్ గా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఉగ్రవాదుల జాడలు కనిపించిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని నేను లేఖ ద్వారా డీజీపీ గారిని కోరాను. పాలనా యంత్రంగంతో సమన్వయం చేసుకొని ఉగ్రవాద జాడలు కలిగిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించాను. ముఖ్యంగా వలసదారుల విషయంలో తగిన నిఘాను ఉంచితే జరగబోయే ప్రమాదాలను నివారించవచ్చు. అలాగే తీర ప్రాంతంలో సైతం నిరంతర పర్యవేక్షణ, నిఘా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలోనూ కాకినాడలో బయట వ్యక్తులు బోట్లలో వచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయని పేర్కొన్నారు.

తీరంలో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలి

తీరంలో కొత్త వ్యక్తుల కదలికలు, వారి చర్యలను గమనించాల్సిన అవసరం ఉంది. పోలీసులు అజాగ్రత్తగా ఉండకుండా అంతర్గత భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన సంయుక్త ఆపరేషన్ లోనూ రాష్ట్రంలో కొన్ని ఉగ్రవాద జాడలు కనిపించినట్లు తెలుస్తోందన్నారు.

రోహింగ్యాల వలసలపై దృష్టి సారించాలి

గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు విపరీతంగా రోహింగ్యా వలసదారులు వచ్చారు. ముఖ్యంగా 2017-18 ప్రాంతాల్లో కోల్ కత నుంచి స్వర్ణకార వృత్తి నిమిత్తం చాలా అధికంగా వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చారు. రోహింగ్యాల మూలాలు మయన్మార్ లో ఉన్నాయి. వారి వలసలతో స్థానిక యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండు. తెలంగాణ ఏర్పాటులో ఉన్న మూడు ప్రధాన డిమాండ్లలో స్థానికులకే ఉద్యోగాలు అనేది కూడా ప్రధాన నినాదమన్నారు.

రోహింగ్యాలు దేశం దాటి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకునేలా రేషన్, ఆధార్, ఓటరు కార్డులు పొందుతున్నారు. మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు, వ్యాపారాలు వారు చేసుకుంటున్నారు. రోహింగ్యాలకు స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో మన యంత్రాంగం నిర్లక్ష్యం ఉంది. వారికి ఎలా ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు వస్తున్నాయి..? ఎవరు ఇస్తున్నారనేది తేలాలి. మన వ్యవస్థలోనే కొందరు వ్యక్తులు వారికి సహకరిస్తున్నారని అర్ధం అవుతుంది. రోహింగ్యాలు ఈ దేశ పౌరులుగా మారి, మన అవకాశాలను ఎలా కొల్లగొడుతున్నారనే దానిపై అందరిలోనూ చైతన్యం రావాలి. రోహింగ్యాలు స్థానికులుగా మారడానికి సహరిస్తున్న యంత్రాంగంపై కన్నేసి ఉంచాలని, అంతర్గత భద్రతలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు బాధ్యత గల ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా స్పందిస్తూ లేఖ రాశానని పవన్ కల్యాణ్ చెప్పారు.

Read More
Next Story