రైల్వే జోన్ కు ఈసారీ శంకుస్థాపన లేదా?
ఈనెల 8న ప్రధాని విశాఖ పర్యటన. ఆరోజు కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు . ఆ జాబితాలో లేకుండా పోయిన విశాఖ రైల్వే జోన్. జోన్ ప్రకటనకు పదేళ్లయినా ఇంకా మోక్షం కలగదా?
విశాఖకు రైల్వే జోన్.. ఈ పేరు అధికారికంగా ప్రకటించి పదేళ్లు దాటింది. అప్పట్నుంచి అదిగో ఇదిగో అంటున్నారే తప్ప అడుగు ముందుకు పడడం లేదు. తాజాగా ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ వస్తున్నారు. ఈ సంగతి తెలిసి ఉత్తరాంధ్ర వాసులు జోన్ కు శంకుస్థాపన చేస్తారేమోనని ఆశపడుతున్నారు. కానీ ఇప్పటిదాకా ఆయన షెడ్యూల్లో జోన్ తప్ప ఇతర కార్యక్రమాలే ఉండడంతో మరోసారి నిరాశతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నానికి రైల్వే జోన్ డిమాండ్ అర్థ శతాబ్దానికి ముందు నుంచే ఉంది. విశాఖ ఉక్కు ఉద్యమంతో పాటే ఇదీ మొదలైంది. ఇక అప్పట్నుంచి జోన్ ఒక నినాదంగానే మిగిలిపోయింది. ఎట్టకేలకు 2014లో కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీ అంశాల్లో ఈ రైల్వే జోన్ అంశాన్ని చేర్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఈ జోన్ గురించి పట్టించుకోవడం మానేసింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు జోన్ కోసం ఒత్తిడి తేవడంతో పాటు ఆందోళనలు చేపట్టాయి.
దీంతో 2019 ఫిబ్రవరి 27న (అప్పటి సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు) కేంద్ర ప్రభుత్వం.. విశాఖపట్నం కేంద్రంగా 'దక్షిణ కోస్తా రైల్వే జోన్'ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇక రైల్వే జోన్కు అడ్డంకులు తొలగిపోయినట్టేనని అంతా సంబరపడ్డారు. కానీ ఆ తర్వాత జోన్పై కదలికే లేకుండా పోయింది. ఈ జోన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా కేంద్రం ఏవేవో కుంటిసాకులు చెబుతూ వస్తోంది. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం జోన్కు అవసరమైన స్థలం ఇవ్వలేదని కొన్నాళ్లు బురద జల్లింది. కానీ వైసీపీ ప్రభుత్వం నగరంలోని ముడసర్లోవ ప్రాంతంలో 52 ఎకరాలు జోన్ కోసం కేటాయించినట్టు ఆధారాలతో చూపడంతో మరో వంకను వెతుక్కుంది. ఈ స్థలం ఆక్రమణలో ఉందని కొన్నాళ్లు, వాటర్ బాడీస్లో ఉందని మరికొన్నాళ్లూ చెబుతూ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై జీవీఎంసీ అధికారులు అక్కడ ఆక్రమణలను తొలగించి, మరోసారి సర్వే చేయించి, అక్కడ ఆక్రమణలు లేవని నివేదిక సమర్పించారు. అయినా సంతృప్తి చెందని రైల్వే శాఖ.. వివాదాలన్నిటినీ పరిష్కరించి, ప్రహరీని నిర్మించి ఇవ్వాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
జోన్ ప్రకటించాక మూడుసార్లు ఎన్నికలు..
విశాఖ రైల్వే జోన్ ప్రకటన వెలువడ్డాక మూడు దఫాలు 2014, 2019, 2024ల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. రైల్వే జోన్ డిమాండ్కు యాభై ఏళ్లు, విభజన హామీకి పదేళ్లు, జోన్ ఏర్పాటు ప్రకటనకు ఐదేళ్లు పూర్తయ్యాయి. కానీ ఈ జోన్ ఏర్పాటుకు అవసరమైన శంకుస్థాపనకు మాత్రం కేంద్రం ముందుకు రావడం లేదు. తరచూ విశాఖకు రైల్వే జోన్ ను ప్రకటించాం.. అని బీజేపీ నేతలు, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ పెద్దలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలా అప్పట్నుంచి ఈ ప్రాంత వాసులు జోన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నారు.
8న ప్రధాని మోదీ వస్తున్నారు.. కానీ..
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వస్తున్నారంటే ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురిస్తుంటాయి. ఆయనొస్తే రైల్వే జోన్కు శంకుస్థాపన చేస్తారని కలలు కంటూనే ఉన్నారు. కానీ వివిధ సందర్భాల్లో మోదీ వైజాగ్ వస్తూనే ఉన్నారు.. పోతూనే ఉన్నారు. కానీ ఎందుకనో ప్రధాని మాత్రం జోన్ జోలికి వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో ఈనెల 8న ప్రధాని మోదీ విశాఖ వస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆయన ఈ వేదికపై నుంచే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో రూ.65,370 కోట్ల పెట్టుబడితో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రూ.11,542 కోట్ల పెట్టుబడితో నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన, మరికొన్ని జాతీయ రహదారులను వర్చువల్గా జాతికి అంకితం చేయడం వంటివి ఉన్నాయి. కానీ ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ అయిన రైల్వే జోన్ ను మాత్రం చేర్చలేదు. కాగా ప్రధాని పర్యటనపై గురువారం విశాఖ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రైల్వే శాఖ తప్ప ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. దీనిని బట్టి ప్రధాని ఈసారి పర్యటనలోనూ విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన కార్యక్రమం లేనట్టేనని తేటతెల్లమవుతోంది. అయితే ఆఖరి నిమిషంలో రైల్వే జోన్ శంకుస్థాపనను చేరుస్తారేమోనన్న చిన్న ఆశ ఇంకా బీజేపీ నాయకుల్లో ఉంది.
పాలకుల్లో ఏది చిత్తశుద్ధి?
ప్రతిష్టాత్మకమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్పై అటు కేంద్రానికే కాదు.. ఇటు రాష్ట్ర పాలకుల్లోనూ చిత్తశుద్ధి కొరవడడమే జాప్యానికి కారణమవుతోంది. ప్రతిపక్షంలో ఉండగా జోన్ కోసం గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జోన్ గురించే మాట్లాడడం గాని, కేంద్రంపై ఒత్తిడి తేవడం గాని మానేశారు. ఇదే ఆసరాగా ఇప్పుడు కేంద్రం జోన్ ను పట్టించుకోవడం మానేసింది. 'విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం ఏళ్ల తరబడి కుంటిసాకులు చెబుతూనే వస్తోంది. రాష్ట్ర విభజన హామీలో రైల్వే జోన్ను చేర్చి పదేళ్లు దాటింది. జోన్ ను ప్రకటించి ఐదేళ్లు అవుతున్నా కేంద్ర ప్రభుత్వం ఇంకా జాప్యం చేయడం తగదు. అధికారంలో ఉన్న కూటమి పాలకులకు జోన్పై చిత్తశుద్ధి లేకపోవడం కూడా కేంద్రం నిర్లిప్తతకు ఓ కారణం. ఇప్పటికైనా రైల్వే జోన్ కు శంకుస్థాపన చేసి శరవేగంగా పూర్తి చేయాలి' అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.